హైదరాబాద్‌ సిటీ : ప్రఖ్యాత పాత్రికేయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌, ప్రజాస్వామికవాది పొత్తూరి వెంకటేశ్వరరావు (86) ఇకలేరు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి సత్యవాణి(79), కుమార్తెలు అనసూయా వాత్సల్య, డాక్టర్‌ పద్మజ, కుమారులు ప్రేమ్‌గోపాల కృష్ణ, రహి ప్రకాశ్‌  ఉన్నారు. పొత్తూరి.. 1934, ఫిబ్రవరి 8న ఏపీలోని గుంటూరు జిల్లా, పొత్తూరులో పుట్టారు. ‘ఆంధ్రజ్యోతి’ వ్యవస్థాపక ఎడిటర్‌ నార్ల వెంకటేశ్వరరావు రచనల ప్రేరణతో, 1957లో ఆంధ్రజనత పత్రిక ద్వారా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు.

ఐదు దశాబ్దాలపాటు పత్రికారంగానికి విశేష సేవలందించారు. ఈ క్రమంలో ఆంధ్రభూమిలో సహాయ సంపాదకుడిగా, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో ఎడిటర్‌గా పనిచేశారు. కొంతకాలం ఆకాశవాణిలోనూ కొనసాగారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలకు గౌరవ సంపాదకత్వం వహించారు. 1999-2003 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించారు. పారమార్థిక పదకోశం,  నాటి పత్రికలు-మేటి విలువలు, వ్యాసప్రభ, చింతన, చిరస్మరణీయులు కాశీనాథుని నాగేశ్వరరావు జీవిత చరిత్ర, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జీవిత చరిత్ర తదితర పుస్తకాలు రచించారు.

ఆయన పరిశోధనా గ్రంథం ‘ఆంధ్రజాతి అక్షరసంపద – తెలుగు పత్రికలు’ తెలుగు పత్రికారంగ చరిత్ర రచనల్లో ఉత్కృష్టమైనదని విమర్శకుల మన్ననలను పొందింది. పాత్రికేయ రంగంలో పొత్తూరి సేవలకుగాను తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. పొత్తూరి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా తెలుగు పత్రికా రంగానికి, సాహిత్యాభివృద్ధికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

పొత్తూరి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన నైతిక మద్దతు అందించారని గుర్తుచేసుకున్నారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తుల్లో ఒకరిగా పొత్తూరి నిలిచిపోతారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌. రమణ, పలువురు మంత్రులు, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

సాయంత్రం 5గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పొత్తూరి అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు.. మంత్రి తలసాని, తెలంగాణ సీఎంవో సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, విద్యావేత్త చుక్కా రామయ్య, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ కె. శ్రీనివాస రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, విరాహత్‌ అలీ తదితరులు పొత్తూరి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కె.శ్రీనివాస్‌,  ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మానవహక్కుల వాదిగా..
జిల్లెళ్లమూడి అమ్మ భక్తుడిగా, ఆధ్యాత్మిక చింతన కలిగిన పొత్తూరి వెంకటేశ్వరరావు మానవహక్కుల పరిరక్షణ కోసం గళమెత్తిన సందర్భాలెన్నో! ఆయుధఽ ధారులై అడవిబాట పట్టిన నక్సలైట్లు, జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో కన్సర్డ్న్‌ సిటిజన్‌ కమిటీ సభ్యుడిగా రెండుసార్లు పొత్తూరి చూపిన చొరవ ప్రత్యేకమైంది. అందుకు అప్పటి ము ఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎ్‌సలను శాంతి చర్చలకు ఒప్పించడంతో పాటు నక్సలైట్లతోనూ ఆయన మాట్లాడారు.

ఒక సందర్భంలో తనకు గుండె ఆపరేషన్‌ జరిగిన నెలలోపే నక్సలైట్లతో సంభాషించేందుకు నల్లమల అడవికి వెళ్లారు. ఆ సమయంలోనూ ఆయన ఆధ్యాత్మిక ధ్యానాన్ని విస్మరించలేదని అప్పటి కన్సర్డ్న్‌ సిటిజన్‌ కమిటీ ప్రతినిధి ప్రభాకర్‌ చెప్పారు. మానవహక్కుల పరిరక్షణకై కన్నాభిరాన్‌, ఆచార్య హరగోపాల్‌ వంటి ఉద్యమనేతలతో కలిసి పలు సందర్భాలలో వేదిక పంచుకున్నారు. తొలినాళ్లలో విశాలాంధ్రవాది అయిన పొత్తూరి వెంకటేశ్వరరావు అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు.

విరసం నేత వరవరరావు వంటి మేధావుల నిర్బంధాన్ని బాహాటంగా వ్యతిరేకించారు. పొత్తూరి వయోభారంతోనూ పలు సభల్లో పాల్గొని మేధావుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎన్‌కౌంటర్లు లేని సమాజాన్ని ఆయన కాంక్షించారు. అందుకే ప్రజాస్వామిక వాదులంతా పొత్తూరిని మానవతావాదిగా అభిమానిస్తారు.

Courtesy Andhrajyothi