కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా ఆందోళనలు చేస్తున్న వారిపై బీజేపీ నేతలు, మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనలను ఉద్దేశించి కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ బుధవారం ట్విట్టర్‌ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షాహీన్‌బాగ్‌ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న ఆందోళనలను పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని, దేశం, దేశ రాజధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో గిరిరాజ్‌ సింగ్‌ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన పలుమార్లు పలు అంశాలకు సంబంధించి వివాదాస్పదంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు, యువత, చిన్నారులు డిసెంబర్‌ 18 నుంచి దాదాపు గత 50 రోజులుగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ఏరియాలో నిరవధిక ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు.