• స్వీట్లు పంచుకున్న గ్రామస్థులు
  • గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ

యాదాద్రి/బొమ్మల రామారం: ముగ్గురు బాలికలపై హత్యాచారాలకు పాల్పడిన కేసులో మర్రి శ్రీనివా్‌సరెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు వెల్లడించడంతో హాజీపూర్‌ గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. గురువారం తుది తీర్పు వెలువడనుండటంతో గ్రామస్థులంతా పనులకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉన్నారు. కోర్టు తీర్పు కోసం సాయంత్రం 6గంటల వరకూ ఉత్కంఠగా నిరీక్షించారు. నిందితుడిపై నేరం నిరూపితమైందని మధ్యాహ్నం ప్రకటన వచ్చింది. అయితే, సాయంత్రం వరకు శిక్షను ఖరారు చేయకపోవడంతో ముగ్గురు చిన్నారులను అమానుషంగా పొట్టన పెట్టుకున్న కీచకుడికి ఉరి శిక్ష పడాలని తమ ఇష్ట దైవాలను కోరుకుంటూ గడిపారు. శ్రీనివా్‌సరెడ్డికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ సాయంత్రం పోక్సో కోర్టు జడ్జి తీర్పు వెలువరించడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. యువత బాణసంచా కాలుస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హాజీపూర్‌తోపాటు బొమ్మలరామారం మండల వ్యాప్తంగా స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

శవాన్ని చూసినప్పుడే సంతోషం : నా కూతురిని కిరాతకంగా చంపిన శ్రీనివాస్‌రెడ్డి శవాన్ని చూశాకే నాకు సంతోషం కలుగుతుంది. కోర్టు ఉరి శిక్ష విధించడం.. కొంత మేరకు ఆనందంగా ఉన్నా.. వాడి శవాన్ని చూసినప్పుడే పూర్తిగా సంతోషిస్తాం. పోలీస్‌ వ్యవస్థపై నమ్మకంతోనే ఉన్నాం.
పదోతరగతి విద్యార్థిని తల్లి

వెంటనే ఉరి తీయాలి
నా కూతురు తప్పిపోయిందనుకున్నాం. మానవ రూపంలోని మృగం నా చిట్టితల్లిని పొట్టన పెట్టుకుని ఐదేళ్లు గడుస్తోంది. వాడిని వెంటనే ఉరి తీయాలి. నా లాంటి దుస్థితి మరో కుటుంబానికి రాకూడదంటే సాధ్యమైనంత త్వరగా శ్రీనివా్‌సరెడ్డిని శిక్షించాలి.
ఆరో తరగతి విద్యార్థిని తల్లి

ఆలస్యం చేయొద్దు
శ్రీనివా్‌సరెడ్డికి ఉరి శిక్ష విధించడం సంతోషకరం. ఆలస్యం చేయకుండా వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరనే నమ్మకం ఏర్పడింది. నా కుమార్తె లేదన్న బాధ ఉన్నా క్రూరుడికి శిక్ష పడటం ఆనందంగా ఉంది.
బాధితురాలి తండ్రి

పోలీసులకు ధన్యావాదాలు
వరుస హత్య కేసులను ఛేదించి త్వరితగతిన శిక్షపడేలా కృషి చేసిన పోలీసులకు ధన్యావాదాలు. ఆధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టులో సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష పడింది.
– బాధితురాలి బాబాయి

తక్షణమే అమలు చేయాలి 
శ్రీనివా్‌సరెడ్డికి నల్లగొండ కోర్టు విధించిన ఉరి శిక్షను తక్షణమే అమలు చేయాలి. నిందితుడు పై కోర్టుకు అప్పీల్‌ చేసుకోకముందే ఉరి తీయాలి. శిక్ష అమలైతేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.
– పి.కవిత, హాజీపూర్‌ సర్పంచ్‌

Courtesy Andhrajyothi