– ఏడాదిగా నిలిచిపోయిన పథకాలు
– కేంద్రం నిధుల్లేక చేతులెత్తేసిన ప్రభుత్వం
– అప్పులు చేసి డీడీలు చెల్లించిన లబ్దిదారులు
– మొదటి రెండు విడతల్లోనూ సగానికంటే తక్కువే పంపిణీ

గొర్రెలు, బర్రెల పంపిణీ పథకాలు నిధుల కొరతతో నిలిచిపోయాయి. కేంద్రం నుంచి నిధులు నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఏడాది కింద డీడీలు కట్టిన లబ్దిదారులు గొర్రెలు, బర్రెల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మొదటి విడతలో ఆర్భాటంగా పథకాన్ని పక్కాగా అమలు చేసినా రెండో విడత ప్రారంభంలోనే నిలిపివేశారు. దీంతో డీడీలు కట్టిన లబ్దిదారులు, కట్టేందుకు ఎదురుచూస్తున్న వారి ఆశలు నిరాశగానే మిగిలాయి. నవతెలంగాణ-కరీంనగర్‌ ప్రాంతీయప్రతినిధి
గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా 2017 జూన్‌లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మరో ఏడాది తరువాత పాడి రైతులనూ ఆర్థికంగా ఆదుకుంటామని 2018 ఆగస్టులో గేదెల పంపిణీని అట్టహాసంగా షురూ చేసింది. గొర్రెల పథకంలో లబ్దిదారుకు రూ.లక్షా 25వేల విలువైన ఒక్కో యూనిట్‌ అందించింది. లబ్దిదారుడు 20శాతం చెల్లించాల్సి ఉండగా మిగతా ప్రభుత్వమే భరించింది. బర్రెల పంపిణీ పథకంలో యూనిట్‌కు రూ.80వేలు కేటాయించగా ఎస్సీ, ఎస్టీలకు 20శాతం, బీసీ, ఇతర కేటగిరిలకు చెందిన వారు 40శాతం వాటా వసూలు చేసింది. మిగతా రాయితీ రూపంలో సర్కారు భరించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా మొదటి, రెండు విడతల్లో 92వేలా 278 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 49వేలా 405 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగతా వారు డీడీలు కట్టి గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బర్రెల పంపిణీ పథకాన్ని పరిశీలిస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరీంనగర్‌, ముల్కనూర్‌ డెయిరీలు, టీఎస్‌ డీడీసీఎఫ్‌ఎల్‌ కింద పాలు సరఫరా చేసే రైతులను అర్హులుగా గుర్తించారు. మొదటి విడతలో గుర్తించిన 47వేలా 49 మంది రైతులకుగాను 4వేలా784 మందికే బర్రెలు అందించినట్టు తెలిసింది. మిగతావారిలో సగం మంది మేర డీడీలు కట్టి ఏడాదికాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

అప్పులు చేసి డీడీలు తీసి..
ఈ రెండు పథకాల్లో మొదటి, రెండో విడతల్లో డీడీలు తీసుకున్న అధికారులు తర్వాత దాని ఊసే ఎత్తడం లేదు. కొత్తగా డీడీలు కూడా తీసుకోవడం లేదు. గొర్రెల పంపిణీ పథకంలో జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి రెండో విడతలో డీడీలే తీసుకోలేదు. జగిత్యాల జిల్లాలో 5వేలా164 యూనిట్లకు డీడీ తీసుకుని వారికి ఇంతవరకు గొర్రెలు అందజేయలేదు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 361 మంది డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్నారు. ఇక బర్రెల పంపిణీ పథకంలో పరిశీలిస్తే కరీంనగర్‌ జిల్లాలో 946 మంది డీడీలు చెల్లించగా అందులో 87 మంది తిరిగి తీసుకున్నారు. మరో 79 మంది తమ డీడీలు ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. డీడీలు తీసిన లబ్దిదారుల్లోనూ అత్యధికులు అప్పులు చేశామని ఆవేదన చెందుతున్నారు.

నిధుల్లేక నిలిచిన పథకాలు
నేషనల్‌ కోపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) కింద ఈ రెండు పథకాల్లో ఎంపిక లబ్దిదారులకు కేంద్రం 60శాతం రుణాలు, 20శాతం రాయితీ ఇవ్వగా, మిగతా 20శాతం లబ్దిదారుల నుంచి వాటా తీసుకున్నారు. ఈ మేరకు రుణాలు, రాయితీ నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉండగా నిలిచిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు పథకాలు తాత్కాలికంగా నిధులు ఆపివేయగా నవంబర్‌ నుంచి పూర్తిగా నిలిచిపోయాయి.

ఏడాదిగా బర్ల కోసం..
ఏడాది క్రితం సబ్సిడీపై బర్రె ఇస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రకటించగా, ప్రయివేటు అప్పు రూ.40వేలు తీసుకొచ్చి చెల్లించాను. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి బర్రె రాలేదు. అధికారులను అడిగితే సమాధానం రావడం లేదు. తెచ్చిన అప్పునకు వడ్డీ పెరుగుతోంది.
– ఎర్రవెల్లి పోచయ్య. శంకరపట్నం మండలం, ముత్తారం

ఆపేయాలని ఉత్తర్వులు..
గొర్రెలు, బర్రెల పంపిణీ పథకాలు ప్రస్తుతం నిలిచిపోయాయి. గతేడాది నబంబర్‌ 25 నుంచి ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మళ్లీ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేస్తే పెండింగ్‌ యూనిట్లను అందజేస్తాం.
– డాక్డర్‌ ఆశోక్‌కుమార్‌, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి

Courtesy Nava Telangana