హైదరాబాద్‌: జీతాల కోత విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌తో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మోహన్‌నారాయణ, ఎస్‌.నర్సరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెన్షనర్‌లకు రావాల్సిన నెల వారీ పెన్షన్‌లలో కోతతో కుటుంబ పోషణ, అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు భరించలేకపోతున్నార న్నారు. కనీసం జూన్‌ నెల నుంచైనా ఉద్యోగులకు పూర్తి వేతనాన్ని, పెన్షనర్లకు పూర్తి పెన్షన్‌లు ఇవ్వాలని వారు కోరారు.

పెన్షన్‌ కోత ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధం
రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి

పెన్షన్‌ చెల్లింపులో కోత పెడుతూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి అభిప్రాయపడింది. గురువారం జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కితీసుకొని జూన్‌ నెల నుంచి పూర్తి పెన్షన్‌ను చెల్లించాలని ఈ సమావేశంలో డిమాండ్‌ చేశారు. మూడు నెలలుగా చెల్లించకుండా పక్కనపెట్టిన పెన్షన్‌ను కూడా విడుదల చేయాలని కోరారు.

Courtesy Andhrajyothy