సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న వేధింపులు
స్నేహం నటిస్తూ ప్రబుద్ధుల అనుచిత వ్యాఖ్యలు
బయటకు చెప్పలేక బాధిత మహిళల మనోవేదన
న్యూస్‌టుడేహైదరాబాద్‌

ఇంటా..బయటా మాత్రమే కాదు.. సామాజిక మాధ్యమాల్లోనూ మహిళలు వేధింపులు చవిచూస్తున్నారు. స్నేహం ముసుగులో చేరిన కొందరు ఆకతాయిలు తమ రాతలతో వారిని మనోవేదనకు గురిచేస్తున్నారు. సున్నితమైన అంశాలను కుటుంబ సభ్యులతో పంచుకోలేక.. బయటకు చెప్పలేక ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నవారూ ఉన్నారు. గతంతో పోలిస్తే 50-60శాతం సామాజిక మాధ్యమాల వేధింపులు పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంతటి వేదన అనుభవిస్తున్నా పెదవి విప్పని బాధితుల నిస్సహాయత ప్రబుద్ధులకు మరింత అవకాశంగా మారుతోంది. వేధింపులను మౌనంగా భరించవద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయమంటూ పోలీసు అధికారులు సూచిస్తున్నా అధికశాతం యువతులు/మహిళలు ముందుకు రావట్లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయటపడి.. ‘షీ’ టీమ్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తమ బావోద్వేగాలను పోస్ట్‌ చేస్తుంటారు. దానిపై ఎవరి స్పందన వారు వ్యక్తంచేస్తుంటారు. కొన్ని సున్నితమైన అంశాల పట్ల కొందరి స్పందన అవతలి వారిని బాధ కలిగించేదిగా ఉంటుంది. శంషాబాద్‌ వద్ద దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్‌ దేశాన్ని కదిపింది. మనసున్న ప్రతిఒక్కరినీ కదిలించింది. ఇలాంటి సమయంలో కొందరు సంయమనం పాటించారు. మరి కొందరు మాత్రం తమలో రాక్షసత్వాన్ని తమ రాతలతో వ్యక్తంచేశారు

లక్ష్యం చేసుకుని కామెంట్లు..
సోమాజిగూడకు చెందిన ఓ యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతలో  ‘‘ఈ చల్లని సాయంకాలం వేళ… నా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది.’’ అంటూ చేసిన పోస్టుకు  ఓ ప్రబుద్ధుడు ‘‘ నేను నీ పక్కన ఉంటే ఆ ప్రశాంతత రెట్టింపవుతుంది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్‌ చూసిన ఆ యువతి వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టును తొలగించింది. కొత్త పరిచయాలకు.. స్నేహాలకు.. భావోద్వేగాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాలే వేదికగా మారాయి. మహిళలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు ప్రారంభిస్తున్నారు.  తమ రోజు వారి పనులు…ఎదురైన అనుభవాలు.. ఆలోచనలు.. అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలపై గొంతుక వినిపిస్తున్నారు. కొందరు ఆకతాయిల నిర్వాకంతో సామాజిక మాధ్యమాల్లో సైతం వారికి రక్షణ లేకుండా పోతుంది. మహిళల చిత్రాలు.. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అభిప్రాయాలను  పంచుకుంటే చాలు.. వారిని లక్ష్యంగా చేసుకొని అదే పనిగా వ్యంగ్యాస్త్రాలను సందిస్తున్నారు. ఫలితంగా సంబంధించిన మహిళలు/యువతులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఇలాంటి విషయాలను కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేకపోతున్నారు.

జాగ్రత్తగా వ్యవహరించాలి
ఇన్‌స్టాగ్రామ్‌, ఫేÆస్‌బుక్‌ల వంటి వాటిలో వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తున్నారు. అందమైన చిత్రాలు కనిపిస్తే చాలు.. మీరు చాలా అందంగా ఉన్నారు… మీరు పోస్టు చేసే సందేశాలు బావున్నాయి అంటూ మాట కలుపుతారు. నమ్మకంగా స్పందించాక ఫోన్‌ నంబర్‌ కావాలంటూ వెంటపడతారు. శంషాబాద్‌కు చెందిన ఓ యువతి.. ఇలాగే స్పందించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన చనువుతో ప్రబుద్ధుడు మరింత చెలరేగాడు. యువతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బాధితురాలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయటంతో ఆపాయం నుంచి బయటపడగలిగింది.

వివాదాలకు దూరంగా ఉండాలి
శ్రీధర్‌ నల్లమోతు, సాంకేతిక నిపుణుడు
సమకాలీన అంశాలపై సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకునేవారు పెరుగుతున్నారు. మహిళలు స్పందించిన విషయాల్లో మాత్రమే కొంత మంది అవమానించే రీతిలో కామెంట్లు చేయడం సరికాదు. తరచూ ఇలాంటి సమస్యలు ఎదురైతే సరైన ఆధారాలతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ఇలా ఉంటే మేలు..
సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించాలంటే ఇతర గ్రూప్‌లు, ఇతరుల ఖాతాల్లో గాకుండా వ్యక్తిగత అకౌంట్‌ టైమ్‌లైన్‌లో మాత్రమే అభిప్రాయాలను పంచుకోవచ్చు.
గుర్తు తెలియని వారు పంపించే సందేశాలకు స్పందించకూడదు.
సున్నిత విషయాల్లో ఆచితూచి స్పందించాలి.
వేధిస్తే ఆధారాలతో ఫిర్యాదు చేయాలి.
వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచడం మేలు

Courtesy Eenadu…