– తెలంగాణలో ఆగని తల్లుల మరణాలు
– వైద్యఆరోగ్యశాఖ గతేడాది గణాంకాలివే..

హైదరాబాద్‌ :ఒక వైపు తల్లులు, పిల్లల మరణాలు తగ్గుతున్నాయని రాష్ట్ర సర్కార్‌ చెప్పుకుంటుంటే అలాంటిదేమి లేదని మరణాలు ఇంకా కొనసాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది అంటే 2019 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 313 మంది తల్లులు మరణించగా వారిలో ఎక్కువ ప్రసవానంతరం అధిక రక్తస్రావం కారణంగా ప్రాణాలు వదిలినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ రికార్డుల్లో వెల్లడైంది. చనిపోయిన వారిలో వైద్యపరంగా నిర్దేశించినట్టు ఆహారపు అలవాట్లు, అవసరమైన మేరకు శారీరక శ్రమ లేని, ఎప్పుడూ కూర్చునే ఉద్యోగాలు చేసే వారు, ఎక్కువసార్లు గర్భధారణకు ప్రయత్నించిన వారే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 26 శాతం మంది క్రమమైన పీరియడ్స్‌ లేకపోవడం, 18 శాతం మంది అధిక రక్తస్రావం, 14 మందిలో శరీరంలోని అంతర్గత అవయవాలుపాడైపోవడం తదితర కారణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా రక్తహీనత, గుండెసంబంధిత రుగ్మతలు, హైపర్‌ టెన్షన్‌ వల్ల మరణించినట్టు మూడింట ఒక వంతు మందిలో తేలింది. సాధారణంగా ప్రసవానంతరం తల్లుల్లో బ్లడ్‌ ప్రెషర్‌ (బీపీ) పెరుగుతుందనీ, అయితే అది 48 గంటల కన్నా ఎక్కువ సమయం ఉంటే లోపలి అవయవాలు పని చేయకుండా పోయే ప్రమాదముంటుందని స్త్రీ వైద్యనిపుణురాలు డాక్టర్‌ నబాదత్‌ బండేలీ తెలిపారు. ఈ పరిస్థితి ఒకటి కన్నా ఎక్కువ అవయవాలను పనిచేయకుండా చేయడమే కాకుండా ఫిట్స్‌కు, అధిక రక్తస్రావానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే కాకుండా, మారిన జీవనశైలి, కుటుంబ అనారోగ్య చరిత్ర, తల్లులు కావడానికి ముందు హైపర్‌ టెన్షన్‌ ఉండడం కూడా ఇలాంటి మరణాలకు కారణమవుతున్నది. దీంతో పాటు కృత్రిమ గర్భధారణ టెక్నిక్స్‌ ఉపయోగించిన వారిలో సాధారణంగా గర్భధారణ పొందిన వారికన్నా పరిస్థితి కొంత మేరకు భిన్నంగా ఉంటుందని స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రభ అగర్వాల్‌ వివరించారు. అయితే ఈ మరణాలను తగ్గించడానికి ఆస్పత్రుల్లో సదుపాయాలను, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.

Courtesy Nava telangana