అడ్వకేట్‌ కమిషన్‌గా పవన్‌కుమార్‌ : హైకోర్టు

హైదరాబాద్‌ : కరోనా కట్టడి కోసం సర్కార్‌ లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడికక్కడ వలస కార్మికులు చిక్కుకుపోయారనీ, వారిని సొంత రాష్ట్రాలకు పంపే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందనీ హైకోర్టు గుర్తు చేసింది. సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్లే వలస కార్మికుల గురించి వాస్తవ నివేదిక కోసం లాయర్‌ కె పవన్‌కుమార్‌ను అడ్వకేట్‌ కమిషన్‌గా నియమిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. నిత్యం మేడ్చల్‌ రోడ్డులో ఐదారు వందల మంది నడిచి వెళ్తున్నారని పిటిషనర్‌ తరపు లాయర్‌ చెబుతున్నారని, అయితే వలస కార్మికుల కోసం రెండొందల రైళ్లను నడిపామని, ఇప్పుడు బస్సులూ జిల్లాల్లో నడుస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నదని, ఈ ద్వంద్వ వాదనలో నిజం తేల్చేందుకు అడ్వకేట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది.

పవన్‌కుమార్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. కమిషన్‌, రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రెటరీని వెంట తీసుకుని వలస కార్మికుల గురించి తెలుసుకుని వచ్చే నెల 1 నాటికి నివేదిక ఇవ్వాలని కోరింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దుల్లో వదిలేస్తున్నారని, రోజూ మేడ్చల్‌ రోడ్డులో మండుటెండలో ఎంతోమంది నడిచివెళతున్నారని, వారికి న్యాయం చేయాలని కోరుతూ రిటైర్డు ప్రొఫెసర్‌ రమా శంకర్‌ నారాయణ మేల్కొటి వేసిన పిల్‌లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. విచారణ వచ్చేనెల 2కి వాయిదా పడింది.

వికలాంగుల సంక్షేమానికి రూ.10 కోట్లు
లారుడౌన్‌లో వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.పది కోట్లు కేటాయించినట్లు హైకోర్టుకు తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డిల నేతత్వంలోని డివిజన్‌ బెంచ్‌కు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం రూ.పది కోట్ల కేటాయింపు విషయాన్ని వెల్లడించారు. వికలాంగులకు సాయం చేసే వారికి ప్రత్యేక పాస్‌లు ఇవ్వాలని, లాక్‌డౌన్‌లో వారు కష్టాలుపడుతున్నారని, వారిని ఆదుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కె గణేష్‌ దాఖలు చేసిన పిల్‌లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం పూర్తి నివేదిక అందజేయాలని కోరిన హైకోర్టు విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసింది.

Courtesy Nava Telangana