– లాక్‌డౌన్‌లో ఆసరా కరువు..వృద్ధాశ్రమాల్లో నిధుల లేమి
– ఉన్న కొద్దిపాటి మొత్తంతోనే నిర్వహణ ఖర్చులు
– వైరస్‌ వ్యాప్తితో మరింత ఆందోళన

మనిషి జీవిత చక్రంలో వృద్ధాప్యం చివరి దశ. జీవితాంతం కష్టపడి వృద్ధాప్యంలో కుటుంబసభ్యుల మధ్య సంతోషంగా గడపాలనుకుంటారు. ఉమ్మడి కుటుంబవ్యవస్థ నుంచి అపార్ట్‌మెంట్‌ కల్చర్‌లోకి వచ్చాక చరమాంకంలో పడ్డ ఆ పండుటాకుల జీవితం దుర్భరంగా మారుతున్నది. చివరి దశలో ఉన్న తల్లిదండ్రులను కొద్దిమంది పోషణ చేస్తుంటే..ఎక్కువమంది బిడ్డలు వారిని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఏ దిక్కూలేక.. ఆశ్రమాల్లో తలదాచుకుంటుంటే.. ఇప్పుడు కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. కోవిడ్‌..19 వైరస్‌ కట్టడి పేరుతో విధించిన లాక్‌డౌన్‌ సెగ వృద్ధాశ్రమాలను తాకింది. వారి ఆలనాపాలనా చూసే ఆశ్రమాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. లాక్‌డౌన్‌ దెబ్బతో.. దాతలు సైతం వెనకడుగు వేస్తుంటే.. వృద్ధులకు మంచి ఆహారం అందించాల్సిన ఈ సమయంలో వారి రేషన్‌లో కోతపడుతున్నది. నిత్యావసరాల బడ్జెట్‌ను కుదించి వచ్చిన దాంట్లో సరిపెడుతున్నారు… దేశంలోని ఉన్న ఆశ్రమాల్లో పరిస్థితి ఏమిటంటే..

న్యూఢిల్లీ : కన్నబిడ్డల ఆదరణ, ఆప్యాయతలకు దూరమై.. బిక్కుబిక్కుమంటూ వద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న వృద్ధు లకు లాక్‌డౌన్‌ మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నది. దేశవ్యాప్త మూసివేతతో వ్యాపార లావాదేవీలు ఏవీ జరగక పోవడం, దాదాపు అన్నిరంగాలు నష్టాల్లో కూరుకుపోవడంతో వృద్ధాశ్రమా లకు విరాళాల సమస్య ఉత్పన్నమవుతున్నది. నిధులలేమితో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు వృద్ధాశ్రమాలు మూతపడే దశకు చేరగా… మరికొన్ని దుర్భర పరిస్థితుల్లో నెట్టుకొస్తు న్నాయి. నిధుల లేమి కారణంగా ఓల్డ్‌ ఏజ్‌ హౌమ్‌లలో అత్య వసరాల మీద వెచ్చించే బడ్జెట్‌ను కత్తిరించి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికి అండగా నిలిచే స్వచ్ఛంద సంస్థలకు విరాళాల రాక అంతంతమాత్రంగానే ఉండటంతో.. అవి కూడా సాయం చేయలేని దుస్థితి ఏర్పడింది.

