రాష్ట్రంలో గతేడాది 59 శాతం సిజేరియన్లు
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏకంగా 78 శాతం
నిర్మల్‌ జిల్లాలో అత్యధికం
వైద్యారోగ్యశాఖ తాజా నివేదికలో తేటతెల్లం
హైదరాబాద్‌

కాన్పు నిమిత్తం ఆసుపత్రికెళితే నిర్దయగా కత్తెరకు పనిచెప్తున్నారు. గతేడాది(2019) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన మొత్తం కాన్పుల్లో 59 శాతం శస్త్రచికిత్సల ద్వారానే జరిగాయి. ప్రైవేటు దవాఖానాల్లో  78% సిజేరియన్లే. ప్రజల అవసరాలు, నమ్మకాలను అవకాశంగా తీసుకొని కొందరు వైద్యులు సాధారణ ప్రసవాలయ్యే వీలున్నా కాసుల కోసం శస్త్రచికిత్సలు చేసేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 80% సిజేరియన్లు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 60  శాతానికి పైగా కత్తెర కాన్పులు జరిగాయి. సర్కారు ఆసుపత్రుల్లో కూడా 45% వరకూ సిజేరియన్లు నమోదవుతుండడం ఆందోళనకరమే. గతేడాది ప్రసవ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది.

తొలి కాన్పు ప్రైవేటుకే..
సాధారణంగా మొదటి కాన్పును పుట్టింటివారు చేయించడం ఆనవాయితీ.. అత్తింటివారి ఒత్తిడి, మరే కారణంతోనే అత్యధికులు తొలి ప్రసవానికి ప్రైవేటు బాటే పడుతున్నారు. ఇది ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారుతోంది. సాధారణ ప్రసవానికి ప్రయత్నిస్తామనే కొద్దిమందిని సైతం చివరికి కోతలకే సిద్ధం చేస్తున్నారనేది ప్రైవేటు వైద్యులపై ఉన్న ప్రధాన ఆరోపణ. తొలికాన్పు ప్రైవేటులో అయ్యాక.. తర్వాతి ప్రసవానికి దిగువ, మధ్యతరగతి వర్గాల్లో అత్యధికులు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తున్నారు. తొలి ప్రసవం సిజేరియన్‌ అవడంతో.. అక్కడ కూడా రెండో ప్రసవాన్ని శస్త్రచికిత్సతోనే ముగిస్తున్నారు.

తగ్గింపుపై సర్కారు దృష్టి

*కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 30 శాతమున్న ప్రసవాల సంఖ్య ఇప్పుడు ఏకంగా 57 శాతానికి పెరిగింది.

*రాష్ట్రంలో గతేడాది మొత్తం 4,90,014 ప్రసవాలు జరగ్గా.. వీటిల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,78,648 (57%), ప్రైవేటులో 2,11,366 (43%) కాన్పులు నమోదయ్యాయి.

*ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ 45% వరకూ సిజేరియన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దీన్ని తగ్గించడానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆధ్వర్యంలో 12 సర్కారు దవాఖానాల్లో తొలికాన్పుల్లో సహజ ప్రసవాలను పెంచే దిశగా ప్రయోగాత్మకంగా కార్యాచరణ అమలుచేస్తున్నారు. ఫలితంగా ఆర్నెల్ల కిందట సుమారు 80 శాతమున్న తొలికాన్పు కోతలు.. దాదాపు సగానికి తగ్గాయి.

*మొదటి కాన్పు సహజంగా జరిగేలా చూస్తే.. రెండోదీ అలాగే అవడానికి అవకాశాలు మెరుగవుతాయనీ, ఇది దీర్ఘకాలంలో సిజేరియన్లను తగ్గించడానికి దోహదపడుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

*సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మత్తుమందు వైద్యులు, పిల్లల, స్త్రీ వైద్యనిపుణులను నియమించడం, శస్త్రచికిత్సల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, సాధారణ ప్రసవాలకే మొగ్గుచూపేలా చైతన్యపరచడం, గర్భం దాల్చినప్పటి నుంచే ప్రసవ ప్రణాళికను రూపొందించి అమలుచేయడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది.

(Couretesy Eenadu)