ఎం.కృష్ణ‌మూర్తి

నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి పాలనలో సామాజిక న్యాయంపై ముప్పేట దాడి జరుగుతున్నది. దళితులు, గిరిజనులు, బిసి లు భూమి నుండి తరిమి వేయబడుతున్నారు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లను దెబ్బ తీస్తున్నారు. విద్యను ప్రైవేట్‌ పరం చేసి పేదలకు నాణ్యమైన చదువుకు దూరం చేస్తున్నారు. రక్షణగా వున్న ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మహిళలపై హత్యాచారాలను బిజెపి నేరుగా బలపరుస్తున్నది.

ఆదివాసీ భూమి, బతుకుపై దాడి
రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ అటవీ భూమికి రక్షణ కల్పించింది. ఆ భూమిపై అధికారం ఆదివాసీలకు దఖలు పర్చింది. గవర్నరుకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం భూమి నుండి గిరిజనులను తరిమేస్తున్నది. అయితే గత ఆరేళ్లలో ఐదవ షెడ్యూల్‌లో 5 లక్షల ఎకరాల భూమిని మైనింగ్‌ కోసం కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చేశారు. తాజాగా 41 బొగ్గు గనుల బ్లాకుల వేలాన్ని మోడీ స్వయంగా ప్రారంభించారు. ఒడిషాలో బాక్సైట్‌ తవ్వకాలకు వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చారు. గిరిజనులను వారి భూమి నుండి తరిమేస్తున్నారు.

తమ భూమిని కార్పొరేట్లుకు ఇవ్వొద్దని పోరాడుతున్న గిరిజనులు, వారికి అండగా నిలిచే హక్కుల కార్యకర్తలను అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నది. జార్ఖండ్‌లో 10 వేల మంది ఆదివాసీలపై దేశద్రోహం కేసు పెట్టింది. గిరిజన ప్రజల హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న 83 ఏళ్ల ఫాదర్‌ స్టాన్‌ స్వామిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టింది. మోడీ ప్రభుత్వం ఆదివాసీలకు అండగా నిలబడేవారందరికీ ఇదే గతి పట్టిస్తున్నది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవరించి రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరినైనా అరెస్టు చేసి కేంద్రం తీసుకుపోయే సవరణ చేసింది. దాన్ని ప్రయోగించి ఆదివాసీలకు అండగా నిలిచే హక్కుల కార్యకర్తలను జైళ్ల పాల్జేస్తున్నది. ఆదివాసీలపై చేసే దాడులకు అడ్డు చెప్పే వారు లేకుండా ఏరివేస్తున్నది.

దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై అమానుష దాడి
ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో దళితులపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేదు. గో మాంసం తిన్నారని, గోవును చంపడానికే తీసుకు వెళ్తున్నారని ఆరోపించి గో రక్షక దళాల పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ముఠాలను ఉసిగొల్పి దళితులు, ముస్లింలను 40 మందిని కొట్టి చంపేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే గో హత్య నేరం కింద సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టు తాజాగా చెప్పింది. ఉత్తర ప్రదేశ్‌ లోని హత్రాస్‌ జిల్లాలో దళిత యువతి మనీషా వాల్మీకిని నలుగురు అగ్ర కులపు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. ఆసుపత్రిలో సరైన వైద్యం అందనీయలేదు. ఆమె మరణించాక అర్థరాత్రి 2 గంటల తర్వాత పోలీసులే దహన సంస్కారాలు చేసేశారు. యోగి ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి చేసి ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన తరువాత మరో ముగ్గురు దళిత మహిళలను ఉత్తరప్రదేశ్‌ లో మానభంగం చేసి చంపేశారు.

ఇంతటి క్రూర కృత్యాన్ని బిజెపి బలపరుస్తున్నది. అత్యాచారానికి గురై మరణించిన మహిళల వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నది. పైగా వారిపై ఎదురు దాడికి దిగుతోంది. కాశ్మీర్‌ లో తొమ్మిదేళ్ల ముస్లిం బాలికను గుడిలో నిర్బంధించి రోజులు తరబడి అత్యాచారం చేసి, హత్య చేసిన వారిపై కేసు పెట్టి, అరెస్టు చేయడాన్ని బిజెపి నిరసించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచార హోరు సృష్టించిన మోడీ ప్రభుత్వం మహిళల మానాలకు, ప్రాణాలకు పెనుముప్పుగా దాపురించింది.
అంతటి ఘోరాలను, నేరాలను వైసిపి, టిడిపి, జనసేన ఖండించడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్ర బాబు ఇద్దరూ నోరు విప్పడం లేదు. మన రాష్ట్రంలో సైతం మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యా చారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిని, సత్తెనపల్లిలో ముస్లిం యువకుడిని పోలీసు లే కొట్టి చంపేశారు. తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువ కుడికి పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులే శిరోముండనం చేశారు. ఇటువంటి ఉదాహరణలు అనేకం మన చుట్టూ వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలు, దళితులు, మహిళలకు రక్షణ కల్పించడం లేదు. మోడీ మిత్రులు ఇంతకంటే భిన్నంగా ఉండరు.

