– మహారాష్ట్రలోని ఎంజీఏహెచ్‌వీ వర్సిటీ నిర్ణయం
ముంబయి : విద్యా సంస్థల్లో భిన్నాభిప్రాయాలను అణచివేస్తున్న మరో ఘటన వెలుగుచూసింది. దళితులు, ముస్లింలపై జరుగుతున్న మూకదాడులు, కాశ్మీర్‌పై నిర్బంధం, ప్రభుత్వ సంస్థల అమ్మకాల్లాంటి కీలక అంశాలపై ప్రధానికి లేఖ రాసిన విద్యార్థులపై మహారాష్ట్రలో వార్ధాలోని మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ(ఎంజీఏహెచ్‌వీ) యాజమాన్యం వేటు వేసింది. సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందిన ఆ ఆరుగురు విద్యార్థులకు యూనివర్సిటీ ఆదేశాలను ఉల్లంఘించారని పేర్కొంటూ సస్పెన్షన్‌ లెటర్లు పంపింది. ఈ ఆరుగురిలో ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ) సభ్యుడు రాజేశ్‌ సారథి ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు గళమెత్తుతున్న మేధావులు, కళాకారులు, ప్రముఖులకు సంఘీభావంగానే విద్యార్థులు ప్రధానికి లేఖలు రాశారని ఏఐఎస్‌ఏ తెలిపింది. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ.. వర్సిటీ యాజమాన్యం కుట్రపూరిత చర్యలకు పూనుకుందని విమర్శించింది. ఆరుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. పలు అంశాలపైనే ప్రధానికి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు నమోదైన నేపథ్యంలోనే ఆరుగురు విద్యార్థులకు సస్పెన్షన్‌ లెటర్లు రావడం గమనార్హం.

Courtesy Navatelangana..