మత్తులోకి దించుతాడు మట్టుపెడతాడు

16 మంది మహిళలను అంతమొందించిన ఉన్మాది
కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలే అడ్డాలు
నగల కోసం ఘాతుకాలు
నిందితుడిని పట్టుకున్న మహబూబ్‌నగర్‌ పోలీసులు
మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం) – న్యూస్‌టుడే

నరహంతకుడు

అతనో సీరియల్‌ కిల్లర్‌. కల్లు, మద్యం తాగే మహిళలే అతడి లక్ష్యం.. ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఇప్పటి వరకు ఏకంగా 16 మంది మహిళలను మట్టుపెట్టాడు. కేవలం వారి ఒంటిపై ఉన్న బంగారం, సొమ్ముల కోసమే ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సొంత తమ్ముడిని కూడా అంతమొందించాడు. ఇటీవల ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడ్‌ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను చేసిన దురాగతాలివి.. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి నిందితుడిని విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి.. అతని నేరచరిత్రను వివరించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు శివారు.. నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) మృతదేహాన్ని ఈ నెల 17న పోలీసులు గుర్తించారు. క్లూస్‌టీం సమాచారంతో ఈమెది హత్య అని.. నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇందులో ఎరుకల శ్రీను పాత్ర ఉన్నట్లు అనుమానించారు. అతడిని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. 2018 ఆగస్టులో జైలుకెళ్లి వచ్చిన తర్వాత 4 హత్యలు చేసినట్లు చెప్పాడు. మిడ్జిల్‌, భూత్పూర్‌, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ఘోరాలు జరిగాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో టీఎస్‌ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ ఎముకల గూడు బయటపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కొత్తవాగు సహా ఇతర ప్రాంతాల నుంచి ఆ ఇసుకను డంప్‌ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ హత్య కూడా శ్రీను పనేనని పోలీసులు గుర్తించారు. 2007లో శ్రీను తన సొంత తమ్ముడిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. పరివర్తన కింద అప్పీలు చేసుకుని.. మూడేళ్లలో బయటకు వచ్చాడు. తర్వాత పలు కేసుల్లో జైలుకు వెళ్లాడు. మళ్లీ బయటకు వచ్చిన తరువాత మిగతా హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా షాద్‌నగర్‌, శంషాబాద్‌ పరిధితో పాటు మిగతా ప్రాంతాల్లో మహిళలను అంతమొందించినట్లు సమాచారం. 2018 నుంచి నమోదైన కేసులు 4, పాతవి 14 కేసులు కలిపి ఇతనిపై 18 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 హత్యలు ఉన్నాయి. మరొకటి కస్టడీ నుంచి తప్పించుకున్నది కావడం గమనార్హం.

కల్లు దుకాణాల వద్ద మహిళలే లక్ష్యం
నిందితుడు శ్రీను కల్లు దుకాణాల వద్దకు వెళ్లి ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. ఈ క్రమంలో ఈనెల 16న మహబూబ్‌నగర్‌లోని ఓ కల్లు దుకాణానికి వెళ్లి, అక్కడ నవాబుపేట మండలం కూచూర్‌కి చెందిన అలివేెలమ్మతో మాటలు కలిపాడు. దేవరకద్ర ప్రాంతంలో ఒకరు తనకు రూ.20 వేలు ఇవ్వాల్సి ఉందని, ఇప్పిస్తే రూ.4 వేలు ఇస్తానని ఆశ చూపాడు. నమ్మి ఆమె అతని వెంట ద్విచక్రవాహనంపై వెళ్లింది. మార్గంమధ్యలో ఇద్దరూ మద్యం తాగారు. దేవరకద్ర మండలం డోకూర్‌ సమీపంలోకి వెళ్లాక మత్తులో ఉన్న అలివేలమ్మ ఛాతీపై బలంగా కొట్టి, తలను నేలకేసి బాది చంపేశాడు. ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చెవి కమ్మలు, కాలి పట్టీలు ఎత్తుకెళ్లాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనును అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. గతంలో మహబూబ్‌నగర్‌ గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలో వివిధ సందర్భాల్లో ఏడుగురు మహిళలను హత్య చేసి పోలీసులకు చిక్కాడు. ఇటీవల దేవరకద్ర మండలం డోకూరు దగ్గర హత్య కేసు తర్వాత మరోమారు పోలీసులకు పట్టుబడ్డాడు. తరచూ నేరాలకు పాల్పడి జైలుకు వస్తున్న ఇతనిలో మార్పు తెచ్చేందుకు జైళ్లశాఖ తమ ఆధ్వర్యంలో నడుపుతున్న పెట్రోల్‌ బంకులో ఉపాధి కల్పించింది. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో తొలగించింది. మళ్లీ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి బంకులో పనికి కుదిరాడు. ఈ నేపథ్యంలో శ్రీను హత్యలు చేసిన విషయం తెలిసి జైలు అధికారులు అవాక్కయ్యారు.

ఏమీ తెలియనట్లు నటన
నిందితుడు శ్రీనును పోలీసులు అరెస్టు చేసినరోజు రాత్రి అతను మహబూబ్‌నగర్‌ జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసినట్లు సమాచారం. తాను జైలు నుంచి బయటకు వచ్చి పరివర్తనతో బతుకుతున్నానని.. అయినా తనను విడిచిపెట్టరా అని ఫోన్‌లో వాదించినట్లు తెలుస్తోంది. ఓ రాత్రంతా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. నిందితుడి నటనను చూసి పోలీసులే విస్తుబోయారు.

నిందితుడిపై పీడీ చట్టం: ఎస్పీ
మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ రెమా రాజేశ్వరి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనుపై పీడీ చట్టం నమోదు చేస్తామని తెలిపారు. హంతకుడికి సహకరించిన అతని భార్య సాలమ్మనూ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే.. వెంటనే 100 నంబరుకు డయల్‌ చేయాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. నిందితుడి నుంచి ఒకటిన్నర తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Courtesy Eenadu