– బ్యాంక్‌ లకు 7వేల కోట్ల మోసం
– డజన్‌ కుపైగా బ్యాంక్‌ లకు ఎగనామం
– ఒక్క పీఎన్‌బీకే రూ.1200 కోట్ల నష్టం

న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్‌ రంగంలో కార్పొరేట్‌ కంపెనీల మోసాలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్లాస్టిక్‌ ట్యాంకర్లను తయారు చేసే సింటెక్స్‌ ఇండిస్టీస్‌ విత్త సంస్థలకు రూ.7,000 కోట్ల పైగా కుచ్చుటోపి పెట్టింది. ఈ కంపెనీ తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఆయా బ్యాంక్‌లు మొండి బాకీలుగా గుర్తించాయి. సింటెక్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (సిల్‌) తమ బ్యాంక్‌ను రూ.1,203 కోట్లకు మోసం చేసిందని బుధవారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వెల్లడించింది. దీంతో ప్లాస్టిక్‌ ట్యాంక్‌లు, వస్త్ర ఉత్పత్తులు, నూలు పోగులు తయారు చేసే సింటెక్స్‌ వ్యవహారం బయటపడింది. బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ గణంకాల ప్రకారం.. సింటెక్స్‌ కంపెనీకి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అత్యధికంగా రూ.1,176 కోట్లు అప్పులు ఇచ్చింది.

ఇదే క్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.649 కోట్లు, దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లు రూ.946 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యుబిఐ) రూ.371 కోట్ల చొప్పున అప్పులిచ్చాయి. అదే విధంగా యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం కాకముందు ఆంధ్రా బ్యాంక్‌ కూడా 250కోట్ల అప్పులివ్వడంతో ప్రస్తుత యూబీఐకు ఎగ్గొట్టిన మొత్తం రూ.621 కోట్లకు చేరింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.614 కోట్లు, కెనరా బ్యాంక్‌ 472 కోట్లు, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రూ.416 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ రూ.333 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ రూ.300 కోట్లు చొప్పున రుణాలిచ్చి ఉన్నాయి. అదే విధంగా ఎస్‌బీఐ కూడా టర్మ్‌లోన్‌ కింద రూ.250 కోట్లు అందించింది. ప్రయివేటు రంగంలోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ రూ.250 కోట్లు, కర్నాటక బ్యాంక్‌ రూ.100 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌ రూ.92 కోట్ల చొప్పున రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం 2020 మార్చి 31 నాటికి డజన్‌పైగా బ్యాంక్‌లకు రూ.7,157.9 కోట్ల వరకు ముంచినట్టు తెలుస్తోంది. జూన్‌ 2019లో తొలిసారి ఈకంపెనీ వాయిదాలు చెల్లించ డంలో విఫలం అయినట్టు పీఎన్‌బీ స్టాక్‌ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 2019 మే నుంచే ఈకంపెనీ రేటింగ్‌ ఏజెన్సీలకు సహకరించడానికి నిరాకరించి నట్టు బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ ఏప్రిల్‌ 17న వెల్లడించింది. క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సింటెక్స్‌ రూ.707 కోట్ల నష్టాలు చూపించింది. కేవలం రూ.150 కోట్ల రెవె న్యూ మాత్రమే ఆర్జించింది. కేర్‌ రేటింగ్స్‌ ప్రకారం.

సింటెక్స్‌ ఇండిస్టీస్‌ 2019 జులైలో రుణాల పునరు ద్దరణకు సంబంధించిన ప్రణాళికను బ్యాంక్‌లకు సమర్పించింది. కాగా 2019 డిసెంబర్‌లో ఆ ప్రణాళి కలను రుణదాతలు తిరస్కరించారు. ప్రస్తుతం సింటెక్స్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అమిత్‌ డి పటేల్‌, సిఇఒగా దినేష్‌ బి పటేల్‌, డైరెక్టర్లుగా రాజేష్‌ బి పారిఖ్‌, సునీల్‌ కుమార్‌ కనోజియా, మైత్రీ మెహతా ఉన్నారు.

బ్యాంక్‌ పేరు ఇచ్చిన అప్పు
పీఎన్‌బీ రూ.1,176 కోట్లు
బీఓబీ రూ.649 కోట్లు.
యూబీఐ రూ.621 కోట్లు
కెనరా బ్యాంక్‌ రూ.472 కోట్లు.
ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రూ.416 కోట్లు.
ఓబీసీ రూ.300 కోట్లు.

Courtesy Nava Telangana