టోకెన్‌ నంబర్‌ 45తో మిగిలిన అభ్యర్థులతో పాటు వెయిటింగ్‌
క్యూలోని వారిలో ఎక్కువ మంది సరైన పత్రాలు లేని వారే
బీజేపీ కుట్ర అని ఆప్‌ ఆరోపణ.. తిరస్కరించిన బీజేపీ
6 గంటలపాటు ఢిల్లీ సీఎం నిరీక్షణ

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్‌ పత్రాల దాఖలులో హైడ్రామా చోటుచేసుకుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతున్న ఆయన… రోడ్‌ షో కారణంగా సోమవారం నాడు నిర్ణీత సమయంలోగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి హాజరుకాలేకపోయిన సంగతి తెలిసిందే.

నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన మంగళవారంనాడు వేద్దామని నిర్ణయించుకుని ఉదయమే కుటుంబ సభ్యులు, తలిదండ్రులు, ఇతర నేతలతో కలిసి బయల్దేరారాయన! పత్రాల సమర్పణ మధ్యాహ్నం మూడుగంటల్లోగా జరిగిపోవాలి. కేజ్రీవాల్‌ ఉదయం 11:30-12 గంటల కల్లా ఆర్‌వో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ మరో 40 మంది పైనే ఉన్నారు. ఆయనకు టోకెన్‌ నెంబర్‌ 45 ఇచ్చారు. సీఎం కదా.. అని ఎవరూ ముందుకొచ్చి ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

ఫలితంగా ఆయన మిగిలిన అభ్యర్థులతో పాటు అక్కడే కూర్చొనాల్సి వచ్చింది. విశేషమేమంటే.. అక్కడున్న పోటీ అభ్యర్థులెవరూ సీరియ్‌సగా బరిలో దిగిన బాపతు కాదు. వారు తమ వెంట సరైన పత్రాలు కూడా తెచ్చుకోలేదు. ప్రతీ అభ్యర్థి 10 మంది చేత సెకండ్‌ చేయించుకోవాలి. తమకు మద్దతు ప్రకటించే వారిని సైతం వెంట తెచ్చుకోకుండా అక్కడి నుంచి ఫోన్లు చేయడం మొదలెట్టారు. కేజ్రీవాల్‌ పక్కనే కూర్చొని తంతు నడిపారు.

ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నట్లు అంద రూ భావించారు. అటు ఎలక్షన్‌ సిబ్బంది కూడా ఒక్కో అభ్యర్థికీ అరగంట నుంచి గంటసేపు దాకా టైం తీసుకుని, అన్నీ తాపీగా చెక్‌ చేస్తూ గడిపారు. ఫలితంగా 3 గంటలకు నామినేషన్‌ పత్రాల దాఖలు గడువు ముగియాల్సి ఉండగా అది కాస్తా సాయంత్రం 7:30 దాకా సాగింది. నిర్ణీత గడువులోగా వచ్చినవారికి టోకెన్‌ ఇవ్వాలి. ఆ టోకెన్‌ ఇచ్చారంటే తప్పనిసరిగా నామినేష న్‌ దాఖలు చేయగలుగుతారు. కాబట్టి కేజ్రీవాల్‌ సాయంత్రం 6:30 గంటలకు తన పత్రాలను సమర్పిం చారు. ఈ నిరీక్షణ సమయంలోనే కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఆర్వో కార్యాలయంలో ఉన్నాను. నా టోకెన్‌ నెంబరు 45. నా వంతు కోసం ఎదురుచూసున్నాను. ఈసారి పోటీకి చాలా మంది అభ్యర్థులే వచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత మంది పాల్గొనడం సంతోషానిస్తోంది’’ అని అందులో వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించారు. దీని భావం అర్థం చేసుకున్న ఆప్‌ నేతాగణం వెంటనే బీజేపీపై దాడి ప్రారంభించారు.

‘‘ఇది బీజేపీ కుట్ర. ఆయన నామినేషన్‌ వేయకుండా ఎలాగైనా నిరోధించాలన్నది మోదీ-షాల కుట్ర. ఇవి ఫలించవు. కేజ్రీవాల్‌ నామినేషన్‌ను ఎవరూ ఆపలేరు. ఆయన మూడోసారి సీఎం కావడాన్ని కూడా బీజేపీ ఆపలేదు’’ అని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా దుయ్యబట్టారు. ‘బీజేపీ దొంగదెబ్బ తీయాలనుకొంటోందని’ అని ఆప్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు నాగేంద్ర శర్మ ఘాటుగా అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. ‘టీవీలో సాధ్యమైనంత ఎక్కువ సేపు కనబడడానికి కేజ్రీవాల్‌ ఆడిన స్టంట్‌ ఇది..’ అని బీజేపీ నేత ప్రవీణ్‌కుమార్‌ ఎదురుదాడి చేశారు. అటు కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ సభర్వాల్‌ కూడా కేజీవ్రాల్‌ లాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఆయనకు టోకెన్‌ నెంబర్‌ 61 ఇచ్చారు. కేజ్రీ నామినేషన్‌ వేసిన మరో గంటన్నరకు గానీ ఆయన వంతు రాలేదు.

పుంజుకుంటున్న బీజేపీ.. అయినా ఆప్‌ టాప్‌
ఎన్నికల సర్వేల్లో ఆప్‌ దూ సుకుపోతోంది. జనవరి 20 నాటికి సీఓటర్‌-ఐఎఎన్‌ఎస్‌ జరిపిన సర్వే ప్రకారం ఆమాద్మీ పార్టీ 53.3ు ఓటర్ల మద్దతు సాధించింది. బీజేపీ 29.2ు ఓటర్ల మద్దతుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. విశేషమేమంటే జనవరి 16న విడుదల చేసిన ఓటింగ్‌ ట్రాకర్‌ ప్రకారం ఆప్‌ 55.4ు, బీజేపీ 26.3ు ఓటర్ల మద్దతు సాధించింది. ఈ నాలుగు రోజుల్లోనే కమ లం పార్టీ రేటింగ్‌ 2.4ు పెరిగింది. ఆమాద్మీ పార్టీకి మద్దతు తగ్గుతూ వస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి 8 నాటికి బీజేపీ పరిస్థితి మరికాస్త మెరుగుపడవచ్చన్నది అంచనా. ఇప్పటి దాకా నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్‌ కేవలం 3.4ు ఓటర్ల మద్దతు సాధించి పూర్తిగా చతికిల బడింది. సీట్ల ప్రకారం చూస్తే ఆప్‌కు 59 స్థానాలు లభించవచ్చు. బీజేపీకి గతం కంటే ఎక్కువగా 8-9 సీట్లు దక్కే అవకాశం ఉందంటున్నారు. సీఎంగా ఇప్పటికీ కేజ్రీవాలే అత్యధికుల ఆదరణ పొందుతున్నారు. ఆయనకు 67.9ు మంది అనుకూలంగా ఓటేయగా, బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న డాక్టర్‌ హర్షవర్ధన్‌కు కేవలం 12.2 శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు.

(Courtesy Andhrajyothi)