చిన్న, మధ్య తరహా వృద్ధాశ్రమాలకు స్థానికంగా ఉండే వ్యాపారస్తులు, వేతన జీవులు, సమాజంలో ఎంతోకొంత పలుకుబడి, పేరు ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి వచ్చే విరాళాలే ఆధారం. ఈ నిధుల ద్వారానే అందులో ఉన్నవారికి నిత్యావసరాలు, మందులు వంటివి సమకూర్చుతారు. కానీ కరోనాను కట్టడిచేసే పేరుతో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌, ఆర్థిక మందగమనంతో నాలుగు నెలలుగా వ్యాపార కార్యకలాపాలేవీ సజావుగా సాగడం లేదు. దీంతో విరాళాలివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా వృద్ధాశ్రమాలను బలవంతంగా మూసివేయాల్సి వస్తుందని హెల్ప్‌ ఏజ్‌ ఇండియా సీఈఓ ఎం. చెరియన్‌ అన్నారు. ప్రత్యేకంగా వృద్ధుల కోసమే పని చేస్తున్న ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 1,500 వృద్ధాశ్రమాలు ఉండగా.. అందులో సుమారు 70 వేలకు పైగా వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వారి సాయంతో నడుస్తున్న ఒక వృద్ధాశ్రమంలో నిత్యావసరాల బడ్జెట్‌ను 30శాతానికి తగ్గించారు. కొంతకాలంగా ఆ సంస్థకు నిధుల కొరత ఏర్పడింది. దాంతో అక్కడుంటున్న వారికి రేషన్‌, ఇతర సదుపాయాల్లో కోత విధించినట్టు ఆ సంస్థ సూపర్‌వైజర్‌ రోహిత్‌ కుమార్‌ తెలిపారు. తమ దగ్గర పని చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదనీ, కానీ వృద్ధుల కష్టాలు చూసి ఉద్యోగులెవ్వరూ పనులు మానకుండా వారికి సేవ చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలోని చతర్పూర్లో ఉంటున్న ఓల్డ్‌ ఏజ్‌ హౌస్‌ లో దాదాపు 60 మంది ముసలివాళ్ళు తలదాచుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తమకు వచ్చే విరాళాలు 50 నుంచి 60 శాతం మేర తగ్గాయని దాని నిర్వాహకులు తెలిపారు. ఉన్న కొద్దిపాటి మొత్తం భవనం నిర్వహణకే సరిపోతుందని అన్నారు.

పౌష్టికాహారం కొరత
వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువుండటం తో వారిని బయటకు రావొద్దనీ, ఇమ్మ్యూనిటీ పెంచుకునేందుకు బలవర్ధక ఆహారం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ వృద్ధాశ్రమాల్లో నిధుల కటకట కారణంగా సాధారణ ఆహారాన్ని అందించడమే గగనమవుతున్న వేళ.. పౌష్టికాహారం ఎలా అందివ్వగలమని వాటిని నడిపే నిర్వాహకులు చెబుతున్నారు. అంతేగాక వృద్ధాశ్రమాలలో ఉంటున్న వారే అక్కడి పనులు చేసుకుంటున్నారనీ, బయటవాళ్ళ ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కష్టమైనా వారే కష్టపడుతున్నారని అంటున్నారు. ఒకవేళ వారికి జరగరానిదేమైనా జరిగితే దాని నుంచి వాళ్ళు కోలుకోవడం కష్టం తో కూడిన వ్యవహారమని ఢిల్లీలో ఒక ఓల్డ్‌ ఏజ్‌ హౌమ్‌ ను నిర్వహిస్తున్న సిస్టర్‌ అన్సీ జాన్సన్‌ అన్నారు. ప్రభుత్వమే మానవతా దక్పథం తో వ్యవహరించి వృద్ధులను ఆదుకోవాలని వృద్ధాశ్రమాల నిర్వాహకులు కోరుతున్నారు.

ఒక అంచనా ప్రకారం.. దేశంలో 12 కోట్ల మంది వృద్ధులు ఉండగా, వీరిలో 5 కోట్ల మంది తీవ్ర పేదరికం లో దుర్భర పరిస్థులు అనుభవిస్తున్నారు. 2020 జూన్‌ లో నిర్వహించిన ఒక సర్వే మేరకు.. లాక్‌డౌన్‌లో 55శాతం మంది వద్ధుల ఆరోగ్యం క్షీణించింది. దాదాపు 75శాతం మంది వైద్యులను సంప్రదించలేదని చెప్పుకున్నారు. 44శాతం మంది క్రమం తప్పకుండా వేసుకునే మందులు కూడా తీసుకోలేదు.

Courtesy Nava Telangana