908కి చేరిన మరణాలు.. నిపుణులను పంపిన డబ్ల్యూహెచ్‌వో

బీజింగ్‌, న్యూ ఢిల్లీ : చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒక్క రోజే 97 మందిని బలి తీసుకుంది. వీరిలో 91 మంది వైరస్‌ వెలుగుచూసిన వూహాన్‌ నగరం ఉన్న హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందినవారే. కొత్తగా 3,062 మందికి వైరస్‌ సోకింది. దీంతో కేసుల సంఖ్య 40,171గా నమోదైంది. మొత్తమ్మీద ఇప్పటివరకు 908 మంది మరణించినట్లు చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రకటించింది.

వుహాన్‌లో కోటిన్నర మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. తీవ్రత నేపథ్యంలో చైనా అధికారులకు సహకరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందాన్ని పంపింది. తమ దేశంలోని 27 మంది విదేశీయులకు కరోనా సోకిందని వారిలో అమెరికన్‌ సహా ఇద్దరు మృతి చెందారని చైనా తెలిపింది. కరోనాను 15 నిమిషాల్లోనే నిర్ధారించే కిట్‌ను తియాన్జిన్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. కరోనాను ఎదుర్కొనడంలో సాయపడతామని ప్రకటించినందుకు భారత ప్రధాని మోదీకి చైనా కృతజ్ఞతలు తెలిపింది. జపాన్‌తీరంలో నిలిపివేసిన క్రూయిజ్‌లో కొత్తగా 60 మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

నౌకలో భారతీయులూ ఉన్నారని ఎంబసీ తెలిపింది. 160 మంది సిబ్బంది, 8 మంది ప్రయాణికులు భారత్‌కు చెందినవారని తెలుస్తోంది. నౌక సిబ్బందిలో ఒకరైన వినయ్‌కుమార్‌ సర్కార్‌ అనే బెంగాల్‌ చెఫ్‌.. ‘మోదీ జీ మమ్మల్ని కాపాడండి’ అంటూ వీడియో పంపాడు. ఎండలు ఎక్కువగా ఉండే ఏప్రిల్‌లో వేడిమిని తట్టుకోలేక కరోనా వైరస్‌ నశిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కరోనా మందు కనిపెట్టిన వారికి రూ.కోటి ఇస్తానని ప్రముఖ నటుడు జాకీచాన్‌ ప్రకటించారు.

Courtesy Andhrajyothi