– తీవ్రంగా ప్రభావం చూపుతున్న మందగమనం
– పెరిగిపోతున్న ‘ముద్రా’ రుణాల ఎన్‌పీఏలు..!
– ఇప్పటికే రూ.3.2 లక్షల కోట్లకు చేరిన ‘నిరర్ధకం’
– రుణాల జారీలో తగిన జాగ్రత్త పడాలన్న ఆర్బీఐ

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితుల కారణంగా చిన్న పరిశ్రమలు పూర్తిగా చితికిపోతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో పెద్ద పరిశ్రమల వారు ఉత్పత్తిని తగ్గిస్తుండడంతో ఆ ప్రభావం ఇప్పుడు చిన్న పరిశ్రమలపై ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో ఆయా సంస్థల వారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా ముద్రా రుణాలు తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సూక్ష్మ తరహ పరిశ్రమల వారికి ఆర్థిక సాయం అందించేందుకుగాను కేంద్రంలోని మోడీ సర్కారు 2015లో ”’మైక్రో యూనిట్‌ డవలప్‌మెంట్‌

రిఫైనాన్సింగ్‌ ఏజెన్సీ”ను (ముద్రా) ప్రారంభించింది.
ఈ పథకం కింద చిన్న యూనిట్లు కలిగిన వారికి తగిన ఆర్థిక సహకారం అందిస్తూ వారు వ్యాపార రీత్యా వృద్ధిలోకి వచ్చేందుకు గాను దాదాపు రూ.10 లక్షల వరకు వేగంగా రుణాలను అందించేలే తొలత ముద్రాను కేంద్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్‌బీఎఫ్‌సీ, ఆర్‌ఆర్‌బీలు, కార్పొరేట్‌ బ్యాంకులు ఇటీవలి కాలంలో విరివిగా ముద్రా రుణాలను జారీ చేశాయి.

3.21 లక్షల కోట్ల రుణాలు ఒత్తిడిలో..
కేంద్రలోని మోడీ సర్కారు తీసుకువస్తున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలో చిత నిర్ణయాలకు తోడు ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితుల కారణంగా సూక్ష్మ (చిన్న) యూనిట్ల వారు సరైన సమయనాకి నిర్వహణ మూలధనం లభించ క యూనిట్లను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు డిమాండ్‌లో స్తబ్ధత కారణంగా ఈ పరిశ్రమలకు ఆర్డర్లు తగ్గిపోవడంతో చాలా యూనిట్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలొకి జారుకుంటున్నాయి. ఫలితంగా ఈ విభారగంలో ఇచ్చిన రుణాల ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతూ వస్తోంది. తాజాగా ఇదే విషయమై భారతీయ రిజర్వు బ్యాంక్‌ వాణిజ్య బ్యాంకలకు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. సర్కారు లెక్కల ప్రకారం ముద్రా రుణాలలో నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) విలువ మొ త్తం దాదాపు రూ3.21 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. అంతకుముందు ఏడాది (2018లో) ఎన్‌పీఏల మొత్తం 2.52 శాతంగా ఉండగా.. ఇది 2019లో 2.68 శాతానికి చేరుకున్నట్టుగా సర్కారు వెల్లడించింది. ఈ పథకం మొదలు పె ట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు దాదాపు 19 కోట్ల ముద్రా రుణాలను బ్యాంకులు, ఇతర విత్త సంస్థలు జారీ చేశాయి. ఇందులో దాదాపు 3.63 కోట్ల మేర రుణాలు డీఫాల్టుగా నిలిచాయని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం చిన్న యూనిట్లు ఎంత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో ఊహిం చవచ్చు.

బ్యాంకుల మనుగడకూ ప్రమాదం..
ముద్రా రుణాలలో నిరర్థక ఆస్తులు అసహజంగా పెరిగిపోతున్నాయని రిజర్వు బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ ఎం.కె.జైన్‌ అన్నారు. ఇప్పటికే ఇవి రూ.3.21 లక్షల కోట్లకు చేరాయని ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని ఆయన అన్నారు. ఈ రంగంలో అస్థిరమైన రుణ జారీ పెరిగిపోతుండడంతో ఈ పరిణామం రానున్న రోజుల్లో బ్యాంకుల మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి రుణాలను చాలా దగ్గరగా పర్యవేక్షించాలని కూడా ఆయన బ్యాంక్‌లకు సూచించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇకపై జారీ చేసే రుణాలకు రిపేమెంట్‌ సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసి మరీ అప్పులివ్వాలని సర్కారు తెలిపింది. అయితే కార్పొరేట్‌ సంస్థలు వేలాది కోట్ల మేర రుణాలను ఎగవేస్తూ వస్తున్నా బ్యాంకులను హెచ్చరించని ఆర్బీఐ ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయిన చిన్న సంస్థల చెల్లింపుల విషయంలో బ్యాంకులను అలర్ట్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముద్రా రుణాల వల్ల చాలా మేలు జరిగిందని చాలా మంది ఆర్థికంగా నిలదొక్కుకొని బయటకు రాగలిగారని స్వయంగా చెబుతున్న ఆర్బీఐ ఇప్పుడు దీనికి భిన్నంగా బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేయడంపై కూడా విమర్శలు వినవస్తున్నాయి.

Courtesy Navatelangana..