-శరద్‌పవార్‌ ద్విముఖ వ్యూహంతో అజిత్‌ ‘రాజీ’ నామా!
-కుటుంబసభ్యుల అభ్యర్థనలు
-పార్టీ నేతల బుజ్జగింపులు
-‘మహా’ రాజకీయాన్ని  ‘మరో’ మలుపు తిప్పిన వైనం
రాజేంద్ర సాఠే

ముంబయి: అనూహ్యంగా సొంత పార్టీని, బాబాయిని తోసిరాజని అధికార పక్షానికి వత్తాసు పలికి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్‌ పవార్‌ అంతే హడావుడిగా ఆ పదవికి రాజీనామా సమర్పించడం వెనుక అసలేం జరిగిందనేది ఆసక్తికరం. చిన్నాన్నగా బాంధవ్యం విషయంలో ఆప్యాయతను ఏమాత్రం వీడకుండా శరద్‌పవార్‌ అనుసరించిన ద్విముఖ వ్యూహం అజిత్‌ పవార్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు అజిత్‌ ‘రాజీ’నామా చేయడానికి కారణమయ్యాయి.

పురిట్లోనే సంధి…
అజిత్‌పవార్‌ రాజీనామాతో నవజాత భాజపా సర్కారుకు పురిట్లోనే సంధి కొట్టినట్లయింది. బలపరీక్ష జరగాల్సి ఉన్న సమయంలో ఫడణవీస్‌ సర్కారు బలహీన‘పడి’పోయింది.
పవార్‌ ద్విముఖ వ్యూహం!
ఎన్సీపీపై తనకు పూర్తి పట్టు ఉందన్న విషయాన్ని రాజకీయ కురువృద్ధుడైన శరద్‌పవార్‌(79) తాజాగా నిరూపించుకున్నారు. నిజానికి అజిత్‌ రాజీనామా చేసి భాజపాతో చేతులు కలిపిన క్షణం నుంచీ ఆయన పట్ల ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. అటు శరద్‌పవార్‌గానీ, ఇటు ఎన్సీపీకానీ అజిత్‌తో పూర్తి తెగతెంపులు చేసుకోలేదు. అజిత్‌ చర్యను తాను ఏమాత్రం సమర్థించడం లేదని శరద్‌పవార్‌ మొదట్నుంచీ విస్పష్టంగా చెబుతూనే ఉన్నారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామనీ ప్రకటించారు. అయినా అజిత్‌పై శరద్‌ పవార్‌ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదు. బారామతి నియోజకవర్గంలో శరద్‌పవార్‌కు మద్దతిస్తూ వెలిసిన పోస్టర్లను వెంటనే తొలగించేయాలంటూ ఆయనే స్వయంగా ఆదేశించడం గమనార్హం.

జయంత్‌ పాటిల్‌, ఛగన్‌భుజ్‌బల్‌ వంటి సీనియర్‌ నాయకులు గత రెండురోజుల్లో కనీసం ఆరుసార్లు అజిత్‌తో సమావేశమయ్యారు. సోమవారం అజిత్‌తో ఛగన్‌భుజబల్‌ తదితరులు ఏకంగా నాలుగుగంటల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. మరోవైపు సోదరి సుప్రియాసూలే(శరద్‌పవార్‌ కుమార్తె)తో పాటూ ఇతర కుటుంబసభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా అజిత్‌కు అభ్యర్థనలు చేస్తూనే పోయారు. ‘దాదా’ అంటూ ఎంతో ఆపేక్షగా అన్నయ్యను పిలుచుకునే సుప్రియా సూలే తిరిగి ఎన్సీపీలోకి వచ్చేయండి అంటూ అజిత్‌ను ఎంతో ఉద్వేగంగా అభ్యర్థించారు.

కర్ర విరగకుండా…పాము చావకుండా…
ఈ ద్విముఖ వ్యూహం శరద్‌పవార్‌కు రెండు రకాలుగా కలిసి వచ్చింది. ఎన్సీపీలో అజిత్‌ను బాగా ఇష్టపడే శాసనసభ్యులు, నాయకులు ఉన్నారని శరద్‌పవార్‌కు తెలుసు. అజిత్‌ పట్ల విముఖతను ఏ మాత్రం ప్రదర్శించినా అది తమకే చేటు చేస్తుందని ఆయన భావించారు. అందుకే ఆ పరిస్థితి రాకుండా ఆయన ఆచితూచి వ్యవహరించారు. ఒకవేళ తిరిగి సొంతగూటికి రావాలనుకుంటే పార్టీతలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న భావనను అజిత్‌లోనూ కలిగించగలిగారు.

అన్నకుమారుడి బలాలు, బలహీనతలన్నీ కూడా బాబాయికి బాగా తెలుసు. సొంతకుమార్తె సుప్రియా సూలే కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమని, మహారాష్ట్రముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదనీ అజిత్‌కు ఎంతగా చెప్పినా ఆయన భాజపా పక్షాన చేరడం అనేది శరద్‌పవార్‌కు పెద్ద షాక్‌. అయినా సరే ఆయన నిబ్బరాన్ని కోల్పోలేదు. చివరకు అజిత్‌ను వెనక్కి రప్పించుకోగలిగారు.

మంగళవారం ఏం జరిగిందంటే
* శరద్‌పవార్‌ మంగళవారం ఉదయాన్నే అజిత్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. భాజపాతో చేతులు కలిపి అధికారంలో కొనసాగే అంశంపై మరోసారి యోచించాలని అజిత్‌ను అడిగారు.
* ఆ తర్వాత అజిత్‌ దక్షిణముంబయిలోని ఓ హోటల్‌లో సుప్రియాసూలే భర్త(శరద్‌పవార్‌ అల్లుడు)సదానంద్‌ సూలేతో సమావేశమయ్యారు.
* వెంటనే ఆయన నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘వర్ష’కు వెళ్లారు. అక్కడ జరిగిన భాజపా కోర్‌కమిటీ సమావేశం అనంతరం అజిత్‌ తన రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Courtesy Eenadu..