Prof. Sujatha Surepally, Sathavahana University – Karimnagar

కరోనా వైరస్ కంటే భారతదేశంలో కులం ఎక్కువ మందిని చంపుతుంది.

భారత దేశంలో కులం ఉన్నంతవరకు హిందువులు కులాంతర వివాహాలు గానీ, బయటివాళ్లతో ఎలాంటి సామాజిక సంబంధాలు పెంచుకోవడం గానీ చేయరు. ఒకవేళ ఈ హిందువులు వేరే మతాలని స్వీకరించినా కులం అనేది ప్రపంచ సమస్యగా మారుతుంది.
– డాక్టర్ బీఆర్ అంబేద్కర్

మన దినపత్రికలు రిపోర్ట్ చేస్తున్న పరువు హత్యల్లో ఎక్కువ శాతం కుల హత్యలే లేదా కులం పేరుతో జరుగుతున్న హత్యలు. ‘పరువు’ అనేది అగ్ర కులాల్లోనే కాదు ఇతర కులాల్లోనూ ఉంది. పరువు పేరుతో మహిళల స్వేచ్ఛను హరిస్తున్నారు. తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును ‘పరువు’ పేరుతో నియంత్రిస్తున్నారు. కులవ్యవస్థను బలోపేతం చేయడానికే పెళ్లిళ్లు పుట్టుకొచ్చాయి. వివాహానికి అండగా ఉన్న కులాన్ని ప్రశ్నించే ఎవరైనా వేదన, దూషణ, హింసకు గురికాక తప్పదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా ఫణంగా పెట్టాల్సి రావొచ్చు. వివక్ష, అంటరానితనం నేరాలని రాజ్యాంగం పేర్కొంటున్నప్పటికీ మన సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

2014 లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో కులాంతర ప్రేమ సంబంధాలు, వివాహాలకు సంబంధించి కనీసం 50 హత్యలు జరిగాయి. చాలా కేసుల్లో భాగస్వాములలో ఒకరు దళితులు కావడం గమనార్హం. ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోకుండా వదిలేసిన ఇలాంటి కేసులను దేశీదిశ, కులనిర్మూలన పోరాట సమితి, కులవివక్ష పోరాట సమితి, కులాంతర వివాహ వేదిక వెలుగులోకి తెచ్చాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వారాల క్రితం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను విడిపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేమ భాషను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇదే సమయంలో భారతదేశం వేగంగా ద్వేషం, మూర్ఖత్వానికి ప్రపంచ చిహ్నంగా మారుతోంది.

హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో మారుతిరావు ఆత్మహత్యకు సంబంధించిన వార్తలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వెలువడ్డాయి. 2018, సెప్టెంబర్ లో దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ను హత్య చేయించిన కేసులో మారుతిరావు ప్రధాన నిందితుడు. తన ఏకైక కుమార్తె అమృత వర్షినిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడన్న కక్షతో ప్రణయ్ ను అతడు చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువతి. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశంలో ఎంత సంచలనం రేపిందో అదేవిధంగా ప్రణయ్ హత్య కూడా చర్చనీయాంశంగా మారింది.

ప్రణయ్ దారుణ హత్యకు గురైనప్పుడు అమృతను సోషల్ మీడియాలో వైశ్యులు తీవ్రంగా ట్రోల్ చేశారు. కన్నతండ్రి నమ్మకాన్ని వమ్ము చేసిన విశ్వాసఘాతకురాలిగా ఆడిపోసుకున్నారు. కిరాయి ముఠా చేతిలో ప్రణయ్ ప్రాణాలు పోగోట్టుకున్నప్పటికీ అతడినీ వదిలిపెట్టలేదు. దురాశతోనే అగ్ర కులానికి చెందిన అమృతను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి పెళ్లి చేసుకున్నాడని నిందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిని అత్యంత కిరాతంగా చంపించిన మారుతిరావును ఒక్కమాట కూడా అనలేదు.

ప్రణయ్ హత్య కేసులో మారుతిరావు, అతడి తమ్ముడు శ్రావణ్, మరో ఐదుగురు కొంతకాలం జైల్లో ఉన్నారు. బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూతురిని తిరిగి తన ఇంటికి రప్పించుకునేందుకు మారుతిరావు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అతడి కుయుక్తులకు అమృత లొంగలేదు. ప్రణయ్ కు ప్రతిరూపంగా జన్మించిన బిడ్డను సాకుతూ అత్తమామలకు అండగా ఉండేందుకే ఆమె నిబద్దత కనబరిచింది. తాను చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అమృతకు వ్యతిరేకంగా మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. తన తండ్రి చావుకు ఆమె కారణమంటూ పెద్ద ఎత్తున దూషణలకు దిగారు.

నెల రోజుల క్రితం మారుతిరావు ఫామ్ హౌస్ లో మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులు 1,600 పేజీల చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టులో విచారణ ప్రారంభమైంది. మారుతిరావు, అతడి తమ్ముడు శ్రావణ్ కు ఆస్తి తగాదాలు ఉన్నాయని వారి బంధువులు వెల్లడించారు. అమృత పునరాగమనంతో ఓదార్పు పొందాలని మారుతిరావు భావించాడు. కానీ అమృత తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

మన సమాజంలో కుల హత్యలు చాలా సాధారణం కావడానికి ఆధిపత్య కులాల దురంహకారం ప్రధాన కారణం అవుతోందనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. యాదవ్ వర్గానికి చెందిన గడ్డి కుమార్ 2018లో కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చనిపోయాడు. అతడు గౌడ్ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే తన బంధువులే అతడిని చంపారని సదరు యువతి వెల్లడించింది.

