• వుహాన్‌లో 45 మంది తెలుగు విద్యార్థులు…
  • ఆగస్టులో శిక్షణకు తీసుకెళ్లిన చైనా సంస్థ
  • కరోనా ప్రభావంతో యోగక్షేమాలపై ఆందోళన
  • విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ
  • వారిని క్షేమంగా రప్పించాలని వినతి
అమరావతి : చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడంతో తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ జన్మస్థానమైన వుహాన్‌లోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన 58 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరిలో 30 మంది విశాఖవాసులు కాగా పది మంది కర్నూలు జిల్లాకు చెందినవారు. విద్యార్థుల తల్లిదండ్రులంతా కలిపి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. గత ఏడాది ఆగస్టులో గీతం, ఎస్వీ, చెన్నైలోని విట్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన 58 మందిని చైనా స్టార్‌ ఆప్టో ఎలక్ర్టానిక్స్‌ టెక్నాలజీ సంస్థ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఎంపిక చేసి ఆరు నెలల శిక్షణకు తీసుకెళ్లింది. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు.

శిక్షణ ఫిబ్రవరి 15తో ముగియనుంది. వెనక్కు రావడానికి విమాన టికెట్లు కూడా బుక్‌ అయ్యాయి. కరోనా కారణంగా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే తామంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నామంటూ విద్యార్థులు గురువారం ఐఎంవో యాప్‌ ద్వారా వీడియో విడుదల చేశారు. కాగా.. హుబెయ్‌ ప్రావిన్సు నుంచి 600 మంది భారతీయులను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. వుహాన్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరిలో కొందరిని శుక్రవారం తీసుకురానున్నారు. కాగా, చైనాలోని జెన్‌జోవ్‌ యూనివర్సిటీలో 4 వేల మందికిపైగా భారతీయులు చదువుకుంటుండగా.. వారిలో సుమారు 50ు తెలుగువాళ్లే ఉన్నారు. వారిలో కర్నూలు జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, దేవనకొండ, నంద్యాల తదితర ప్రాంతాల విద్యార్థులూ చదువుతున్నారు.

ఈ యూనివర్సిటీ నుంచి వుహాన్‌ పట్టణం దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది. కానీ, కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తూ ఇప్పుడు వర్సిటీ ప్రాంగణానికి కూడా చేరుకుంది. వర్సిటీలో ఇప్పటికే ఏడుకుపైగా కేసులు నమోదయ్యాయి. దాంతో, విద్యార్థులు వణికిపోతున్నారు. మంచినీళ్లు లేవు. బయటకు వెళ్లే దారి లేదు. కొందరు వంటకోసం ముందుగా కొన్న వస్తువులతోనే ఆకలి తీర్చుకుంటుండగా.. అవి కూడా అయిపోయి మరికొందరు స్నాక్స్‌తో సర్దుకుపోతున్నారు. తినడానికి తిండి లేదనే కారణంగా బయట కాలు మోపితే అకాల మృత్యువు అమాంతం మింగేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి స్వదేశానికి పరుగులు తీస్తున్నారు. ఏకంగా ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కర్నూలు వచ్చేశారు. ‘‘గర్భవతులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు వేగంగా సోకుతున్న ఈ కరోనా వైరస్‌ మేం నివసించే ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. మేం నివసించే చోటికి అతి చేరువలో అతి తక్కువ సమయంలోనే సమీప ప్రజలందర్నీ సోకింది. భయంతో తిరిగి వచ్చేశాం’’ అని ఓ విద్యార్థి తెలిపాడు.

ట్రైనీ ఇంజనీర్లను వెనక్కు రప్పించండి: బాబు
వుహాన్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 58 మంది ట్రైనీ ఇంజనీర్లను వెనక్కు తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి జై శంకర్‌కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్‌లో వీరు చిక్కుకుపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో వీరిని ఎంపిక చేసుకొన్న టీసీఎల్‌ సంస్థ చైనాలో వారికి ప్యానల్‌ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీలో శిక్షణ ఇచ్చే నిమిత్తం పంపిందని తెలిపారు. పాకిస్థాన్‌ జైల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులను విడిపించి ఇళ్లకు చేర్చడంలో విదేశాంగ మంత్రి కృషిని తెలుగు ప్రజలు మర్చిపోలేరని, అదే స్ఫూర్తితో ఈ యువ ఇంజనీర్లను కూడా వెనక్కు తెప్పించాలని ఆయన కోరారు. చైనాలో చిక్కుకుపోయిన భారతీయుల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి శ్లాఘనీయంగా ఉందని ప్రశంసించారు.

