-ఎల్‌జి పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు ఆదేశాలు

అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థను సీజ్‌ చేసి ఉంచాలని, సీజ్‌ చేసిన తర్వాత ఆ కంపెనీ ప్రాంగణం మొత్తాన్ని అధికారుల ఆధీనంలో ఉంచుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులను ఇటీవల వెలువరించింది. కంపెనీ లోనికి ఎవరినీ అనుమతించరాదని, ఒకవేళ ఎవరైనా వెళ్లాలంటే హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి వుంటుందని నిర్దేశించింది. ఈ ఘటనపై ఒకవేళ దర్యాప్తు కమిటీల ప్రతినిధులు వెళ్లాల్సివచ్చినప్పుడు ఎందుకు తనిఖీ చేస్తున్నారో, ఎవరు తనిఖీ చేస్తున్నారో అక్కడి మెయిన్‌ గేట్‌ వద్ద రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ కంపెనీకి చెందిన స్థిర, చరాస్తులను తరలించరాదని కూడా నిర్దేశించింది. అలాగే కంపెనీ డైరెక్టర్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్ట్‌లను కోర్టు అనుమతి లేకుండా తిరిగి వాళ్లకు ఇవ్వకూడదని, కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లకూడదని ఉన్నత న్యాయస్థానం షరతులు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

26లోగా అఫిడవిట్‌ సమర్పించాలి..
గ్యాస్‌ లీక్‌ ఘటన తర్వాత పరిశ్రమలో మిగిలిన స్టైరిన్‌ను ఎవరి అనుమతితో వెనక్కి తీసుకెళ్లారో, లాక్‌డౌన్‌ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారో, అనుమతి లేకుండా కంపెనీ ప్రారంభించి ఉంటే ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు.. వంటి పూర్తి సమాచారంతో ఈ నెల 26 నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆ కంపెనీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. స్టైరిన్‌ను దక్షిణ కొరియాకు తరలించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ఆదేశించింది. ఈ నెల 7 ఎల్జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇదే తరహాలో దాఖలైన రెండు పిల్స్‌ను కూడా కలిపి విచారించిన హైకోర్టు ఈ కీలక మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కెమికల్‌ యాక్ట్‌ రూల్స్‌ 1989 ప్రకారం సదరు కంపెనీ అక్కడి ప్రజలకు అవగాహన కల్పించలేదని ఆక్షేపించింది. ప్రమాద ఘటన జరిగినప్పుడు సైర న్‌, అలారం మోగలేదని గుర్తించింది.

కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే ఆ కంపెనీ పనిచేస్తోందని తప్పుపట్టింది. విషపరమైన గ్యాస్‌ లీక్‌ చేసే కంపెనీ నివాస ప్రాంతాల మధ్యలో ఉందని, పైగా ఆ కంపెనీలో స్టోరేజీ ట్యాంక్‌ సరిగ్గా తనిఖీ చేయలేదని, కూలింగ్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదని పేర్కొంది. అయితే ఈ విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కౌంటర్‌ పిటిషన్లల్లో పేర్కొనలేదని, దీనిపై వివరాలిచ్చేందుకు సమయం కావాలని కోరాయని చెప్పింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

Courtesy Nava Telangana