రమాదేవి

ఉత్తరప్రదేశ్‌ లోని హథ్రాస్‌ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజల ఆగ్రహం మిన్నంటింది. అంటరాని కులానికి చెందిన ఆ అమ్మాయి గ్రామంలోని నలుగురు మగపిల్లల దాష్టీకానికి గురైంది. దళితుల మీద, దళిత మహిళల మీద, ఆదివాసీల మీద పెరుగుతున్న దాడుల పరంపరలో మరో దుర్మార్గపు దాడి ఇది. చట్టాలను ఖాతరు చేయని అధికార యంత్రాంగ వికృత రూపమిది.

ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ దాడులు తగ్గకపోవడానికి కారణాలేమిటి? శిక్షలు పడడం చాలా తక్కువగా ఉంది గనుక అంటున్నారు చాలామంది. 20 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. దళిత మహిళల కేసుల్లో రెండు శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయి? ఎందుకు? చాలా సందర్భాలలో సాక్ష్యాధారాలు రూపుమాపుతున్నారు. సాక్షులను బెదిరిస్తున్నారు. బలవంతపు రాజీలు చేస్తున్నారు. విచారణలు సక్రమంగా జరగవు. అందువల్లనే నేరస్తులు అందరికీ శిక్ష పడేట్లు పోలీస్‌ విచారణ, న్యాయ విచారణ జరగాలని కోరుతున్నారు. అంతేకాదు, సాక్ష్యం చెప్పాల్సిన వారికి ధైర్యం కల్పించాలి. వారికి బతకడానికి మార్గం ఉండాలి. సామాజికంగా అండ ఉండాలి. అయితే, అత్యంత కీలకమైన వీటి మీదనే దాడి జరుగుతోంది. బిజెపి ఎమ్మెల్యే సింగార్‌ ఉన్నావ్‌లో ఒక బాలిక మీద అత్యాచారం చేసి సాక్ష్యాన్ని రూపుమాపడానికి ఏడుగురిని చంపేసిన, చంపించిన క్రూర చరిత్ర ఇంకా తడి ఆరనేలేదు. మనీషా కుటుంబాన్ని అధికారులు బెదిరించిన వీడియోలు బయటికి వచ్చాయి. ”మీడియా ఈ రోజు ఉంటుంది. ఎప్పుడూ ఉండేది మేమే” అన్నది ఒక రోజు బెదిరింపు కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం ఎదుర్కొనే బెదిరింపు! వారే కాదు. వారి బంధువులు కూడా సదరు బెదిరింపులు ఎదుర్కొంటారు. వారి ద్వారా కూడా ఒత్తిడి తీసుకొస్తారు. ‘పోయిన అమ్మాయి ఎలాగూ పోయింది. ఉన్న వాళ్ళమైనా బతకాలంటే రాజీ పడాల్సిందే’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు నేడు న్యాయానికి సమాధి కడుతున్నాయి.

మనం రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలలో కూడా పరిశీలిస్తే ఇదే తతంగం సాగుతుంది. వీటన్నింటిని అధిగమించగలిగితే సుదీర్ఘ కాలం కోర్టు విచారణలు జరుగుతున్నాయి. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు కావాలని డిమాండ్‌ ఉంది. నెరవేర్చడం లేదు. చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని అడుగుతున్నాము. అమలు చేయాల్సిన అధికారులు అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం నేర చట్టాలలోనే మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది. సాధించుకున్న చట్టాలకు కూడా ప్రమాదం వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజాతంత్ర హక్కుల ఉద్యమం బలోపేతం అవుతుందా? లేక అణచివేతకు గురవుతుందా? అనే పరిస్థితినిబట్టి మహిళలు, దళితులు సాధించుకున్న హక్కులు నిలబడతాయా లేదా అనేది తేలుతుంది.

చట్టాలు పెద్దలకు, అగ్రవర్ణాలకు చుట్టాలుగా మారాయని పదేపదే రుజువు అవుతున్నది. మనీషా కేసులో కూడా మరోసారి ఇదే జరిగింది. అవసరమైన వైద్య సదుపాయం అందలేదు. చనిపోయాక ఆమెకు, ఆమె కుటుంబానికి హక్కులు నిరాకరించబడ్డాయి. అత్యాచారం జరిగిందా అన్నది కూడా ప్రశ్నార్ధకం చేశారు. మరణ వాంగ్మూలం ఉన్నా బరితెగించి అధికారులు తిమ్మిని బమ్మి చేస్తున్నారు. పైగా, ఆడపిల్లలను ఒద్దికగా పెంచాలని బిజెపి ఎమ్మెల్యే సురేష్‌ సింగార్‌ ఉపదేశిస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అత్యాచార ఘటనలను నిరసిస్తూ రోడ్డెక్కిన నేటి కేంద్ర మహిళా శాఖ మంత్రి నోరెత్తడం లేదు. ఏనుగు చనిపోయినందుకు కేరళ ప్రభుత్వాన్ని నిలదీసిన కేంద్ర మంత్రులు మౌనం పాటిస్తున్నారు. రాజకీయాలు వద్దు. చట్టం పని చట్టం చేస్తుందంటున్నారు బిజెపి నాయకులు. అత్యాచారం జరగలేదని రాష్ట్ర పోలీస్‌ అధికారి ప్రకటించి దోషులను రక్షించడానికి చేస్తున్న పని రాజకీయం కాదా! సాక్ష్యాలను సమాధి చేయడానికే…తల్లిదండ్రులకు ఆఖరి చూపు కూడా దక్కనీకుండా…మనీషా మృత దేహాన్ని కాల్చేశారని సాధారణ జనం నమ్ముతున్నారు. చట్టానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడానికి కారణం దోషులకు అధికార బలం, అర్థబలం, అంగబలం, కుల బలం కాదా! ఈ కారణాలతోనే ఈ దేశంలో అగ్రవర్ణాలు, అధికార వర్గాలకు చెందిన నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోగలుగుతున్నారు.

