టంకశాల అశోక్

తబ్లిగీ తప్పుల వల్ల వారికే గాక మొత్తం ముస్లిం సమాజానికి, దేశానికి కూడా హాని కలుగుతున్నది. అది తక్షణ స్థాయిలో తమతో సహా అందరి ఆరోగ్యానికి, దీర్ఘకాలికంగా సామాజిక సామరస్యతకు సంబంధించినది. ఢిల్లీ కార్యక్రమాల నిర్వహణలో తబ్లిగీతో పాటు కేంద్రం తప్పులు ఎట్లుండినా, తర్వాతకాలంలో సంస్థ నాయకులు, అనుయాయుల ధోరణి సవ్యంగా ఉన్నట్లయితే, తక్కిన ముస్లిం సమాజం తను చేయని తప్పుకు సంజాయిషీ ఇచ్చుకోవలసి రావటం గాని, అవకాశం కోసం ఎప్పుడూ ఎదురుచూసే వ్యతిరేక శక్తులకు ఇదొక వరంగా మారటం గాని జరిగేది కాదు.

ఇస్లాంలో తబ్లిగీ జమాత్‌ ఒక శాఖ. 1925 లో ఆరంభమైన ఆ సంస్థ లక్ష్యం తమ మతా న్ని సంస్కరించుకోవటం. సంస్కరణకు అర్థం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునీకరించటం కావచ్చు, లేదా ఆధునిక పరిణామా లు తమ ప్రవక్త మౌలిక బోధనలకు హానికరం గా ఉన్నాయి గనుక తిరిగి ఆ మౌలికత వైపు వెళ్లాలనుకోవటం కావచ్చు. ఈ రెండు విధాలై న పురోగామి, తిరోగామి సంస్కరణలు, ఆ పనిచేసే శాఖలు కూడా మనకు అనేక మతాల చరిత్రలలో కన్పిస్తాయి.

అటువంటి వాటిలో తబ్లిగీ జమాత్‌ ఒకటి. అకడమిక్‌గా చెప్పాలంటే వారు చెప్తున్న మత సంస్కరణ తిరోగామి సంస్కరణ. 1925 నుం చి 95 సంవత్సరాలుగా ఆ సంస్థ అదే లక్ష్యాలతో పని చేస్తున్నది. దాని అనుయాయులు అనేక దేశాలలో లక్షల సంఖ్యలో ఉన్నారు. తిరిగి అకడమిక్‌గా చెప్పాలంటే స్వభావరీత్యా తబ్లిగీ ఒక ఫండమెంటలిస్టు సంస్థ అయినప్పటికీ, కనీసం మన దేశంలో సాధారణ మత కార్యక్రమాలు మినహా మత విద్వేష కార్యకలాపాలు, కలహాల వంటివాటికి పాల్పడిన రికార్డు ఉన్నట్లు లేదు.

ఇంతకూ తప్పు ఎక్కడ జరిగింది? ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ ప్రార్థనలకు సంబంధించి ఒకవైపు ఆ సంస్థ, మరొకవైపు కేంద్ర ప్రభుత్వం అధీనంలో గల ఢిల్లీ పోలీసులు ఎవరి వాదనలు వారు చెప్తున్నారు. ఇరువురి వాదనలను నిష్పక్షపాతంగా, జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఎవరు కూడా అన్ని విషయాలను దాచకుండా వెల్లడిస్తున్నట్లు తోచదు. అట్లా ఎందుకు అనిపిస్తున్నదో విశ్లేషించేందుకు ఇది సందర్భం కాదు గనుక అటుంచుదాం. ఆ వివరాలు ప్రస్తుతం ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ చేస్తున్న దర్యాప్తులో, తర్వాత కోర్టు విచారణలలో బయటకురావచ్చు.

ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్‌ ఇతర దేశాల నుంచి వచ్చినవారి ద్వారా ఇక్కడ సంక్రమిస్తున్నది. ఇది విదేశాల నుంచి వచ్చిన భారతీయుల నుం చి ఇతర భారతీయులకు స్థానికంగా సోకింది. వారి కుటుంబసభ్యులకు, ఇంకా ఇతరులకు కూడా. అట్లా బయటినుంచి వచ్చిన భారతీయులలో కొందరికి వారు అక్కడ బయల్దేరే సమయానికి, లేదా ఇక్కడకు చేరిన తొలి రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడలేదు. అది ఆ తర్వాత పరీక్షలలో తేలింది. కొందరైతే ఆ విషయం ముందే తెలిసి కూడా దాచిపెట్టారు. పోలీసులు,వైద్యులు కనుగొన్న తర్వాత కూడా సహకరించనివారు, క్వారంటైన్‌ను ఉల్లంఘిం చి తిరుగుతున్నవారు, ఈ కారణాల వల్ల కుటుంబసభ్యులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నవారు మరికొందరు.