మంథని మధుకర్ అనే దళిత వ్యక్తి 2017లో చంపబడ్డాడు. అతడు మున్నూరు కాపు అమ్మాయిని ప్రేమించాడు. మధుకర్ మృతిని ఆత్మహత్యగా చిత్రించేందుకు రాజకీయ నాయకులు, అగ్రకులాలు ప్రయత్నించడంతో దళిత వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన రేగింది. దీంతో మధుకర్ మృతదేహానికి రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇప్పటివరకు పోస్ట్ మార్టం నివేదిక బయటకు రాలేదు.

ప్రణయ్ హత్య జరిగిన కొద్దిరోజులకే హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న గోకుల్ థియేటర్ సమీపంలో ప్రేమ జంటపై దాడి జరిగింది. అగ్ర కులానికి చెందిన మాధవి సందీప్ అనే దళిత యువకుడు ప్రేమించుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మాధవి తండ్రి మనోహర చారి కత్తితో ప్రేమికులిద్దరిపై అందరూ చూస్తుండగా దాడికి పాల్పడ్డాడు. సందీప్ స్వల్ప గాయాలతో బయటపడగా, మాధవి తీవ్ర గాయాలతో ఇప్పటికీ శస్త్ర చికిత్సలు చేయించుకుంటోంది. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ వితంతువైన సందీప్ తల్లి మాధవికి వైద్యం చేయిస్తోంది.

దళిత ఫార్మసీ విద్యార్థిని శుశ్రుత, ఆమె నాలుగు నెలల కొడుకు దేవాన్ష్ 2019, ఫిబ్రవరిలో హైదరాబాద్ సమీపంలోని ఘట్ కేసర్ లో సజీవ దహనానికి గురయ్యారు. బీసీ వర్గానికి చెందిన శుశ్రుత భర్త ఈ కిరాతకానికిపాల్పడ్డాడు. రమేశ్ ను పెళ్లిచేసుకున్నప్పటి నుంచే అత్తారింట్లో శుశ్రుతకు వేధింపులు మొదలయ్యాయి. కులం పేరుతో అవమానాలను తట్టుకోలేక మెట్టింటి నుంచి బయట పడేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల సంఘంతో పాటు ప్రతి వ్యవస్థ తలుపు తట్టింది. ‘దళిత మహిళలు ఒక్క మగాడితోనే ఉండరు. వాళ్లకు నైతిక విలువలు ఉండవు’ అని తన భర్త అన్న మాటలను తప్పని రుజువు చేయాలని శుశ్రుత చివరి వరకు తపించింది.

దేశవ్యాప్తంగా నమోదైన గణాంకాలను పరిశీలిస్తే సరిహద్దులో లేదా అంటువ్యాధుల కారణంగా మరణిస్తున్న వారి కంటే ‘పరువు హత్య’లతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. ఆర్థిక స్థితిగతులు సరిపోలుతున్నాయా, లేదా అనేది మాత్రమే పెళ్లికి అంగీకరించే ముందు ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూస్తున్నారు. దళితులను వివాహం చేసుకునే విషయానికి వచ్చేసరికి మహిళలు తీవ్ర అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దళిత పురుషులు హత్యకు గురవుతున్నారు. దళిత పురుషుడు, మహిళల పెళ్లి విషయంలో మరో బేధం కూడా ఉంది. దళిత పురుషుడు ఆధిపత్య కుల మహిళను వివాహం చేసుకున్నప్పుడు దానిని అంబేద్కరైట్ వివాహం అంటున్నారు. ఇదేవిధంగా దళిత మహిళ చేస్తే కుట్ర అని ముద్ర వేస్తున్నారు.

తల్లిదండ్రుల కుదిర్చిన వివాహాలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయన్నది ఇక్కడ వేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న. తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్న పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకద్రోహం చేస్తున్నారని ఒక మహిళా పోలీసు అధికారి చెప్పడం వింటే కచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతాం. భారతదేశం ప్రగతిశీల సమాజంగా ప్రగల్భాలు పలుకుతోంది. ఇప్పుడు ట్రంప్ సందర్శనతో భారత ప్రవాసులు కూడా మనం పురోగతి శిఖరాగ్రానికి చేరుకున్నామని నమ్మాలని కోరుకుంటున్నారు. న్యాయస్థానాలు, చట్టం పరిధికి లోబడకుండా వివాహాన్ని కుటుంబ వ్యవహారంగా చూడటం అన్నది పూర్తిగా తప్పు.

వాస్తవం ఏమిటంటే కుటుంబ విజయానికి అవసరమైన సాధారణ సత్యాలను అర్థం చేసుకోవడంలో మనం విఫలమయ్యాం. వ్యక్తిగత స్వేచ్ఛను మనం గౌరవించకపోతే ఏ కుటుంబం కూడా మనుగడ సాగించలేదు. ప్రేమ విఫలమైనా, విజయవంతమైనా.. కులాలు మరియు మతాల మధ్య మానవ నిర్మిత అంతరాన్ని తొలగిస్తుంది. సమాజానికి చిగురించే ఆశను ఇస్తుంది.

సోషియాలజీ ప్రొఫెసర్
శాతవాహన యూనివర్సిటీ
దళిత, మహిళల హక్కుల కార్యకర్త