ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పరిచయం
మూడు నెలల క్రితం బాలికకు వల
నమ్మించి తీసుకెళ్లి అత్యాచారయత్నం
ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్య
ఒక్కరోజులో నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు

ఇదో ‘సామాజిక’ విపరిణామం!
తెలిసీ తెలియని వయసు.. తోడు లేని మనసు..
అరచేతిలో మొబైల్‌ఫోను.. ఆకాశానికి ద్వారాలను తెరిచే సైట్లు! ఇంకేముంది.. ఒంటరితనపు సంకెళ్లు తెంచుకుని.. నచ్చినవారితో స్వేచ్ఛగా స్నేహం చేద్దామనుకునే అమాయకులు. సరిగ్గా ఇలాంటివారి కోసమే కాచుకుని కూర్చుని కాటేసే కాలనాగులు! మొన్న.. సామాజిక మాధ్యమం ద్వారా వందలమంది యువతులను పరిచయం చేసుకుని.. రిసెప్షనిస్టు ఉద్యోగాలిప్పిస్తానంటూ వారి ఫొటోలను సేకరించి బెదిరిస్తూ ఓ యువకుడు పట్టుబడగా.. తాజాగా  ఫేస్‌బుక్‌ ద్వారా అభంశుభం తెలియని బాలికతో పరిచయం పెంచుకున్న మరో యువకుడు మాట్లాడుకుందాం రమ్మని పిలిచి.. అత్యాచారానికి యత్నించి దారుణంగా హత్య చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మహబూబ్‌నగర్‌ డీఎస్పీ భాస్కర్‌, జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి కథనం మేరకు.. జడ్చర్లకు చెందిన ఓ బాలిక (15) పదో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా ఏనుగు నవీన్‌రెడ్డి (27) పరిచయమయ్యాడు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడ గ్రామానికి చెందిన అతడు నాగోల్‌లోని ఓ కార్ల వర్క్‌షాపులో పని చేస్తున్నాడు. బాలిక చిరునామా తెలుసుకున్న అతను గతంలో రెండుసార్లు జడ్చర్లకు వచ్చి ఆమెతో మాట్లాడాడు. ఈనెల 27న సాయంత్రం 5 గంటలకు జడ్చర్లకు కారులో వచ్చి బయటకు వెళ్దాం రమ్మన్నాడు. బాలిక అంగీకరించకపోవడంతో గతంలో రెండుసార్లు తనను కలిసిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. భయపడిన బాలిక అతడి వెంట వెళ్లింది. మహబూబ్‌నగర్‌ రోడ్డులోని శంకరాయపల్లి తండా సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారయత్నానికి పాల్పడగా ఆమె ప్రతిఘటించడంతో తలపై బండరాయితో మోది హత్య చేసి పరారయ్యాడు.

కుమార్తె ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన బాలిక తండ్రి అదేరోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ శంషుద్దీన్‌ సకాలంలో స్పందించి విచారణ చేపట్టారు. ఆమె ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దాని నంబరు ఆధారంగా నిందితుడు నవీన్‌రెడ్డిని అతని స్వగ్రామంలో అదుపులోకి తీసుకుని విచారణ జరపగా హత్య చేసినట్టు అంగీకరించాడని డీఎస్పీ భాస్కర్‌ వెల్లడించారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. బాలిక హత్యను నిరసిస్తూ.. నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చూడాలని మహిళ, ప్రజా, విద్యార్థి సంఘాలు జడ్చర్లలో ఆందోళన చేపట్టాయి. మహబూబ్‌నగర్‌ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానంలో సత్వర విచారణ జరిపిస్తామని వారికి హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడలో నివాసం ఉండే నవీన్‌రెడ్డి తల్లిదండ్రులిద్దరూ కూలీలే. పదోతరగతి ఫెయిలైన అతడు సోదరుడితో కలిసి కార్ల వర్క్‌షాపులో పనిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు. బుధవారం నుంచి వారి ఇంటికి తాళాలేసి ఉన్నాయని.. కుటుంబ సభ్యులు పత్తాలేరని వారు వివరించారు. వారు ఎవరితోనూ కలిసేవారు కారని.. అందుకే పెద్దగా వివరాలు తెలియవని చెప్పారు.

(Courtacy Eenadu)