చానల్‌ ఉద్యోగినితో అసభ్య సంభాషణ?
వైరల్‌ అయిన ఆడియో..
టీటీడీ చైర్మన్‌ ఆదేశాలతో రాజీనామా
ఆ గొంతు నాది కాదన్న పృథ్వి

తిరుపతి, పంజాగుట్ట/హైదరాబాద్‌ : శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్‌ రాజీనామా చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వి… చివరికి తానే ‘రాసలీలల’ బురదలో చిక్కుకుని ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. ఎస్వీబీసీ చానల్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తొలగించి అక్రమ నియామకాలకు పాల్పడడం, అవి వెలుగులోకి వచ్చిన తరుణంలోనే ఓ మహిళతో అతను మాట్లాడిన శృంగార సంభాషణల ఆడియో టేప్‌ వెలుగులోకి రావడంతో ఇక అతనిని ఆ పదవి నుంచి తప్పించక తప్పని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఏర్పడింది. పృథ్వీరాజ్‌ ఆడియో టేప్‌ దుమారం రేపుతుండగా, ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని టీటీడీ చైర్మన్‌ సూచించడం, మరికాసేపటికే పృథ్వీ ప్రెస్‌మీట్‌ పెట్టి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

ఆయన ఆది నుంచీ అంతే
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పృథ్వీ దగ్గరగా ఉంటూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను గత ఏడాది జూలైలో నియమించింది. ప్రతిష్ఠాత్మకమైన ఎస్వీబీసీకి వ్యంగ్య పాత్రలు వేసే నటుడిని చైర్మన్‌గా చేయడమేమిటని విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ఆయననే కొనసాగించింది. జూలై 31న బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘జీవితకాలం స్వామి సేవలో ఉండాలనుకుని వచ్చా. నేను సిగ్నేచర్‌ చైర్మన్‌ కాదు. వర్క్‌ చైర్మన్‌ని’ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఆయన వచ్చిన వెంటనే ఎస్వీబీసీలో సీఈవో చేయాల్సిన పనుల్లో జోక్యం చేసుకుంటూ వచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. టీటీడీకి సమాచారం ఇవ్వకుండా ఎస్వీబీసీలో 30 మంది కాంట్రాక్టు సిబ్బందిని పృథ్వీరాజ్‌ తొలిగించి, వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను 36 మందిని నియమించినట్లు సమాచారం. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పృథ్వీకి మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇంతలో మహిళా ఉద్యోగితో ఆయన శృంగార సంభాషణ బయటపడంతో ఒక్కసారిగా ఎస్వీబీసీ పరువు బజారున పడింది.

ఆయన చేసింది తప్పు
టీటీడీ ప్రతిష్ఠను ఎవరు దెబ్బతీసినా ఉపేక్షించేది లేదు. ఎస్వీబీసీలోకి పృథ్వీ తీసుకున్న 36 మందిని నేనే తొలగించా. బాధితులు నా వద్దకు వస్తే వారికి కూడా ఆయన చేసింది తప్పు అని చెప్పా. మహిళా ఉద్యోగితో టెలిఫోన్‌ సంభాషణ ప్రైవేట్‌ వ్యవహారం కాదు. టీటీడీ ప్రతిష్ఠను కాపాడే క్రమంలో ఈ విషయాన్ని సులభంగా వదిలేయడం వీలుపడదు.
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 
ఆడియోలో ఏముంది?
శని, ఆదివారాల్లో విస్తృత ప్రచారంలోకి వచ్చిన ఆడియో రికార్డు ప్రకారం ఉద్యోగినితో పృథ్వీ జరిపిన ఫోన్‌ సంభాషణ ఇదీ… ‘‘పడుకునేటప్పుడు గుర్తొచ్చానా? మార్చి వరకు మందు తాగను. నేను తాగడం మొదలుపెడితే నీతోనే మొదలుపెడతా. నువ్వు కంపెనీ ఇవ్వాలి. నువ్వు నా గుండెల్లో ఉన్నావ్‌. నువ్వంటే నాకు అంత ఇష్టం. నేను కామెడీ చేయడం లేదు. వెనక నుంచి పట్టుకుందామనుకున్నా. కెవ్వు మని అరుస్తావని భయపడ్డా. ఐ లవ్‌ యూ’’
ప్రతిష్ఠను దిగజార్చారు
టీటీడీ, ఎస్వీబీసీ ప్రతిష్ఠను పృథ్వీరాజ్‌ దిగజార్చారని ఎస్వీబీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. చానల్‌లో విధులు నిర్వహించే ఓ యువతితో పృథ్వీరాజ్‌ అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో టేపులను ఆయన పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. పద్మావతి అతిథి గృహంలోనే పృథ్వీ మద్యం సేవించడం తిరుపతి పవిత్రతకు విఘాతం కల్పించినట్లు కాదా? అని ప్రశ్నించారు.

(Courtesy Andhrajyothi)