మేం ఉన్నచోటకు 50 కిలోమీటర్ల దూరంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. తొలుత భయం లేదని చెప్పారు. కానీ, క్రమంగా మేం ఉంటున్న జెన్‌జోవ్‌ యూనివర్సిటీకి వైరస్‌ పాకింది. దాంతో మాకు నిద్రాహారాలు లేవు. చివరికి, తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. కొన్ని రోజులు స్నాక్స్‌తోనే కడుపు నింపుకొన్నాం. దిక్కుతోచక పరుగుపరుగున వచ్చేశాం.

చైనాలో చదువుకుంటూ కర్నూలు జిల్లా పత్తికొండకు తిరిగి వచ్చేసిన పి.ప్రత్యూష
నేను ఉంటున్న యూనివర్సిటీకి 300 కిలోమీటర్ల దూరంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. అప్పటి నుంచీ మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు. మాస్క్‌లు ధరించి హాస్టల్లోనే ఉంటున్నాం. మంచినీళ్లు రావడం లేదు. కుళాయి నీటినే వేడి చేసి తాగుతున్నాం. కూరగాయలు అయిపోవస్తున్నాయి. భయం భయంగా గడపాల్సి వస్తోంది.

చైనాలోని సిన్‌సియాంగ్‌ మెడికల్‌ యూనివర్సిటీ నుంచి ఫోన్‌లో తూర్పు గోదావరి జిల్లా తొండంగి విద్యార్థిని ఉమా మహేశ్వరి

మాస్క్‌ల కొరత
మాది అనంతపురం జిల్లా. ఐదేళ్ల కిందట నాన్జింగ్‌ మెడికల్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్లాను. ప్రస్తుతం హౌస్‌ సర్జన్‌ చేస్తున్నాను. నాన్జింగ్‌లో ఇప్పటి వరకు 9 మంది కరోనా వైరస్‌ బారినపడినట్లు అధికారులు చెబుతున్నారు. వైరస్‌ కారణంగా బయటకు వెళ్లడం లేదు. కూరగాయలు, అత్యవసరాలకు మాత్రమే మాస్క్‌లు ధరించి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. దుకాణాల్లో మాస్క్‌ల కొరత ఉంది.

కవిత, ఎంబీబీఎస్‌ విద్యార్థిని, నాన్జింగ్‌

ఎంతో భయపడ్డా
నేను జెన్‌గోవ్‌ వర్సిటీలో మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా జాగ్రత్తలు మేం తీసుకున్నాం. కానీ, మా హాస్పిటల్‌లోనూ కేసులు నమోదయ్యాయని తెలియడంతో భయం పెరిగిపోయింది. దీంతో సెలవుపెట్టి ఇండియాకు తిరిగొచ్చాం.
 దేవీ ప్రత్యూష, కర్నూలు

భయంగా ఉంది
మా అమ్మాయి శరణ్య చైనా కంపెనీకి ఎంపికై శిక్షణకు వెళ్లింది. వారిని కంపెనీ చక్కగా చూసుకుంటోంది. కానీ, అమెరికా, జపాన్‌, శ్రీలంక దేశాల వారంతా వెళ్లిపోయారు. మన వాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయారు. వైరస్‌ వ్యాప్తి తగ్గిన తర్వాత పంపుతామని చెబుతున్నారు. అయితే ఆ వైరస్‌ వీరిలో ఎవరికీ సోకక ముందే ఇక్కడికి పంపాలని కోరుతున్నాం. అందుకే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశాం.
పి.సత్యనారాయణ, విశాఖపట్నం

Courtesy Andhrajyothi