రిజర్వేషన్లకు రాం రాం
రైళ్లు, బస్సులు, విమానాలు, బ్యాంకులు, పరిశ్రమలు, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, అంతరిక్షం, సాగు నీరు, విద్య, వైద్యం, గనుల తవ్వకం, హెచ్‌పిసిఎల్‌, భారత్‌ పెట్రోలియంతో సహా ప్రభుత్వ సర్వీసులు, పరిశ్రమలను మోడీ ప్రభుత్వం దేశ విదేశీ కార్పొరేట్ల పరం చేస్తున్నది. అంతేగాక, రక్షణ రంగ అవసరాలకు మన దేశం అభివృద్ధి చేసుకున్న 42 ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను దేశ విదేశీ కార్పొరేట్ల కంపెనీలకు ఇచ్చేయాలని, అవి తయారు చేసే సరుకులు అమెరికా నుండి దిగుమతి చేసుకోవాలని ఒప్పందం చేసింది. అత్యధిక ధరకు రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేసింది. అన్నీ పూర్తిగా తయారై వసా ్తయి. మన దేశంలో కంపెనీలకు పనే లేదు. దాంతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. రిజర్వేషన్ల అమలుకు ఉద్యోగాలే లేవు.

మోడీ నూతన విద్యా విధానంలో ఎక్కడా రిజర్వేషన్ల ప్రస్తావనే లేదు. శిశు విద్య, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ధార్మిక సంస్థలకు ఇవ్వాలని చెప్పింది. పైగా, మత సంస్థలకు అప్పజెప్పే కుట్ర ఇందులో ఉంది. ఉన్నత విద్య మొత్తం కార్పొరేట్లకు ఇచ్చే ప్రతిపాదన ఉంది. పైగా 100 విదేశీ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తామని చెప్పారు. దాదాపు విద్య అంతా ప్రైవేట్‌ పరం అవుతుంది. వైద్య విద్యలో సగం సీట్లు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు, మిగిలిన సగ భాగంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కానీ ఫీజు ఎంత కట్టాలో కాలేజీ యాజమాన్యాలే నిర్ణయిస్తాయి. పెరిగే భారీ ఫీజులతో పేద దళితులు, గిరిజనులు, బి.సి లకు వైద్య విద్య ఆశించలేం. దళితులు, గిరిజనుల మేధస్సుకి మోడీ రాజ్యంలో విలువే లేదు. అంతా డబ్బు మహిమే.

కాగితాల్లో తప్ప భూమి మీదే లేని అంబానీ యూనివర్సిటీని దేశంలో 10 అత్యుత్తమ యూనివర్సిటీలలో ఒకటిగా ఎంపిక చేసి ప్రభుత్వ నిధులు కేటాయించిన ఘనత మోడీకే దక్కుతుంది. అటువంటి వారి పాలనలో దళితులు, గిరిజనులు, పేదలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలకు భద్రత ఉండే అవకాశమే లేదు. ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సర్వీసుల్లో భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తే రిజర్వేషన్లు ఉన్నట్లా? లేనట్లా? అందువలనే ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్న దళిత, గిరిజన సంఘాల కోరిక న్యాయమైనదే.

రిజర్వేషన్లపై సమీక్షకు రాజకీయ పార్టీలు ధైర్యం చేయడం లేదని జీ.ఓ 3 తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాంతో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్లను సమీక్ష చేయాలన్న దానిని బలపరిచినట్టయింది. ఎస్‌సి/ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదంటూ దానిని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్‌, పోడు పట్టా లేని ఆదివాసీలను అడవి నుండి తరిమివేయాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్‌ ఇవ్వడం, ఈ కేసులో అడ్వకేటును మోడీ ప్రభుత్వం కోర్టుకు పంపకపోవడం…అన్నీ కలిపి చూస్తే మోడీ ప్రభుత్వంలో ఆదివాసీలకు, దళితులకు, వెనుకబడిన తరగతుల ప్రజలకు ముప్పు పొంచి ఉన్నదని అర్థమవుతున్నది.

పోరాడి రక్షించుకోవాలి
మోడీ ప్రభుత్వం పేదల భూమిని కార్పొరేట్‌ పరం గావించే చట్ట సవరణలు చేసింది. విద్యను దేశ విదేశీ కార్పొరేట్‌ పరం చేసింది. దాంతో దళితులు, గిరిజనులు, వృత్తిదారులు విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లపై దాడి చేస్తోంది. దళితులకు, గిరిజనులకు కొంత రక్షణగా వున్న ఎస్‌సి/ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది. దళితులు, గిరిజనులు, మైనారిటీలు తినే ఆహారంపై దాడి చేస్తోంది. అడవి నుండి ఆదివాసీలను తరిమే పనిలో ఉంది. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి నిధులు ఇవ్వక ఆదివాసీలను గోదావరిలో ముంచేస్తోంది. ఒకవైపు దళితులు, గిరిజనులు ఆర్థిక మూలాలపై దెబ్బ తీస్తూ మరో వైపు హక్కుల రక్షణకు ఐక్యం కాకుండా ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. అందుకుగాను కులాల మధ్య, ఉప కులాల మధ్య, గిరిజన తెగల మధ్య, మతాల మధ్య ప్రజలను విభజించేందుకు కుట్రలు చేస్తోంది. అగ్ర కుల ఆధిపత్య సిద్ధాంతాన్ని వల్లించే మనువాదుల పాలనలో ఇంతకంటే భిన్నంగా ఉండదు. కానీ లౌకిక, ప్రజాస్వామిక పార్టీలు అనుకునే టిడిపి, వైసిపి, జనసేనలు బిజెపితో రాజీపడడం…దళితులు, గిరిజనులు, బి.సి పేద ప్రజలకు తీరని నష్టం. రాష్ట్రానికీ దేశానికీ కీడే. పాలకులు ద్రోహులైనపుడు ప్రజలే పోరాడి హక్కులు కాపాడుకోవాలి.

Courtesy Prajashakti