ఢిల్లీ ప్రార్థనలకు లాక్‌డౌన్‌ కన్న ముందే వచ్చిన విదేశీయులకు వ్యాధి లక్షణాలు వారు తమ దేశాల నుంచి బయలుదేరటానికి ముం దే ఉన్నాయా, ఉండి ఆ దశలో బయటపడలేదా అన్న వివరాలు మనకు తెలియదు. అక్క డ వారి విమానాశ్రయాలలో, ఇక్కడ ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన వైద్య పరీక్షలు ఏమిటో కూడా తెలియదు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి వందలు, వేల మంది రోజుల తరబడి ప్రార్థనలు జరుపుతుండగా ఆ మసీదుకు సరి గ్గా ఆనుకునే ఉన్న పోలీస్‌స్టేషన్‌ వారు, మసీదులపై ప్రత్యేక నిఘా వేసే ఇంటెలిజెన్స్‌ వారు ఏమి చేశారన్నదీ తెలియదు. తబ్లిగీ ప్రార్థనల కు వచ్చిన సమూహాలకు, కరోనాకు సంబం ధం గల కేసుల గురించి తెలంగాణ అధికారు లు చెప్పేవరకు,కేంద్రం తన విస్తృతమైన, బలమైన యంత్రాంగం ద్వారా ఎందువల్ల తెలుసుకోలేకపోయిందో అంతకన్నా అర్థం కాదు.

ఇంతకూ తప్పు ఎక్కడ జరిగింది? ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ ప్రార్థనలకు సంబంధించి ఒకవైపు ఆ సంస్థ, మరొకవైపు కేంద్ర ప్రభుత్వం అధీనంలో గల ఢిల్లీ పోలీసులు ఎవరి వాదనలు వారు చెప్తున్నారు.

ఈ అనేకానేక వివరాలు, ప్రశ్నలు ఎట్లున్నప్పటికీ, తబ్లిగీ నాయకత్వం చేసిన స్పష్టమైన మొదటి తప్పు- లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంట నే ప్రార్థనలను ఆపివేయకపోవటం. తమ కార్యక్రమాలను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించి ఆ విషయం అధికారులకు, మీడియాకు తెలియజేయకపోవటం. తమ విదేశీ, స్వదేశీ ప్రచారకులు ఎవరూ దేశంలోని వివిధ రాష్ర్టాలకు ప్రచారం నిమిత్తం వెళ్లరాదని ఆదేశించకపోవటం. ఒకవేళ అప్పటికీ ఎవరైనా వెళ్లి ఉం టే వెంటనే ఉప సంహరించుకోవాలంటూ చెప్పకపోవటం. కనీసం వ్యాధి తీవ్రత పెరుగుతుండిన సమయంలోనైనా ఆ పనిచేయకపోవటం. ఇవన్నీ తబ్లిగీ నాయకత్వం చేసిన మొదటి తరహా తప్పులు.

ఇక రెండవ తరహావి- తమ అనుయాయులకు సంబంధించినవి. లాక్‌డౌన్‌కు ముందూ తర్వాత వేలాది మంది అనుయాయులు అనే క రాష్ర్టాలకు వెళ్లిపోయారు. వారిలో పలువురికి వ్యాధిసోకిన వార్తలు కొద్దిరోజుల్లోనే రాసాగాయి. వారు తమ వివరాలు అధికారులకు తెలియజేయటం లేదని, సహకరించటం లేద న్న వార్తలు కూడా వచ్చాయి. అటువంటప్పు డు ఢిల్లీలోనూ, స్థానికంగానూ గల తబ్లిగీ పెద్ద లు వెంటనే రంగంలోకి దిగవలసింది. ఢిల్లీ మర్కజ్‌ ప్రధాన ప్రతినిధి, ఆ మరునాడు ప్రధాన గురువు ఒక్కొక్కసారి తమ అనుయాయులకు విజ్ఞప్తులు చేసిన మాట నిజం. కానీ అది ఎంతమాత్రం చాల లేదు. వ్యాధి పెరుగుతున్న లెక్కలు, అందులో తబ్లిగీ యాత్రికుల వాటాలను కేంద్ర, రాష్ట్ర అధికారులు రోజూ ప్రకటిస్తున్నారు. పైన చెప్పినట్లు అధికారులకు సహకరించనివారు, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించేవారు ఇతరులలోనూ ఉన్నారు. కానీ తబ్లిగీ ఒక వ్యవస్థీకృత సంస్థ అని గుర్తించాలి. ఆ సం స్థ బాధ్యులు, అనుయాయులు ఇప్పటికైనా తమ కోసం సమాజం కోసం బాధ్యతగా వ్యవహరించాలి. తబ్లిగీతో సంబంధం లేకున్నా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు ఇప్పటికే అటువంటి విజ్ఞప్తి చేసింది. వారు దేశంలోని మసీదుల్లో నమాజును మొదటనే ఆపివేశారు. ప్రభుత్వానికి సహకరించి నియమాల ను పాటించాలని ప్రకటించారు.

వెనుకబడి ఉన్నది తబ్లిగీ ఒక్కటే. కేవలం వారి తప్పులు ముస్లిం సమాజా న్ని అంతా ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టుతున్నాయి.ఇటువంటి అవ కాశాల కోసం ఎదురుచూసే శక్తులకు ఇది ఒక వరంగా మారిం ది. ఆ శక్తులకు బయట కూడా సాధారణ ప్రజలలో తబ్లిగీ యాత్రికుల తీరు వ్యతిరేకతను పెంచుతున్నది. మొదట అనుకున్నట్లు ఈ ధోరణి వల్ల తమతో సహా అందరి ఆరోగ్యాలకు ముప్పు ఏర్పడుతున్నది. ఇటువంటి శక్తుల వల్ల, ప్రజలలోనూ వ్యతిరేకతల వల్ల దీర్ఘకాలంలో సామాజిక సామరస్యతలకు ప్రమాదం పొంచి ఉన్నది.

Courtesy Namasthe Telangana