శంషాబాద్ సిద్దులుగుట్ట దగ్గర మహిళా సజీవ దహనం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సంఘటనా స్థలం నుంచి కాలిపోయిన చీర, గాజులు, చెప్పులు, మరికొన్ని వస్తువును సేకరించిన క్లూస్ టీమ్.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. మరోవైపు ఈ కేసు గురించి మాట్లాడిన డీసీపీ ప్రకాష్ రెడ్డి.. ఈ అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్నామని అన్నారు. ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్న ఆయన..సైంటిఫిక్ ఏవిడెన్స్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీసీ ఫుటేజ్‌లో మహిళ ఒంటరిగా వెల్లుతున్నట్లు కనిపించిందని.. ఆమె గురించి స్థానిక గుడి దగ్గర పూజారిని విచారణ చేశామని వివరించారు. మహిళ హిందీలో మాట్లాడినట్లు పూజారి చెప్పుకొచ్చారని.. దీంతో ఆ మహిళ ఉత్తరాది వాసిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ప్రియాంక రెడ్డి హత్య జరిగిన 24గంటల్లోపే శంషాబాద్‌ ఏరియాలో అలాంటి సంఘటనే జరగడం నగరవాసులను కలవరపాటుకు గురిచేసింది. ఈ మహిళను కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత కేసును నమోదుచేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెది ఆత్మహత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Courtesy Prajasakthi