న్యూఢిల్లీ: లాన్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని అన్నార్తుల ఆకలి తీర్చేందుకు సిక్కులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఢిల్లీలోని సిఖ్‌ గురుద్వారా కార్యనిర్వాహక కమిటీ (డీఎస్‌జీఎంసీ) నిరంతరాయంగా పేదలకు ఆహారం అందిస్తోంది. దేశ రాజధానిలోని గురుద్వారా బంగ్లా సాహిబ్‌ ప్రతిరోజు 40 వేల మందికిపైగా సరిపడా ఆహారం సిద్ధం చేస్తోందని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ తెలిపింది. ‘మా కిచెన్‌ ద్వారా ప్రతిరోజు 40 వేల మందికిపైగా ఆహారం అందిస్తున్నాం’ అని ఈ కార్యక్రమానికి బాధ్యుడిగా వ్యవహరిస్తున్న హర్‌బీర్‌ సింగ్‌ చెప్పారు.

గురుద్వారాలోని అతిపెద్ద కిచెన్‌లో 40 మంది వంట చేస్తారు. మరో 20 మంది పంపిణీ బాధ్యతలు చూసుకుంటారు. అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుని వంట తయారు చేస్తామని, కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తామని హర్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. కిచెన్‌లోకి వచ్చే ముందు సహాయకులు అందరు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటారని వెల్లడించారు. మధ్యాహ్న భోజనం కోసం ఉదయం 5 నుంచి 11 గంటల వంట చేస్తామన్నారు. సాయంత్రం భోజనానికి 6 గంటలకు వంట చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం 20 వేలు, సాయంత్రం మరో 20 వేలు భోజనాలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

వీరు పంపిణీ చేసే భోజనంలో అన్నం, రొట్టె, కూర, ప్రసాదం ఉంటాయి. గత 12 రోజుల్లో సిక్కులు 4.5 లక్షల మంది ఆకలి తీర్చారు. క్లిష్ట సమయంతో అన్నార్తులకు అన్నం పెట్టడం తప్పా మరో మార్గం లేదని హర్‌బీర్‌ సింగ్‌ అన్నారు. ఆటోమాటిక్‌ యంత్రంతో గంటకు 1.5 క్వింటాల్‌ పిండితో రొట్టెలు తయారు చేస్తామని, దీంతో మనుషుల అవసరం తక్కువ ఉంటుందని వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 60 వేల నుంచి లక్ష మంది వరకు గురుద్వారాలో భోజనం సి​ద్ధం చేసేవారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తుండటం వల్ల భోజనం తయారు చేసే సామర్థ్యం తగ్గిందని ఆయన వివరించారు.