షహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు అత్యంత కీలకమైనవి, చర్చనీయమైనవి కూడా. నిరసన తెలపడం రాజ్యాంగబద్ధ హక్కు అని చెబుతూనే, ఇతరులకు అసౌకర్యం కలిగే విధంగా వ్యవహరించడాన్ని సమ్మతించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రహదారికి అడ్డుగా, సుదీర్ఘకాలం నిరసన శిబిరం నిర్వహించడం సరి కాదనే తీర్పు అభిప్రాయపడింది. ‘‘ఒక ఉమ్మడి స్థలంలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా నిరసనలను నిరవధికంగా కొనసాగించవచ్చునా’’ న్యాయనిర్ణయం ఇవ్వాలంటూ దాఖలయిన అనేక పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది. గత నెల 21వ తేదీన తీర్పును వాయిదా వేస్తూ న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘నిరసన హక్కుకు, రహదారుల నిరోధానికి నడుమ మేం సమతూకంతో వ్యవహరించాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిరసనలు పార్లమెంటులోనూ జరుగుతాయి, రోడ్ల మీదా జరుగుతాయి. కాకపోతే, రోడ్ల మీద జరిగేవి శాంతియుతంగా జరగాలి’’. బుధవారం నాటి తీర్పు పై వాక్యాల స్ఫూర్తికి లోబడే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ, హక్కుల మీద కంటె బాధ్యతల మీదనే ఊనిక ఎక్కువ ఉన్నట్టు ధ్వనిస్తుంది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై ఆందోళనలు చేయరాదని నిర్దేశించాలంటూ పిటిషన్‌దారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోర్టుల్లో విచారణలో ఉన్న అంశాలపై కూడా నిరసనలు, ఆందోళనలు చేయడం ప్రజాస్వామిక హక్కేనని అభిప్రాయపడింది.

గత సంవత్సరాంతంలో పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు ఉన్నట్టుండి ప్రారంభమై, షహీన్‌బాగ్‌ శిబిరంగా రూపుదాల్చాయి. విశ్వవిద్యాలయాల విద్యార్థులు, చుట్టుపక్కల ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంచుకుని ప్రత్యేక ప్రణాళిక, నాయకత్వం, కాలవ్యవధి అంటూ ఏదీ లేకుండానే శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరం పెరుగుతున్న కొద్దీ అది రహదారికి అడ్డుగా మారింది. నిజానికి, దీక్షాశిబిరం ఉన్న దారి ఏకైక మార్గం కాదని, ఆ దారి గుండా వెళ్లవలసినవారికి ప్రత్యామ్నాయ మార్గం ఉన్నదని ఆందోళనకారులు వాదిస్తూ వచ్చారు. శిబిరంలో కనిపించే సందడి, ఉద్వేగపూరిత సమావేశాలు, పాటలు, నినాదాలు– దాన్నొక సందర్శనీయ స్థలంగా చేశాయి. నిషేధాజ్ఞల ద్వారా దాన్ని ఎత్తివేయించడానికి ప్రభుత్వాలు సాహసించలేదు. రహదారి అవరోధం పేరుతో అభ్యంతరపెడుతున్నవారు నిజానికి శిబిరం లక్ష్యాన్ని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నవారేనని ఆందోళనకారులు అభిప్రాయపడేవారు. చివరకు అదే సమస్య మీద అనేక పిటిషన్లు మొదట హైకోర్టులోను, తరువాత సుప్రీంకోర్టులోను దాఖలయ్యాయి. హైకోర్టులో ఇచ్చిన తీర్పు శిబిరాన్ని ఖాళీ చేయించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించలేదు. దాని మీద ప్రస్తుత తీర్పులో సుప్రీంకోర్టు అసంతృప్తి ప్రకటించింది.

