నేడు మహత్తర అక్టోబర్‌ విప్లవ 102వ వార్షికోత్సవం
మానవ సమాజ గమనంలో సోషలిజం తిరుగులేని ముందడుగు. ఒక దేశంలోనో కొన్ని దేశాల్లోనో ఎదురు దెబ్బలు తిన్నా అంతిమంగా ఆ అడుగు పడాల్సిందే. కారణం పెట్టుబడిదారీ ప్రపంచం పరిష్కరించజాలని అంశాలన్నింటినీ శాశ్వతంగా సోషలిజం పరిష్కరిస్తుందని రష్యన్‌ కార్మికవర్గ విప్లవ ప్రభుత్వం నిరూపించింది. వెనుకబడిన, ప్రధానంగా వ్యవసాయ దేశమైన రష్యా, ఫ్యూడల్‌ ప్రభువుల పాలనలో 300 సంవత్సరాలు మగ్గిన రష్యా, సోషలిజం నిర్మాణంతో 20,30 సంవత్సరాల లోనే సామ్రాజ్య వాద దేశాల కంటే ఉన్నతంగా ఎదగడమే అందుకు నిదర్శనం.

అది 1917 నవంబరు 7. ప్రపంచం చూపంతా రష్యా పైనే. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) భీకరంగా సాగుతున్న రోజులు. రెండు సామ్రాజ్యవాద శిబిరాలు తమ లాభాల కోసం, భూవిస్తరణ కోసం మొత్తం మానవాళిని యుద్ధంలోకి లాగాయి. యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎలా ముగుస్తుందో కూడా తెలియని జనం యుద్ధంలో భాగస్వాములు చేయబడ్డారు. బ్రిటీష్‌ పాలిత దేశం కాబట్టి మన దేశం నుండి కూడా 15 లక్షల మందిని సైనికులుగా లాక్కుపోయారు. ఈ యుద్ధం సామ్రాజ్యవాద యుద్ధమనీ, కార్మికులకూ, రైతాంగానికీ తదితర పీడిత ప్రజానీకానికి ఈ యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేదనీ, ఇది పెట్టుబడిదారుల లాభాల కోసం, దురాక్రమణల కోసం జరుగుతున్న యుద్ధమని అందువలన రష్యాలో అంతర్యుద్ధం రేపి తరతరాల జారు ప్రభువుల పాలనను దాని కొనసాగింపుగా వచ్చిన పెట్టుబడిదారీ పాలనను రష్యన్‌ కార్మికవర్గ మహా విప్లవం కుప్ప కూల్చేసింది. తొలి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణాన్ని కార్మిక వర్గం ప్రారంభించింది. దోపిడీ రహిత ప్రపంచానికి రష్యన్‌ కార్మికవర్గ మహా విప్లవం బీజాలు నాటింది. దేశదేశాలలో జరుగుతున్న శ్రామిక వర్గ పోరాటాలకూ, పరాయి పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాలకు దిశా నిర్దేశం చేసిన మహత్తర విప్లవం అది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ గమనాన్నే మార్చిన విప్లవం అది.
