పెకింగ్‌ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం

  • వైర్‌సకు 2019-సీఎన్‌వోవీగా నామకరణం
  • వైరస్‌ను నిలువరించేందుకు 5 నగరాల దిగ్బంధం

బీజింగ్‌, దుబాయ్‌: చైనాలో17 మంది ప్రాణాలు బలిగొని, 600 మందికి వ్యాపించిన కరోనా వైరస్‌.. పాము, గబ్బిలాల నుంచే మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైర్‌సకు 2019-ఎన్‌సీవోవీ (నావెల్‌ కరోనా వైర్‌స)గా నామకరణం చేశారు.

కరోనా వైర్‌సలో చాలా రకాలున్నాయి. సాధారణ జలుబు నుంచి ప్రాణాంతక సార్స్‌ దాకా రకరకాల జబ్బులకు కారణమయ్యే వైరస్‌ కుటుంబం ఇది. ప్రస్తుతం చైనాను వణికిస్తున్న వైరస్‌ కరోనా కుటుంబానికి చెందినదే అయినా.. ఇంతకు ముందెన్నడూ చూడని రకం ఇది. పెకింగ్‌ వర్సిటీ పరిశోధకులు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని.. వివిధ జీవుల్లో ఉండే కరోనా వైర్‌సతో పోల్చిచూశారు. గబ్బిలాల్లో కనపడే రకం కరోనా వైరస్‌, మరో గుర్తు తెలియని జీవిలోని వైర్‌సతో కలిసి ఈ కొత్త వైరస్‌ ఏర్పడినట్టు వారి పరిశోధనలో తేలింది.

ఆ రెండో జీవి పాము అయ్యే అవకాశం ఎక్కువని వివరించారు. సార్స్‌తో పోలిస్తే దీని ప్రమాద తీవ్రత తక్కువేనని పేర్కొన్నారు. కాగా.. ఎన్‌సీవోవీ జన్యు క్రమాన్ని చైనా శాస్త్రవేత్తలు పరిశోధనల నిమిత్తం పలు అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థలకు అందజేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు 1.1 కోట్ల మంది జనాభా ఉన్న వూహాన్‌ నగరంతోపాటు.. హువాంగాంగ్‌(75 లక్షల మంది), జియాంటావో (15 లక్షల మంది), చిబి(5 లక్షల మంది), మరో నగరాన్ని అధికారులు దిగ్బంధం చేశారు. ఆ నగరాల నుంచి ప్రయాణాలను నిషేధించారు. బయటి నుంచి ఆయా నగరాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా టోల్‌గేట్లను మూసేశారు. అంతేకాదు.. చైనాలోని ప్రముఖ పర్యాటక కేంద్ర అయిన ఫర్‌బిడెన్‌ సిటీని కూడా మూసివేయాలని నిర్ణయించారు.

Courtesy Andhrajyothi