విజయవాడ: బడుగు బలహీన వర్గాలపై సామాజిక వివక్ష కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ఆరోపించింది. తెలుగు రాష్ట్రాల్లో నాయీ బ్రాహ్మణులపై దాడుల పర్వం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గుణదలలోని నాయీ బ్రాహ్మణుల సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలుగు బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై అగ్రవర్ణ రాజకీయ నాయకులు చేసిన దాడిని సమాఖ్య తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ లో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి చేసి 10 రోజులు దాటినా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. బిగ్ బాస్-3 షోలో అందరి మన్ననలు పొంది విజేతగా నిలిచిన రాహుల్ సెలబ్రిటీ హోదాను అగ్రవర్ణ అహంకారులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించింది.

ఎస్సీ, ఎస్టీ దాడుల నిరోధక చట్టం మాదిరిగానే బీసీల రక్షణకు చట్టం తేవాలని పాలకులను డిమాండ్ చేసింది. దేవాలయాల కళ్యాణకట్టల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులను పర్మినెంట్ చేస్తామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరింది. దేవాలయాల్లో బ్రాహ్మణులకు కల్పించినట్టుగానే నాయీ బ్రాహ్మణ వాయిద్య కారులకు వంశపపారంపర్య హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాలయాల కళ్యాణకట్టలోని పనిచేసే వృత్తిదారులు, సెలూన్స్ లో వృత్తి నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు మాస్క్ లు, శానిటైజర్లను ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో సమాఖ్య సమన్వయకర్త రావులకొల్లు వెంకటమల్లేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు మల్కాపురం కనకారావు, పివి రమణయ్య, కోరిబిల్లి ఏసుబాబు, డి సూరిబాబు, గోనుగుంట్ల యల్లమందరావు, డి లక్ష్మీనారాయణ, ఆకునూరు సుబ్బారావు, డి కృష్ణ, సుందరపల్లి గోపాలకృష్ణ, బ్రహ్మేశ్వరరావు, ముసిడిపల్లి రమణ, పిల్లుట్ల సుధాకరరావు, , గుంటుపల్లి రామదాసు, ఉప్పుటూరి గురుబాలస్వామి, తాటికొండ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.