విప్లవం రష్యాదైనా ప్రభావం ప్రపంచమంతటా
20వ శతాబ్దం ప్రారంభం నాటికి పెట్టుబడిదారీ ప్రపంచం సామ్రాజ్యవాద దశకు చేరిందని లెనిన్‌ పేర్కొన్నారు. దీనితో ఓ నూతన యుగం ఆరంభం అయ్యిందని, ఇది సోషలిస్టు విప్లవాల యుగంగా కూడా వుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దశలో సామ్రాజ్యవాదం భూ మండలాన్ని పెట్టుబడి గొలుసులతో బంధించింది. యుద్ధాలు లేకుండా సామ్రాజ్యవాదం మనజాలదు. అందువలన ప్రజా వ్యతిరేకమైన ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని, అంతర్యుద్ధాన్ని లేవనెత్తాలని లెనిన్‌ పిలుపునిచ్చారు. రష్యాలో కార్మిక వర్గ మహా విప్లవాన్ని సాగించారు. విప్లవం రష్యానే కాదు. యావత్తు ప్రపంచాన్నే కుదిపేసింది. మానవ చరిత్రలో మొదటిసారి తరతరాల దోపిడీకి గురవుతున్న పీడిత జనం అధికారంలోకి వచ్చారు. కార్మికులు, సైనికులు, రైతుల కౌన్సిళ్ల (వీటినే సోవియట్లు అంటారు) ప్రభుత్వం ఏర్పడింది. భారత తొలి ప్రధాని నెహ్రూ ‘ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా కీలక సమస్యలకు పరిష్కారం చూపగల్గటం ఆసక్తి రేకెత్తిస్తున్నది. మనవి రెండూ అతి పెద్ద వ్యవసాయ దేశాలు. పారిశ్రామికీకరణ ప్రారంభ దశలో వున్న దేశాలు. పేదరికం, నిరక్షరాస్యత రెండూ పెద్ద సమస్యలు. రష్యా ఈ సమస్యలకు పరిష్కారం సాధిస్తే ఇక్కడ ఆ పని మనకు తేలికవుతుంది.’ అని ప్రకటించారు (అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆ వైపు ఆలోచించలేదు). రష్యన్‌ విప్లవం సకల దేశాల కార్మిక వర్గానికి ఆదర్శంగా మారుతున్నదన్న భయంతో ఐక్యరాజ్యసమితి 1918 జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ)ని ప్రారంభించింది. రష్యన్‌ విప్లవం జయప్రదం కావడంతో ప్రపంచ వ్యాపితంగా విప్లవోద్యమాల వెల్లువ ఎగిసింది. 1919లో జర్మనీలో, 1920లో ఇటలీలో అణచివేయబడినప్పటికీ గొప్ప శ్రామిక వర్గ తిరుగుబాట్లు జరిగాయి. 1919లో ఈజిప్టులో జిగ్లూల్‌ పాషా నాయకత్వాన జరిగిన తిరుగుబాటు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని మెడలు వంచి స్వతంత్ర దేశంగా గుర్తింపు సాధించుకున్నది. అలాగే జపాన్‌ వలస పాలనకు వ్యతిరేకంగానూ కొరియా, చైనాల్లోనూ, 1920లో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఇరాక్‌, 1921 మంగోలియాలో సాగిన విప్లవం, టర్కీలో కెమాల్‌ అటా టర్క్‌ పోరాటం విజయం సాధించడం, 1919లో హోచిమన్‌ నాయకత్వాన ఫ్రెంచి వలస పాలనకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజల వీరోచిత పోరాట ఆరంభం ఇలా అనేక పోరాటాలతో ప్రపంచాన్నే వేడెక్కించింది రష్యన్‌ కార్మిక వర్గ మహా విప్లవం. గడగడలాడిన వివిధ దేశాల పాలక వర్గాలు, సామ్రాజ్యవాద ప్రభుత్వాలు మొగ్గ తొడుగుతున్న కమ్యూనిస్టు ఉద్యమాలపై విరుచుకు పడ్డాయి. మన దేశంలో 1920-30 వరకు కమ్యూనిస్టులపై పెట్టిన కుట్ర కేసులన్నీ బొల్షవిక్‌ కుట్ర కేసులే.
తమది అత్యంత ఆధునికమైన ప్రజాస్వామ్య మని చెప్పుకునే అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ ఇతర ఐరోపా దేశాలలో ఊహకి కూడా అందని విధంగా సోవియట్‌ రష్యాలో కార్మికవర్గ ప్రభుత్వం ఆస్తితో సంబంధం లేకుండా పౌరులందరికీ ఓటు హక్కు, ప్రత్యేకించి మహిళలకు ఓటు హక్కును ఇచ్చింది. ఆ తరువాత కానీ పెట్టుబడిదారీ దేశాలలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు.
