– ‘షాహీన్‌బాగ్‌ ఖాళీ’ అంటూ తప్పుడు వార్తలు
– ఢిల్లీ అల్లర్ల పైనా అదే తీరు

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు, దీక్షలతో హోరెత్తిస్తున్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ దేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పలువురు ప్రముఖులు, వర్గాల నుంచి మద్దతును సైతం కూడగట్టుకున్నది. అలాంటి నిరసనలపై బీజేపీ భజన మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నది. అవాస్తవాలతో నిరసనకారులను మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నది. ఢిల్లీ అల్లర్ల పైనా కల్పితాలు ప్రచారం చేసింది. ఒక వర్గంపై మాత్రమే దాడులు జరిగాయని తప్పుడు ప్రసారాలు చేసింది. దేశరాజధానిలోని షాహీన్‌బాగ్‌ గత 80 రోజులుగా సీఏఏ వ్యతిరేక నిరసనలతో హోరెత్తుతున్నది. ముఖ్యంగా మహిళలు పాల్గొంటున్న ఈనిరసనలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పలువురు ప్రముఖులు సైతం ఈ నిరసనలను కొనియాడారు. షాహీన్‌బాగ్‌ ప్రేరణగా దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు జరుగుతున్నాయి.

అలాంటి నిరసనలను బీజేపీ నాయకులు,ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడువార్తలు, ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ‘షాహీన్‌బాగ్‌ ఖాళీ’ అనే హాష్‌ట్యాగ్‌తో సదరు మీడియా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ చేసింది. వాస్తవానికి గత శుక్రవారం ప్రార్థనల నిమిత్తం కొందరు మహిళలు షాహీన్‌బాగ్‌ నిరసన వేదిక వద్ద నుంచి వెళ్లిపోయారు. మరికొందరు ఢిల్లీ అల్లర్లలో బాధితులకు సహాయం అందించడానికి వెళ్లారు. అయితే అప్పటి వరకూ షాహీన్‌బాగ్‌ నిరసనలపై కన్నెత్తి చూడని సదరు మీడియా సంస్థలు.. ఇదే అదనుగా భావించాయి. షాహీన్‌బాగ్‌ ఖాళీ అయిందనీ, నిరసన కారులు అక్కడ నుంచి వెళ్లిపోయారని తమ ఛానెళ్లలో ఇష్టం వచ్చినట్టు ప్రసారాలు చేశాయి. ‘బిర్యానీ అందడకపో వడంతోనే నిరసనకారులు షాహీన్‌బాగ్‌ నుంచి వెళ్లిపో యారు’ అంటూ సదరు మీడియా ఆరోపణలు లేవనెత్తడం దారుణమని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అనుకూల మీడియాకు చెందిన ఒక ప్రతినిధి గత శుక్రవారం మధ్యాహ్నం షాహీన్‌బాగ్‌లో మహిళా నిరసనకారులు లేని సమక్షంలో ఉద్దేశపూర్వకంగానే అక్కడికి రిపోర్టింగ్‌కు వెళ్లారు. నిరసనకారులు అక్కడ లేరనీ, వారి నిరసనలు తగ్గుముఖం పట్టాయని తప్పుడు వార్తలను సదరు వార్తా ఛానెల్‌ ప్రసారం చేసింది. నిరసనకారులు లేని ఫొటోలనే పదేపదే చూపిస్తూ తమ వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాయి.
ఇక మరొక ఛానెల్‌ అయితే ఢిల్లీ అల్లర్లను కేవలం ఒక వర్గంపై దాడిగా మాత్రమే చూపెట్టాయి. ప్రజలను రెచ్చగొ ట్టేలా చేశాయి. ఒక వర్గాన్ని అమాయకులు అంటూ, మరొక వర్గాన్ని మూకగా పేర్కొంటూ అభ్యంతరకర పదాలను ఉప యోగించాయి. సదరు అమాయక వర్గంపై మాత్రమే దాడులు జరిగాయనీ, వారి ఇండ్లు లూటీ అయ్యాయని వార్త లను ఇష్టం వచ్చినట్టుగా బీజేపీ మీడియా ‘సృష్టించింది’. అయితే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా కు తాము దూరం పాటిస్తామనీ, వాటితో అప్రమత్తంగా ఉంటామని షాహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు.

Courtesy Nava Telangana