నిజం గడపదాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న నానుడి అందరికీ తెలిసిందే. ఇది నేటి స్మార్ట్‌ఫోన్‌ యుగంలో డిజిటల్‌ మీడియా శైలికి సరిగ్గా వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఈ నేపథ్యంలో డిజిటల్‌ మీడియాపై నియంత్రణ కోసమంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలపైనే అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి..! ఏలినవారు సెలవిస్తున్నట్టు ఇది నిజంగా అసత్యాలనూ, అశ్లీలాన్నీ, తద్వారా ఎదురవుతున్న అనర్థాలనూ నియంత్రించడానికే అయితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ దీనివెనుక విమర్శకూ, భిన్నాభిప్రాయానికీ సమాధికట్టాలన్న కుట్రలూ, కుతంత్రాలుంటే మాత్రం అది ”భావప్రకటనా స్వేచ్ఛ”కూ ప్రజాస్వామ్య మనుగడకూ పెను ప్రమాదం.

ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) ఫ్లాట్‌ఫామ్స్‌లో, డిజిటల్‌ ఇండిస్టీలో, సోషల్‌ మీడియాలో ఫేక్‌న్యూస్‌తో పాటు విశృంఖలత్వం ఇష్టారాజ్యంగా విజృంభిస్తున్న మాట నిజం. అదే సందర్భంలో ప్రజల అభివ్యక్తికీ, భావ స్వేచ్ఛకు అందివచ్చిన ఆధునిక సాధనాలుగా ఇవి ఉపయోగపడుతున్నాయన్నది కూడా అంతే నిజం. సమాచారానికి సంబంధించినంత వరకే చూసుకుంటే ఇంటర్నెట్‌ డిజిటల్‌ కంటెంట్‌లో 62శాతం, యూట్యూబ్‌లో దర్శనమిచ్చే వీడియోల్లో 49శాతం తప్పుడువేనన్నదీ, ఫేస్‌బుక్‌లోనూ 68శాతం ఫేక్‌న్యూసేనన్నదీ పలు సర్వేలు చెపుతున్న మాట! ఇవికాక రాజకీయ పార్టీల ఎజెండాలను భుజాలకెత్తుకుని విద్వేషాలకూ, దూషణలకూ దిగజారుతున్న వెబ్‌సైట్‌లకూ కొదవలేదు. మొత్తంగా సోషల్‌ మీడియాలో 65శాతం అసత్యాలూ, అర్థసత్యాలేనని తేలుతున్నది. వీటికి తోడు తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ఫ్లామ్స్‌ కలిసి లెక్కకు మించిన అనర్థాల్నే ప్రజల మీద కుమ్మరిస్తున్నాయనేదీ అందరూ అంగీకరిస్తున్న విషయమే. వీటిపై నియంత్రణా అవసరమే.

అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం జారీచేసిన నియంత్రణా ఆదేశాలు అనేకులకు ఆహ్వానించదగినవిగానే కనిపిస్తాయి! కానీ ఇక్కడే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా అభివ్యక్తికి అందరికీ సమాన అవకాశాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమానత్వాలకూ ఆస్కారముంటుంది. రాజ్యాంగం చెపుతున్న ”భావప్రకటనా స్వేచ్ఛ” (ఖీతీవవసశీఎ శీట జుఞజూతీవరరఱశీఅ) సారాంశం కూడా అదే. కానీ మన ప్రచార ప్రసార మాధ్యమాలలో ప్రజలకు ఆ అవకాశముందా? నిజానికి మన మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా అంతా కార్పొరేట్‌ నియంత్రణలో సాధారణప్రజల భావాలకూ ఆశలకూ ఆకాంక్షలకూ అవకాశమే లేకుండా చేసిన పరిస్థితుల్లో సామాన్యుడి చేతికి ఓ అద్భుత సాధనంగా అందివచ్చింది సోషల్‌ మీడియా.

అందుకే అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే కార్పొరేట్‌ చెరజిక్కిన మన ప్రధాన స్రవంతి మీడియా గింజేదో, పొట్టేదో జాగ్రత్తగా గమనించి, గింజను నేర్పుగా పక్కనబెట్టి పొట్టును మాత్రం అందంగా ప్రజల మెదళ్ళలో అలంకరిస్తున్న తరుణంలో… ప్రజల అభివ్యక్తికి అవకాశం కల్పిస్తూ ముందుకొచ్చింది సోషల్‌ మీడియా. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ద్వారా కొంతమంది పాత్రికేయులూ, మేథావులూ, రాజకీయవేత్తలూ కలిసి లక్షలాది మంది అభిప్రాయాలను, ఆలోచనలనూ ప్రభావితం చేసే ప్రయత్నాలకు గండికొడుతూ భిన్నాభిప్రాయాలకు వేదికగా రూపుదిద్దుకుంది సోషల్‌ మీడియా. ఇంతలోనే దీనిని కూడా అబద్దాలూ, అనైతిక పోకడలూ, వ్యాపార, రాజకీయ ప్రయోజనాలూ ఆక్రమించి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నప్పటికీ జనం ఇప్పుడిప్పుడే తాము నమ్మాలనుకుంటున్న వార్తలను వెతుక్కుంటున్నారు. తాము చెప్పదలచుకున్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇప్పుడీ నియంత్రణ ఈ సానుకూలతను కాపాడేందుకు హామీ ఇస్తుందా? అన్నదే ప్రశ్న. అనేకమంది ప్రజాస్వామ్య శక్తుల అనుమానం..! నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ఫ్రైమ్‌, డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ వేదికలతో పాటు డిజిటల్‌ న్యూస్‌, కరెంట్‌ అఫైర్స్‌ను కూడా ఈ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

ఎందుకంటే… ప్రభుత్వాన్ని ప్రశ్నినంతనే దేశద్రోహులుగా ముద్రిస్తున్న ఏలికల కాలంలో ఉన్నాం మనం. ఆరోగ్యకరమైన డిజిటల్‌ మీడియా కోసం ఇప్పటికే కొన్ని వ్యవస్థలూ, చట్టాలూ, నిబంధనలూ ఉన్నాయి. నిజంగా ప్రభుత్వానికి ఈ రంగంలో నెలకొన్న అవాంఛనీయమైన ధోరణులను నివారించాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే అవే సరిపోతాయి. కానీ ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలేమీ చేయకపోగా, తాము సైతం ఇదే సోషల్‌ మీడియా వేదికగా లెక్కకు మించిన సైట్‌ల ద్వారా అనేక దూషణలకూ, విద్వేష పోకడలకూ పాల్పడుతున్న ఏలికలు కొత్తగా ఈ నియంత్రణా ఆదేశాలు జారీ చేయడంలోని ఆంతర్యమేమిటి? ఇప్పటికే తమ వ్యాపార ప్రయోజనాలకు సోషల్‌ మీడియానూ, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌నూ సాధనాలుగా వాడుకుంటున్న కార్పొరేట్‌ ప్రపంచాన్ని ప్రభుత్వం ఈ ఆదేశాలతో నియంత్రించగలదంటే నమ్మగలమా? మరి అటువంటప్పుడు ఈ ఆదేశాల ద్వారా వీరు నియంత్రించేది వేటిని?! ప్రశ్న ప్రగతికి సోపానం. విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం. ఇప్పుడిది గ్రహించడం మీదనే సోషల్‌ మీడియా భవితవ్యం, భావప్రకటనా స్వేచ్ఛ మనుగడ ఆధారపడి ఉన్నాయి.

Courtesy Nava Telangana