కార్మిక వర్గ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం రష్యా ప్రపంచ యుద్ధం నుండి వైదొలగుతున్నట్లు, జారు చక్రవర్తి ఆక్రమించుకున్న రష్యాయేతర జాతుల రాజ్యాలన్నింటినీ విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికార హక్కు ఇస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ, విప్లవాధినేత లెనిన్‌ ప్రకటిం చారు. దీంతో దురాక్రమణ కోసం, రక్తసిక్తంగా సాగుతున్న ప్రపంచ యుద్ధం, తరతరాల వలస వ్యవస్థలపై రష్యన్‌ కార్మిక ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది. ఫైడల్‌ కాస్ట్రో అన్నట్లు ‘అక్టోబరు విప్లవం సంభవించక పోతే వలసవాదం అంతం అయి వుండేది కాదు. ఖండాంతరాల లోని లక్షలాది ప్రజలు విముక్తులయ్యేవారు కారు!’
1920లో అజర్‌బైజాన్‌లో తూర్పు ప్రపంచ దేశాల సదస్సులో ‘ఉమ్మడి విజయం కోసం ఉమ్మడి పోరాటం’ సాగించాలని నిర్ణయించారు. 1922 కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో ‘వలసవాదానికి వర్ణ వివక్షను జోడించి అమెరికా, కరేబియా, ఆఫ్రికా ఖండాలలోని నల్లజాతి వారిని పోరాటాలలో కలుపుకుని బలమైన ఉద్యమాలు నిర్మించాలని కమ్యూనిస్టు ఉద్యమం తీర్మానించింది. కార్మిక వర్గ అంతర్జాతీయత కోసం నిజమైన కృషి చేయాలనీ, ప్రపంచ వ్యాపితంగా వున్న కార్మిక వర్గ సోదరులకు సంఘీభావంగా నిలవాలని 17వ పార్టీ మహాసభ లో స్టాలిన్‌ తమ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. మనలాంటి కొత్తగా స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలకు ఆర్థికంగా, రాజకీయంగా సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి నిలబడటంలో రష్యా సహకారం మరువలేనిది. ఆవిధంగా విప్లవం రష్యాదైనా దాని ప్రభావం ప్రపంచం మొత్తాన్ని ఆవహించింది అని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
సోషలిజం తిరుగులేని ఓ ముందడుగు
మానవ సమాజ గమనంలో సోషలిజం తిరుగులేని ముందడుగు. ఒక దేశంలోనో కొన్ని దేశాల్లోనో ఎదురు దెబ్బలు తిన్నా అంతిమంగా ఆ అడుగు పడాల్సిందే. కారణం పెట్టుబడిదారీ ప్రపంచం పరిష్కరించజాలని అంశాలన్నింటినీ శాశ్వతంగా సోషలిజం పరిష్కరిస్తుందని రష్యన్‌ కార్మికవర్గ విప్లవ ప్రభుత్వం నిరూపించింది. వెనుకబడిన, ప్రధానంగా వ్యవసాయ దేశమైన రష్యా, ఫ్యూడల్‌ ప్రభువుల పాలనలో 300 సంవత్సరాలు మగ్గిన రష్యా, సోషలిజం నిర్మాణంతో 20,30 సంవత్సరాల లోనే సామ్రాజ్య వాద దేశాల కంటే ఉన్నతంగా ఎదగడమే అందుకు నిదర్శనం. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి జటిలమైన సమస్యలకు కారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థను, అది ఆధారపడే క్రూరమైన భూస్వామ్య అవశేషాలను నిర్దాక్షిణ్యంగా సోషలిస్టు ప్రభుత్వం రద్దు చేసేసింది.
అధికారంలోకి రాగానే వరుసగా…
ఫ్యాక్టరీలు, గనులు, భూములన్నింటినీ సోషలిస్టు ప్రభుత్వం జాతీయం చేసింది. బ్యాంకులు, విద్య, వైద్యం రవాణా వంటి సేవల న్నింటినీ ప్రభుత్వమే నిర్వహించింది. మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు చేసింది. మతాన్ని విద్య నుండి విడగొట్టడం అంటే కేవలం శాస్త్రీయ విద్యనే బోధించడం. కనీస వేతనంతో పాటు గరిష్ట వేతనాన్ని కూడా నిర్ణయించడం, తద్వారా వేతనాల్లో వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించడం. ప్రజాప్రతినిధుల వేతనాలు దేశం లోని కనీస వేతనం స్థాయి లోనే వుంచడం. ప్రజాప్రతినిధు లను ప్రజలు వెనక్కి పిలిపించే హక్కు అంటే మార్చుకునే హక్కు కలిగించడం వంటి నిర్ణయాలు ప్రకటించడం, అమలు చేయడం ఆరంభించింది కార్మిక వర్గ ప్రభుత్వం. అందుకు ప్రజలను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసింది. నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రష్యా (సోషలిస్టు దేశాలలో) అసాధారణ అభివృద్ధికి అసలు కారణమది.
