-ఇండోర్‌లో 35 ఏండ్ల వ్యక్తి మృతి
– పాజిటివ్‌ కేసులు 694
– మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అధికం
– ఢిల్లీ వైద్యునికి కరోనా.. క్వారంటైన్‌లో 900 మంది
– ‘టెలీ మెడిసిన్‌’ సేవలకు మార్గదర్శకాలు
– ఒడిశాలో వేయి పడకల ఆస్పత్రి..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) బారినపడుతున్న వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా జమ్మూకాశ్మీర్‌, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో వైరస్‌ కారణంగా కేవం 16 రోజుల్లోనే చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. కాశ్మీర్‌లో కరోనా తొలి మరణం నమోదుకావడం గమనార్హం. కాగా, మహారాష్ట్ర, కేరళల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. మహారాష్ట్రలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 124 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మరోవైపు కేరళలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 118కి చేరింది. కర్నాటకలో ఇద్దరు చనిపోగా.. మొత్తంగా 55 మందికి వైరస్‌ ప్రబలింది. గుజరాత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 43కు చేరగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఉత్తరప్రదేశ్‌లో 42, తెలంగాణలో 44 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా బారినపడ్డ వారి సంఖ్య 694 చేరగా.. 47 మంది కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే నలుగురు చనిపోవడంతో పాటు కొత్తగా 43 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందికి కరోనా బారినపడ్డారు. 22 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఇటలీలో 7,500 మంది, స్పెయిన్‌లో 4,089 మంది చనిపోయారు.

మధ్యప్రదేశ్‌లో 35 ఏండ్ల వ్యక్తి మృతి
కరోనా ప్రబలినప్పటికీ ప్రాణాలు కోల్పోయేవారిలో వృద్ధులు మాత్రమే ఉంటారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 35 ఏండ్ల ఓ వ్యక్తి కోవిడ్‌-19 కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీనిని రాష్ట్ర అధికారులు ధ్రువీకరించారు. చిన్న వయస్సులో కరోనా సోకి చనిపోయిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.

ఢిల్లీ డాక్టర్‌కు కరోనా..
900 మంది 14 రోజుల క్వారంటైన్‌
ఈశాన్య ఢిల్లీ మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌లో వైద్యుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చింది. అలాగే, వైద్యుడి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు జరపగా.. ఆయన కుమార్తె, భార్యకు సైతం ఈ వైరస్‌ ప్రబలినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు.. ఆ డాక్టర్‌ వైద్య సేవలు పొందిన 800 మందిని గుర్తించి, వారిని 14 రోజుల ఐసోలేషన్‌కు పంపినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి ఎస్‌ జైన్‌ వెల్లడించారు. వీరితో పాటు వారిని కలిసిన మరో వంద మందిని సైతం క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల సౌదీఅరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ ఈ క్లినిక్‌లో చికిత్స పొందారు. ఆమె కారణంగానే ఆ వైద్యునికి కరోనా ప్రబలినట్టు అనుమానిస్తున్నారు.
కర్ఫ్యూలోనూ ఆధ్యాత్మిక సమావేశం.. పోలీసులను కత్తితో బెదిరించిన మహిళ

ఉత్తరప్రదేశ్‌లో ఘటన
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ పలువురు సమావేశాలు నిర్వహించటం.. రోడ్లపై తిరుగుతుండటం.. అడ్డుకున్న పోలీసులపై తిరగబడటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి ఘటనే యూపీనూ చోటు చేసుకుంది. డియోరియాలో తనకు తాను దేవునిగా ప్రకటించుకున్న ఓ మహిళ తన నివాసం వద్ద ఓ ఆధ్యాత్మిక సమావేశం ఏర్పాటు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు… అక్కడికి చేరుకుని అందరూ వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో కార్యక్రమం నిర్వహిస్తున్న ఆమె నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికితోడు వారిని కత్తితో బెదిరించింది. తాను ఆదిశక్తిననీ, దమ్ముంటే తనను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించండని సవాలు విసిరింది. దీంతో పోలీసులు.. ఆమెను లాక్కెళ్లి నిర్బంధంలోకి తీసుకున్నారు.

15 రోజుల్లో వేయి పడకల ఆస్పత్రి: ఒడిశా ముఖ్యమంత్రి
కోవిడ్‌-19 వాప్తి ఇలాగే కొనసాగితే.. దేశంలో 30 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం కంటే ముందే 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన ఒడిశా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా కరోనా రోగులకు వైద్యం అందించే విధంగా ఓ ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నవిన్‌ పట్నాయక్‌ తెలిపారు. మొత్తం వేయి పడకలు ఉండే విధంగా, 15 రోజుల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోనే దీన్ని నిర్మిస్తామన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వంతోపాటు కార్పొరేట్‌ సంస్థలు, మెడికల్‌ కాలేజీలు సైతం భాగస్వాములు కానున్నాయని తెలిపారు.

ఏప్రిల్‌ 15 తర్వాత కూడా లాక్‌డౌన్‌ !
కరోనా వ్యాప్తి నిరోధించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించారు. వచ్చే నెల 15 వరకూ లాక్‌డౌన్‌ ఉంటుందని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, దేశవ్యాప్త కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండటంతో.. ఏప్రిల్‌ 15తో లాక్‌డౌన్‌ ముగి యబోదనీ, ఆపై కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకా శముందని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్న తాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ 21 రోజు ల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయంలో భారత్‌ ఎంత వరకూ విజయం పొందుతుందో.. ఓ అవగాహన వస్తుం దన్నారు. వైరస్‌ బాధితుల సంఖ్య వేలల్లోకి, లక్షల్లోకి చేరితే.. కనీస మౌలిక వైద్య సదుపాయాలు అందించే స్థితి లో భారత్‌ లేదనీ, అందుకే ముందుగానే పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఈ లాక్‌డౌన్‌ ఉపకరిస్తుందని అన్నారు.

Courtesy Nava Telangana