– ఒడిశాలో బాలికపై ఇద్దరు దుండగుల పాశవిక చర్య
– 22 రోజులుగా బాధితురాలిపై దారుణం
– బెంగాల్‌లో ఆదివాసీ మహిళపై సామూహికంగా..

భువనేశ్వర్‌, కోల్‌కతా : హత్రాస్‌ ఘటనపై ఒకపక్క యావత్‌ దేశంలోని ప్రజల నుంచి ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయపార్టీలు, సంస్థలు, కుల, మత, ప్రాంతాలకతీతంగా నిరసనలు, ఆందోళనలు హౌరెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. మహిళలపై కామాంధుల దారుణాలు ఆగడంలేదు. హత్రాస్‌ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో లైంగికదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా, ఒడిశా, బెంగాల్‌లో జరిగిన పాశవిక ఘటనలు వెలుగుచూశాయి.

ఒడిశాలో మైనరుపై ఇద్దరు వ్యక్తులు 22 రోజులుగా సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన బాధితురాలు (15) తొమ్మిదో తరగతి చవుదుతోంది. అయితే కొన్ని రోజుల క్రితం తన పెద్ద అక్క ఇంట్లో ఉండటానికి కటక్‌కు వచ్చింది. కొన్ని రోజులు అక్కడ గడిపిన సదరు బాధితురాలు.. తిరిగి తన ఇంటికి వెళ్లడానికి గతనెల 20న కటక్‌లోని ఓఎంపీ స్క్వేర్‌ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తోంది. అయితే ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఆ యువతిని గమనించిన సంతోశ్‌ బెహ్రా అనే వ్యక్తి ఆమెను గమ్యస్థానానికి చేరుస్తానని నమ్మబలికాడు. ఆ మోసకారి మాటలు నమ్మిన బాధితురాలు.. అతనితో వెళ్లింది. అయితే సంతోశ్‌ బెహ్రా తన స్నేహితుడు రాకా ఫామ్‌హౌస్‌కు సదరు యువతిని తీసుకెళ్లాడు. అప్పటి నుంచి బాధితురాలిపై సంతోశ్‌, రాకాలు ఇద్దరూ దాదాపు 22 రోజులుగా అఘాయిత్యానికి ఒడిగట్టారని చౌలియాగంజ్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారు చేసిన దుర్మార్గపు చర్యను వీడియో తీసిన ఆ ఇద్దరు నిందితులు.. ఇక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా.. ఈ విషయాన్ని ఇతరులకు చెప్పినా.. వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తామని బాధితురాలిని బెదిరించారని చెప్పారు. అయితే, ఫామ్‌ హౌస్‌కు వచ్చిపోతున్న ఆ ఇద్దరు నిందితుల చర్యలపై అనుమానం వచ్చిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో, సదరు బాలికను నిందితుల చెర నుంచి పోలీసులు విడిపించారు. కాగా, ఇద్దరు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నామనీ, మరొకరి కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నామని కటక్‌ డీసీపీ ప్రతీక్‌ సింగ్‌ వెల్లడించారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

బెంగాల్‌లో అకృత్యాలు నిత్యకృత్యం
బెంగాల్‌లో మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా, పుర్బా బర్ధామాన్‌ జిల్లాలో ఓ ఆదివాసీ మహిళలపై ముగ్గురు దుండగులు సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. ఈ దుర్మార్గపు చర్యకు మరొక మహిళ కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన నందన్‌ ఘాట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సక్రా గ్రామంలో చోటు చేసుకున్నది. బహిర్భూమికి వెళ్లడం కోసం బాధిరాలు తన ఇంటి నుంచి మంగళవారం రాత్రి బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తున్న తరుణంలో మహిళతో సహా ముగ్గురు నిందితులు బాధితురాలిని అడ్డుకున్నారు. ఆమె మెడ మీద కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం ఆమెను దగ్గరలోని పొలంలోకి తీసుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి తెగబడ్డారనీ పోలీసు అధికారి ధృవదాస్‌ తెలిపారు. ఈ ఘటన జరుగుతున్నంతసేపూ ఆ ముగ్గురు నిందితులతో పాటు వచ్చిన మహిళ వారికి సహకరించిందని చెప్పారు. అయితే, నిందితులు అక్కడ నుంచి పారిపోయారనీ, అనంతరం బాధితురాలు తన ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పిందని ధృవదాస్‌ వివరించారు. కాగా, నిందితుల కోసం గాలింపుచర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

Courtesy Nava Telangana