సోవియట్‌ రష్యా ప్రగతిని పొగడడంతోటే సరిపుచ్చుకున్న మనలాంటి ప్రభుత్వాలు, వారు సాధించిన విజయాల్లో వెయ్యో వంతు కూడా సాధించలేక పోయాయి. విచిత్రమేమంటే, రష్యా సహకారం తీసుకుంటూనే, రష్యాని ప్రశంసిస్తూనే కమ్యూనిస్టు ఉద్యమాలను తమ దేశాల్లో అణచివేయడం, సోషలిస్టు భావాలను తెగనాడడం పెట్టుబడిదారీ దేశాల పాలకుల విధానం. రష్యాలో సోషలిస్టు వ్యవస్థ 1990లలో కూలిపోగానే వీరందరూ చంకలు గుద్దుకున్నారు. ‘కమ్యూనిజం’ పనైపోయిందని కేరింతలు కొట్టారు. ఇక పెట్టు బడిదారీ వ్యవస్థే అంతిమం అని తెగ అరిచారు. చెడరాశారు. కానీ ప్రపంచ గమనం వీరెంత అవివేకులో తెలియజేస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ తోనే చరిత్ర అంతం అని విర్రవీగుతూ వుంటే, కాదు పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం అవుతున్నది, మరో ప్రత్యామ్నాయం అనివార్యమని సరికొత్త చరిత్రకు పొద్దు పొడుస్తున్నది. ‘మనం చచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించడమా లేక పెట్టుబడిదారీ వ్యవస్థను చంపి మనం బతకడమా’ తేల్చు కోవాల్సిన సమయం ఆసన్నమైందని ‘ది గార్డియన్‌’ పత్రిక సంపాదకీయం రాసింది. పెట్టుబడిదారీ వ్యవస్థ పాడె మీద వున్న శవం లాంటిది. ఇక అది లేచి రాలేదు. ప్రత్యామ్నాయం రావాల్సిందేనని, పెట్టుబడిదారీ వ్యవస్థ తాను సృష్టించే సంక్షోభాల నుండి బయట పడేందుకు శక్తినిచ్చే అంగాలన్నీ నిస్సత్తువుగా మారాయని, 2008లో మొదలై నేటికీ కొనసాగుతున్న సంక్షోభం నుండి ఇది బయటకు రావడం కల్ల అనీ సోషలిజాన్ని అభిమానించమని మేధావులు కూడా వాదిస్తున్నారు. గత కాంగ్రెస్‌, ప్రస్తుత బిజెపిల పాలన పుణ్యమాని మన దేశం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతోంది. దేశంలో ఆర్థిక మాంద్యం విస్తరించింది. ఆర్థిక అసమానతలు విపరీతమయ్యాయి. నిరుద్యోగం తీవ్రమయ్యింది. పేదరికం పెరిగింది. దేశమూ, జనమూ కూడా అప్పుల ఊబిలోకి దిగబడిపోతున్నారు. మరి పరిష్కారం? పార్టీలు, ప్రభుత్వాలు మారితే సరిపోదని 70 సంవత్సరాల అనుభవం చెబుతున్నది. ప్రత్యామ్నాయ విధానాలు రావాలి. ఆ ప్రత్యామ్నాయమే ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారమే సోషలిజం.

ఆర్‌ రఘు ( వ్యాసకర్త సిపిఐ(ఎం) తూర్పు
కృష్ణా జిల్లా కార్యదర్శి )