రాజ్యమేలుతున్న మనువాదం
స్త్రీత్వం అంటే పురుషులకు సేవలందించడం! తల్లిగా బిడ్డలని పెంచడం! సమానత కోసం, సాధికారత కోసంకాక…పడి ఉండే ఈ స్త్రీత్వం నేర్పడానికి నూతన విద్యా విధానం పూనుకున్నది. గతంలో స్త్రీలకు, దళితులకు విద్య నిరాకరించబడింది. మను శాస్త్రం ప్రకారం ఆస్తి హక్కును నిరాకరించారు. పై వర్గాలకు, వర్ణాలకు, పురుషులకు సేవ చేస్తూ వారి దయ ధర్మాలతో బతకాలని శాసించారు. వాటిని మీరితే దారుణమైన శిక్షలు వేశారు. అగ్రవర్ణ పురుషుడు తక్కువ కులం స్త్రీతో ఉండవచ్చు. కానీ అగ్రవర్ణ స్త్రీ దళితులతో సంబంధం పెట్టుకుంటే దళితులకు, మహిళలకు శిక్ష వేశారు. స్త్రీల శీలాన్ని వేలెత్తి చూపే మను సంస్కృతి మూలంగానే అత్యాచారం చేసిన దోషులనుగాక…బాధితులను తప్పు పడుతున్నారు.
ఇప్పుడు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ మా లక్ష్యం అని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ మనీషా ఉదంతంలో ఏమంటున్నది? కన్నె సేన, బజరంగ్‌ దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, రాష్ట్రీయ సవర్ణ సేన, క్షత్రియ సేన తదితర సంస్థలు 4వ తేదీ ఆ గ్రామంలో ఒక సభ జరిపాయి. నిందితులు మనీషాను అత్యాచారం చేయలేదన్నారు. తాము అమాయకులమన్నారు. ఆ తర్వాత అనేక కథలు, కథనాలు ప్రచారం లోకి వచ్చాయి. మనీషా నిందితుడితో సంబంధంలో ఉందన్నది అందులో ఒకటి. వారు చెప్పింది అంగీకరిద్దాం! సంబంధం ఉంటే అత్యాచారం చేస్తారా? చచ్చిపోయేట్లు మెడ విరిచేస్తారా? కన్ను, నాలుక దెబ్బతినేట్లు దాడి చేస్తారా? సంబంధం ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? దిశ తండ్రి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరో బోరు ఫ్రెండ్‌తో వెళ్లి ఉంటుందిలే వస్తుందన్నారు కదా పోలీసులు. ఇవన్నీ దేనికి చిహ్నాలు. పితస్వామ్య భావజాలం! ”వై మెన్‌ రేప్‌” పుస్తక రచయిత్రి ఈ పితస్వామ్య భావజాలం అత్యాచారాలకు మూలమన్నారు. దీనితోపాటు స్త్రీల శరీరాన్ని వ్యాపారం చేసిన ఆర్థిక విధానాలు ఉన్నాయి. అత్యాచారాలు లేకుండా ఉండాలంటే ఈ భావజాలం, దీనిని బలపరిచే భౌతిక పరిస్థితులు అంతమవ్వాలి.

కుల వ్యవస్థను కాపాడాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటుంది. రాజ్యాంగం ప్రకటించిన సమానతను ఎన్నడూ అంగీకరించలేదు. స్వాతంత్య్ర ఉద్యమం బలంగా ఉన్నప్పుడు కొద్దిమంది ఛాందసవాదులు, వెనుకబడిన ప్రజలకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ భావజాలం నేడు భారత సమాజం మీద మరింత తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. పోలీసు వ్యవస్థ, అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ చట్టం ప్రకారం కాక ఆర్‌ఎస్‌ఎస్‌ పెంచి పోషిస్తున్న మనువాద, మతవాద ప్రభావంతో పనిచేస్తున్నాయి. భన్వారీ దేవి కేసులో…గౌరవనీయ బ్రాహ్మణ కులస్థులు దళిత మహిళ పైన అత్యాచారం చేశారని చెప్పిన సాక్ష్యాన్ని విశ్వసించలేమని రాజస్థాన్‌ కోర్టు తీర్పు చెప్పింది. భారతీయ సంస్కృతిలో ఒకవైపు స్త్రీని గౌరవించి పూజించే మాతృస్వామ్య సమాజ ప్రభావం…మరోవైపు స్త్రీలను, దళితులను అణచివేసి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే పితృస్వామ్య సంస్కృతి ఉంది. స్త్రీల శ్రమను, దళితుల శ్రమను చౌకగా పొందేందుకు ఈ భావజాలం పెట్టుబడిదారులకు అవసరం.

