– రాజ్యాంగ విరుద్ధాన్ని మరిచారా? : విశ్లేషకులు
న్యూఢిల్లీ: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఎన్నికల్లో ఆరేండ్లపాటు పోటీ చేయకూడదనే ఆంక్షలను 13 నెలలకు కుదిస్తూ ‘భారత ఎన్నికల సంఘం’ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 11వ సెక్షన్‌ కింద తమకున్న అధికారాలను ఉపయోగించుకొని ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ చెప్పుకురావటం గమనార్హం. దీనిపై రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసీ పనితీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయనీ, ఈసీ తప్పటడుగు వేసిందని రాజ్యాంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాల్లోకివెళ్తే.. ఓ అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ 2018 ఆగస్టులో జైలు నుంచి విడుదలయ్యారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం నిబంధనల ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఆరేండ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరాదు. అయితే 2019, మే నెలలో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ నాయకత్వంలోని ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ పోటీ చేసింది. అసెంబ్లీలోని 32 సీట్లకుగాను 17 సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షమైన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను గెలుచుకున్న ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ తమ శాసన సభాపక్ష నేతగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో తమాంగ్‌పై ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదనే ఆంక్షలున్నప్పటికీ, తమాంగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిక్కిం గవర్నర్‌ ఆహ్వానించారు. ఆ మేరకు 2019, మే 27వ తేదీగా సిక్కిం ముఖ్యమంత్రిగా తమాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన గత నాలుగు నెలలుగా సీంగా పదవిలో కొనసాగుతున్నారు.

శాసన సభ్యత్వం లేకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి చట్టం ప్రకారం ఆరు నెలల్లో శాసన సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. అంటే ఆయన ఎన్నిక కావడానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. అయితే మన చట్టాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హతవేటు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకూడదు. దీన్ని మర్చిపోయి ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం అనేక తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉన్నదనీ, అలాగే ఈసీ తీరుపై అనుమానాలు కలుగుతన్నాయనీ రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేసులోనే తమిళనాడు మాజీ సీఎం జయలలిత విషయంలో 2001లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు.

Courtesy NavaTelangana..