ఈ తీర్పు ఒక మార్గదర్శక సూత్రంగా పనికివచ్చేదే తప్ప, తక్షణ ఆచరణాంశం ఇందులో లేదు. ఎందుకంటే, షహీన్‌బాగ్‌ శిబిరం ఇప్పుడు ఉనికిలో లేదు. కేంద్రప్రభుత్వ అధీనంలోని ఢిల్లీ పోలీసు యంత్రాంగం అనుసరించిన రకరకాల ఎత్తుగడల వల్ల, ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ వల్ల, కొవిడ్‌ ఉపద్రవం వల్ల ఆ శిబిరం చెదిరిపోయి, చివరకు లేకుండా పోయింది. ఆ శిబిరం ఉనికిలో ఉన్నప్పుడు, రోడ్డుకు అడ్డంగా పౌరులకు అవరోధంగా నిర్వహించడం తప్పు అని చెప్పడమే కాకుండా, మున్ముందు జరిగే ఆందోళనలు కూడా కేటాయించిన ప్రదేశాలలో జరగాలని సుప్రీంకోర్టు సూచిస్తోంది.

నిజానికి, అనేక ప్రజా ఉద్యమాలు రాస్తారోకోలను, దిగ్బంధాలను, బంద్‌లను రైల్‌రోకోలను ఆందోళన రూపాలుగా ఆచరిస్తున్నాయి. అటువంటివాటిని పూర్తిగా ప్రస్తుత తీర్పు నిరాకరిస్తున్నదా? అలా కాక, దీర్ఘకాలం అవరోధాలను కొనసాగించడం మీద మాత్రమే అభ్యంతరపెడుతున్నదా– స్పష్టత లేదు. అన్ని సందర్భాలకూ ఒకే పరిష్కారం ఉండదు, స్థానిక పరిస్థితులను బట్టి వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు చేసిన సూచనలను సుప్రీంకోర్టు నిరాకరించినట్టే భావించాలా? నిర్దేశించిన స్థలాలు, అన్ని చోట్లా ఉంటాయా? అక్కడ కూడా పౌరులకు అసౌకర్యం పేరుతో నిరసనలను అడ్డుకుంటే? హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను దీర్ఘకాలం అనుమతించకపోవడం తెలిసిందే. సమావేశాలు జరుగుతున్నప్పుడు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి, చట్టసభల దృష్టికి తేవడం కోసం దేశరాజధానికి, రాష్ట్ర రాజధానులకు వస్తారు. వారందరికీ నిర్దేశిత స్థలాలున్నాయా? దేశరాజధానిలో కూడా ప్రజా ఉద్యమాల కోసం గతం నుంచి వాడుకలో ఉన్న స్థలాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నది. ప్రజాస్వామిక హక్కుల విషయంలో ప్రభుత్వాల వైఖరిలో వస్తున్న మార్పులను కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి.

ఇక, షహీన్‌బాగ్‌ వంటి స్వచ్ఛంద, స్వతంత్ర, నాయకత్వ రహిత ఉద్యమాల గురించి సుప్రీంకోర్టు అభిప్రాయాలు సమకాలీన ధోరణులకు అనుగుణంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా, సామాజిక మాధ్యమాల సాయంతో అనేక స్వచ్ఛంద ఉద్యమాలు చేలరేగాయి, రేగుతున్నాయి. ఈజిప్టులో తహ్రీక్‌ స్వ్కేర్‌ ఉద్యమం, అమెరికాలో ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌ వంటి ఉద్యమాలు ఎటువంటి నిర్దిష్ట నాయకత్వం లేకుండా సాగాయి. రంగంలో ఉన్న రాజకీయ పార్టీలతో, నాయకులతో నిమిత్తం లేకుండా కానీ, లేదా వారిపై నమ్మకం లేకపోవడం వల్ల కానీ ఇటువంటి ఉద్యమాలు కొత్తగా వస్తున్నాయి. ఏ నాయకత్వమూ లేకపోవడం వల్ల వాటితో సంభాషించడం కష్టమవుతున్నదని భావించడం సరికాదు. మనసుంటే మార్గముంటుంది. నిజానికి, షహీన్‌బాగ్‌ ఉద్యమకారులతో సంభాషించడానికి, వారితో సంప్రదించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలే జరగలేదు.

పౌరబాధ్యతలను విస్మరించలేము కానీ, ఉద్యమాల సరళిని ఖచ్చితంగా నిర్దేశించడమూ సాధ్యం కాదేమో?

Courtesy Andhrajyothi