బెంగతో వృద్ధురాలు కోమాలోకి..
బ్యాంక్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలని గ్రామస్తుల డిమాండ్‌

  మిరుదొడ్డి : కొడుకు తీసుకున్న పంట రుణం చెల్లించకపోవడంతో తల్లి ఆసరా పింఛన్‌ను బ్యాంకు అధికారులు అప్పు కింద జమ చేసుకున్నారు. దాంతో పింఛన్‌ రావడం లేదన్న బెంగతో వృద్ధురాలు కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టం లచ్చవ్వ నిలువ నీడ లేక కడు పేదరికంలో ఉంది. ప్రభుత్వం
అందిస్తున్న రూ.2016 వద్ధాప్య పింఛన్‌ డబ్బులే ఆమెకు జీవనాధారం. లచ్చవ్వ కొడుకు లచ్చయ్య పేరు మీద ఎకరన్నర భూ మి ఉంది. లచ్చయ్య తిమ్మాపూర్‌ ఆంధ్రాబ్యాంకులో క్రాప్‌లోను ద్వారా రూ.30వేలు తీసుకున్నాడు. రెండేండ్ల కింద లచ్చయ్య మృతిచెందాడు. కొడలు పుష్ప, లచ్చవక్వ చిన్న గుడిసెలో నివాసముంటూ జీవితాన్ని గడుపుతున్నారు. కొడుకు చేసిన అప్పు తీర్చకపోవడంతో బ్యాంకు అధికారులు లచ్చవ్వ పింఛన్‌ డబ్బులను అప్పు కింద జమ చేసుకుంటున్నారు.

దీంతో ఆమెకు నాలుగు నెలలుగా పింఛన్‌ రావడం లేదు. పింఛన్‌ ఇవ్వాలని పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగింది. క్రాప్‌ లోన్‌ కింద జమ చేస్తున్నామని బ్యాంకు మేనేజర్‌ చెప్పాడు. ఈ క్రమంలో ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లచ్చవ్వ పింఛన్‌ రాకుంటే బతికేదెట్టానన్న బెంగతో అనారోగ్యానికి గురైంది. సోమవారం ఆమె కోమాలోకి వెళ్లింది. వెంటనే గ్రామస్తులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పింఛన్‌ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేసిన బ్యాంక్‌ మేనేజర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

Courtesy Nava Telangana