– పార్టీ సభ్యత్వానికి 80 మంది రాజీనామా
– సిఎఎను నిరసిస్తూ నడ్డాకు లేఖ

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బిజెపికి గట్టి షాక్‌ తగిలింది. పార్లమెంట్‌లో మోడీ సర్కార్‌ ఆమోదింపజేసుకున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని బిజెపికి చెందిన 80 మంది ముస్లిం నేతలు..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు గురువారం లేఖ రాసినట్లు నేతల్లో ఒకరైన రాజిక్‌ ఖురేషీ ఫర్షివాలా తెలిపారు.

మత ప్రాతిపదిక చేసిన విభజన చట్టంగా సిఎఎను వారు అభివర్ణించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో బిజెపి మైనార్టీ సెల్‌కు చెందిన పలువురు ఆఫీస్‌ బేరర్లు కూడా ఉన్నట్లు ఖురేషీ చెప్పారు. సిఎఎ ఉనికిలోకి వచ్చిన నాటి నుండి తాము మతపరమైన సంఘాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా సిఎఎ వంటి విభజన చట్టంపై ఎంత కాలం మౌనంగా ఉంటారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఏ మతంలోనైనా పీడనకు గురైన శరణార్థులకు భారత పౌరసత్వాన్ని ఇవ్వాలని అన్నారు. అంతేకానీ, ఒక నిర్థిష్ట వ్యక్తిని

మతప్రాతిపదికన ఉగ్రవాది, చొరబాటుదారుడు అని నిర్ధారించలేమని తెలిపారు.
నడ్డాకు రాసిన లేఖలో ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 పౌరులందరికీ సమాన హక్కును కల్పిస్తుంది. కానీ, బిజెపి నేతృతంలోని మోడీ సర్కార్‌ మతం ఆధారంగా సిఎఎను అమలు చేస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే కాకుండా, దేశాన్ని విభజించే చర్య ‘ నేతలు పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజరు వర్గీయకు సన్నిహితులు కూడా ఉన్నట్లు సమాచారం. రాజీనామాల విషయంపై ఆయన మాట్లాడుతూ తనకేమీ తెలియదని, సిఎఎపై వారిని ఓ వ్యక్తి తప్పుదారి పట్టించి ఉన్నట్లయితే వారికి వివరిస్తామని అన్నారు.

Courtesy Prajashakthi