రాజకీయాలు కూడా తమ వంతు పాత్రను నిర్వహిస్తాయి. న్యాయాన్యాయాలను ప్రభావితం చేస్తాయి. రథం కాలిపోతే హదయం గాయపడి రోడ్డెక్కిన నేతలు, ధర్మ దీక్ష చేసిన నాయకులకు ఒక ఆడపిల్ల కాలిపోతే వారి హృదయం స్పందించలేదు. కుప్పం నియోజకవర్గంలో చందన అనే అమ్మాయి దళితుడిని వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు ఆమెను కాల్చి బూడిద చేశారు. ఇంత జరిగినా ఆ నియోజకవర్గ మాజీ ముఖ్యమంత్రిగాని, ఆ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని నోరు విప్పరు. ఇంతటి ఘోరాన్ని కప్పి పెట్టడానికి యోగి ప్రభుత్వం ఎదురు కేసులు పెడుతున్నది. కుట్ర కోణాన్ని తెచ్చింది. దళితులను అణిచివేసి అగ్ర వర్ణాలను కాపాడే మొనగాడుగ ఓట్లను కాపాడుకునే రాజకీయమే ఇది.

బాధితులకు విశ్వాసం కల్పించాలి
అత్యాచార బాధితులకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండాలని జస్టిస్‌ వర్మ కమిటీ కోరింది. పితస్వామ్య, ఆధిపత్య వ్యవస్థ స్థానంలో…మానవ హక్కులను గుర్తించి మనుషులు సమాన స్థాయిలో బతికే ఆలోచనలు కల్పించేందుకు…విద్యా విధానం నుండి మార్పులు జరగాలని సూచించారు. మధుర, రమీజా బీ, నిర్భయ, దిశా, ఇప్పుడు మనీషా ఇలాంటి అనేక దురంతాలపై ప్రతిఘటన మూలంగానే మహిళా చట్టాలు సాధ్యమయ్యాయి. కీలన్వేణి, కారంచేడు, చుండూరు, ఖిర్లాంజి ఉద్యమాలు దళిత హక్కులను వెలిగిత్తి చాటాయి. ఫలితంగానే పదునైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చింది. సాధించుకున్న ఈ చట్టాలను వమ్ము చేసే ప్రయత్నాన్ని పాలకవర్గం సాగిస్తున్నది. దళితులు, మహిళల హక్కులు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. కుల వ్యతిరేక ఉద్యమం విజయం సాధించడానికి…స్త్రీలపై అత్యాచారాలు, దాడులు అంతం కావడానికి…సమానత్వ సాధనకు…పితృస్వామ్య, భూస్వామ్య సంబంధాలను బద్దలు కొట్టాలి. ప్రజాస్వామిక హక్కులను, చట్టాలను నిలబెట్టుకోవాలి. భూస్వామ్య మురికిలో మునకలేస్తున్న రాజ్యాంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఒక స్త్రీగా ఒక దళితురాలిగా మనీషాపై జరిగిన దాడి ఇది. న్యాయం కోసం పోరాడటం అంటే స్త్రీల హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం, చట్టాల అమలు కోసం పోరాడటం. ఇవి జమిలిగా సాగాలి.

ఈ నేపథ్యంలోనే కార్మిక, సామాజిక సంఘాలు 13వ తేదీన దేశవ్వాపిత నిరసన ప్రదర్శనలకు పిలుపిచ్చాయి. రాష్ట్రంలో 21 సంఘాలు కలిసి గ్రామ స్థాయి వరకు విస్తృత ప్రచారం చేయనున్నాయి. రాష్ట ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం ఇంత వరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందలేదు. ఇందుకోసం వత్తిడి చేయాలి. మన రాష్ట్రంలో కూడా పోలీసులు, వైసిపి మద్దతు ఉన్నవారు చేసిన దాడులు, అత్యాచారాల విషయంలో బలవంతపు రాజీలు, ఆరోపణలు బలంగా ఉన్నాయి. హథ్రాస్‌ లోను, ఇక్కడా బాధితులకు రక్షణ కల్పించటం చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. హథ్రాస్‌ కేసు కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా పూర్తి చేయాలి. మనీషా కుటుంబానికి సాక్ష్యాధార చట్టం మేరకు సంపూర్ణ రక్షణ కల్పించాలి. చట్టం ప్రకారం నష్టం పరిహారం, పునరావాసం వెంటనే అందించాలి. సమాజంలో నూతన సామాజిక, సాంస్కృతిక మార్పు కోసం ప్రజాసంఘాలు, సంస్థలు, అభ్యుదయ శక్తలు కలిసి శక్తివంతంగా ఉద్యమించాలి.

(వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి)