తలసరి ఆదాయం మునుపటికన్నా ఎక్కువైంది అంటారు. గతంలో 7 వేలు ఉన్నది, ఇప్పుడు 10 వేలు అయింది అంటారు. దేశంలో అందరి సంపాదననూ కలిపి, దేశ జనాభాతో భాగించి, తలకి, ఒక మనిషికి, ఇంత ఆదాయం అని ప్రకటిస్తారు. అంటే, నెలకి కొన్ని లక్షలు జీతంగా తీసుకునే పెట్టుబడి దారుడూ, పూటగడవని వ్యవసాయ కూలీ ఇద్దరికీ ఒకటే ఆదాయం అన్న మాట. అదేమంటే, అందరి తోటి, అందరి అభివృద్ధికీ తోడ్పడి, అందరి విశ్వాసాన్నీ’’ చూరగొనడమే మా లక్ష్యం అంటారు. (నిజానికి, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, ఔర్ సబ్కా విశ్వాస్’ అనే నినాదం ఉత్త ‘బక్వాస్’, శుష్క నినాదం! దేశంలో పెరిగిపోతున్న అసమానతలూ, వివక్షా చూస్తే అర్ధం అయిపోతుంది, ఇది ఎంత బూటకమో!).

కేంద్ర ప్రభుత్వం, త్వరలో బడ్జెట్‌ని ప్రవేశ పెట్ట బోతోంది. బడ్జెట్ అనే దాని స్వభావాన్ని శ్రామిక వర్గ దృక్పధంతో చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం.

ఏ సంవత్సరపు బడ్జెట్ అయినా, అది, ఆ సంవత్సరంలో ప్రభుత్వానికి అందే ఆదాయం (డబ్బు) ఎంతో, ఆ ఆదాయాన్ని ప్రభుత్వం, ఎలా ఖర్చు పెట్టబోతోందో, ఆ జమా ఖర్చుల రాతల్ని ప్రకటించేదే. అసలు, ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? ప్రెసిడెంటూ, ప్రధాన మంత్రీ, ఇతర మంత్రులూ వంటి మహామహులు, ఆ డబ్బుని సృష్టిస్తారా? అసలు, ‘డబ్బు’ అంటే ఏమిటో తెలిస్తే, దాన్ని ఎవరు సృష్టిస్తారో అతి తేలిగ్గా తెలిసి పోతుంది.

డబ్బు’ అంటే ‘శ్రమ’! ‘ఒక రూపాయి’ అంటే, తక్కువ శ్రమా; 100 రూపాయలు అంటే, ఎక్కువ శ్రమా. దేశంలో ఉన్న కోట్ల, కోట్ల జనం, అనేక రకాల శ్రమలతో, జీవించడానికి అవసరమైన అనేక రకాల ఉత్పత్తుల్నీ; ఉత్పత్తుల రూపంలో ఉండని రవాణా, విద్యా, వైద్యం వంటి సౌకర్యాల్ని ఇచ్చే శ్రమల్నీచేస్తారు. శ్రమల విలువల్ని కొలిచి చూపించే సాధనమే డబ్బు.

బడ్జెట్ గురించి తెలియాలంటే, ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందో మొదట తెలియాలి. అది, ప్రెసిడెంటుగారి, ప్రధాన మంత్రి గారి, ఇతర మంత్రుల గార్ల శ్రమలు కాదు. అసలు, వారి చర్యలు, శ్రమల’ కిందకి రావు. ఆ చర్యలు, వస్తువుల వంటి ఉత్పత్తుల్ని గానీ, ఉత్పత్తులు కాని సౌకర్యాల్ని గానీ, చేసేవి కావు. ప్రభుత్వానికి ఆదాయంగా డబ్బుని ఇచ్చే అసలైన మార్గం ఏమిటో ప్రజలకు తెలియాలి. ఇది తెలిస్తేనే, బడ్జెట్‌కి ఉన్న అసలు స్వభావం తెలుస్తుంది.

ప్రభుత్వానికి వచ్చే డబ్బుకి మార్గం ‘పన్నులే’. ఆ పన్నులకు మార్గాలు, ప్రైవేటు పరిశ్రమలూ, ప్రభుత్వపరిశ్రమలూ, కూడా. శ్రామిక వర్గంలో, పైస్థాయి మేధాశ్రమలు చేసే శ్రామికులు కట్టే పన్నులు కూడా. పరిశ్రమదారులు, పన్నుల్ని ఎక్కణ్ణుంచి తెచ్చి కడతారు? దేశంలో, శ్రామికులందరూ చేసిన మొత్తం ఉత్పత్తుల రాశినీ, ఉత్పత్తులు కాని సదుపాయల రాశినీ, కలిపి చూస్తే, మొత్తం ఒక సంవత్సరంలో ఆ ‘రాశి’ తయారీకి అవసరమైన శ్రమ కాలం, 100 గంటలు అనుకుందాం. నిజానికి, అది కోట్ల గంటల శ్రమ. కానీ, ఉదాహరణలో లెక్కలు ఎప్పుడూ చిన్నవిగా ఉండాలి. దేశంలో శ్రామికులందరూ, ఒక సంవత్సరంలో, 100 గంటల శ్రమలు చేశారనుకుందాం. ఆ శ్రమలు జరగడానికి, ఉత్పత్తి సాధనాలు కూడా ఖర్చవుతాయి. ఆ ఉత్పత్తి సాధనాలు తయారు కావడానికి పట్టిన శ్రమలు కూడా ఉత్పత్తుల విలువలోకి చేరతాయి. అయినా ఇక్కడ ఉదాహరణ తేలిగ్గా ఉండడం కోసం, ఈ సంవత్సరంలో జరిగిన కొత్త శ్రమల్ని మాత్రమే తీసుకుందాం. ఈ కొత్త శ్రమే 100 గంటల శ్రమ. ఈ ‘శ్రమ విలువ’ ని డబ్బు రూపంలో చూస్తే, 100 రూపాయలు అనుకుందాం. అంటే, ఈ సంవత్సరంలో, శ్రామిక వర్గం 100 రూపాయల శ్రమ చేసిందని అర్ధం. వారికి జీతాలుగా, ఆ 100 రూపాయలు, వారికే అందుతాయా? ఆలా జరగదు. శ్రామికుల శ్రమ విలువ అంతా శ్రామికులకు అందితే, శ్రమలు చెయ్యని యజమాని వర్గం, ఎలా బ్రతుకుతుంది? శ్రమలు చెయ్యకుండా బ్రతకాలంటే, ఇతరుల శ్రమలో భాగాన్నే తీసుకోవాలి. అది, ‘శ్రమ దొపిడీ’. అదే జరగాలి. శ్రామిక వర్గం చేసిన 100 శ్రమలోనించి వారికి జీతాల మొత్తంగా 20 మాత్రమే అందుతుందనీ, మిగిలిన 80 విలువ యజమాని వర్గానికే పోతుందనీ అనుకుందాం. ఈ 80 కూడా శ్రామిక వర్గ శ్రమే. ఇది, జీతాల కన్నా ఉన్న ‘అదనపు శ్రమ’. ఇదే, ‘అదనపు విలువ’.

100 విలువ గల శ్రమలు చేసిన శ్రామిక జనం, బీదతనంలో ఉంటారు. ఈ జనంలో, పైస్థాయి శ్రమలు చేసే కార్మికులు ఎక్కువ జీతాలే అందుకుంటారు. ఆయినా, వీరు కూడా కొంత ‘అదనపు విలువ’ని పోగొట్టుకుంటారు. ఇదంతా, సమాజంలో యజమాని వర్గానికి తెలీదు. తెలిసినా, ఈ వర్గం దోపిడీని వదలాలనుకోదు. శ్రామిక వర్గానికి అసలే తెలీదు. తెలియజేస్తే, మారాలని ప్రయత్నిస్తుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం శ్రామిక వర్గ ‘అదనపు విలువ’లో కొంత భాగమే. ఇక, ప్రభుత్వం, తన ఆదాయంలో నించి పెట్టే ఖర్చులు ఏమిటి? దాని దోపిడీ పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన పోలీసూ, సైన్యం, కోర్టులూ, జైళ్లూ, అసెంబ్లీలూ, పార్లమెంటూ, సెక్రెటేరియేట్, కలెక్టరేట్— ఇటువంటి వాటిమీద పెట్టె ఖర్చులు, దోపిడీ పరిపాలనా ఖర్చులే. మార్క్సు 1852 నాటి ఒక రచనలో చెప్పినట్టు: ‘‘అధికార యంత్రాంగానికీ, సైన్యానికీ, మతగురువులకీ, కోర్టులకీ, క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వ కార్య నిర్వాహక యంత్రాంగానికంతటికీ పన్నులే జీవనాధారం!’’.

ప్రభుత్వం ప్రతీ సంవత్సరమూ తన బడ్జెట్‌ని, ‘పేదల బడ్జెట్’ వంటి వర్ణనలతో ముంచెత్తుతుంది. చిత్రం ఏమిటంటే, ఒక సంవత్సరంలో ‘పేదల బడ్జెట్’ వచ్చినా, 10 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, పేదలు ఎప్పటిలాగే ఉంటారు. మరింత పేదలవుతారు కూడా. ధనికుల బడ్జెట్‌కి, పేదలు ఉండటమే అవసరం. ఎందుకంటే, వాళ్ళు అన్ని రకాల శ్రమలూ చేస్తారు. వాళ్ళ శ్రమల నించీ, అదనపు విలువ వస్తుంది. దాంట్లోంచే యజమానులు పన్నులు కడతారు. తమ శ్రమలో భాగమే, పన్నులుగా వెళ్తుందని శ్రామికులకు తెలీదు.

వర్గ చైతన్యం లేని శ్రామిక జనాలను భ్రమల్లో ముంచి ఉంచడానికి, మౌలిక పరిష్కారాల నుంచిదృష్టి మరల్చి, ప్రభుత్వాలు బడ్జెట్ లో రకరకాల పాత, కొత్త, సంక్షేమ పథకాలు ప్రకటిస్తాయి. రైతు రుణాల మాఫీ, పంటల బీమా, రైతులకు పించనూ, వ్యవసాయ సరుకులకు సబ్సిడీలూ, మధ్యాహ్న భోజన పధకం, ప్రైవేటు కాలేజీలకు కట్టిన ఫీజులు తిరిగి చెల్లించడం, పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యానికి ఖర్చు భరించడం, గ్యాసు సిలిండర్ పంపకం, వితంతువులకు పింఛను, నిరుద్యోగులకు నెలకి ఇంత అని ‘భృతి’, ఆడపిల్లల పెళ్ళికి ఖర్చులు ఇలా చేపలకి ఎరలు వేసినట్టు వేసి, ఓట్ల వలలో జనాల్ని పట్టేస్తారు. సంక్షేమ పథకాలలో ఖర్చు పెట్టేదంతా ఆయా సరుకులు తయారు చేయించి అమ్మే పెట్టుబడిదారుల జేబుల్లోకే వెళ్తుంది. శ్రమదోపిడీ రహస్యాన్ని చెప్పే మార్క్సు అదనపు విలువ సిద్ధాంతం, శ్రామిక ప్రజలకి తెలీదు కాబట్టి, వాళ్ళు పాలక వర్గ పార్టీల చేతుల్లో ఆటబొమ్మలుగా తయారవుతారు.

అతికొద్దిమందికి కూడా తాత్కాలిక ఉపశమనం కలిగించలేని, ఈ సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చు కన్నా, దేశరక్షణ పేరుతొ, లక్షల కోట్ల రూపాయలు ఆయుధ సామాగ్రికీ, యుద్ధ విమానాలకీ ఖర్చు చేస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఏ దేశంలో నైనా! ఈ లక్షల కోట్లు కూడా పన్నుల నించి వచ్చినవే! అంటే అదనపు విలువ నించీ వచ్చినవే.

పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ప్రభుత్వ బ్యాంకుల లోంచీ లక్షల కోట్లు అప్పులిచ్చి, వాటిని తీర్చనక్కరలేని అప్పులుగా ప్రకటిస్తుంది. దానికోసం బడ్జెట్ లోంచీ బ్యాంకులకు సాయం కూడా చేస్తుంది. ఈ సాయానికి ఉపయోగించే డబ్బు కూడా పన్నుల నించి వచ్చినదే.

బడ్జెట్ ప్రసంగంలో అనేక ఆర్ధిక అసత్యాలను ఆర్ధిక మంత్రులు చాల మార్మిక పదజాలంతో వల్లిస్తారు. దేశీయ స్థూల ఉత్పత్తి (జి. డి. పి. = ఒక సంవత్సర కాలంలో తయారైన ఉత్పత్తి విలువ డబ్బుగా) గురించీ, తలసరి ఆదాయం గురించీ, దారిద్ర్య రేఖకి దిగువున ఉన్న వారి గురించీ, అంకెలతో గారడీలు చేస్తారు. ‘‘జి. డి. పి లేదా వృద్ధిరేటు గతంలో ఇంత ఉండేది, మా హయాంలో ఇంత పెరిగింది, రాబోయే ఐదేళ్లలో మా పాలనలోనే మరింత పెరుగుతుంది’’ అని బడ్జెట్‌లో ప్రకటనలు గుప్పిస్తారు. దేశంలో కొంత కాలంలో తయారైన సరుకుల ఉత్పత్తి విలువ గతం కన్నా పెరిగినా, అది శ్రామిక జనాలకు అందుతుందా?

నిరుద్యోగ నిర్ములనే మా ధ్యేయం, దానికోసం బడ్జెట్‌లో వీలు కల్పించాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, అసలు నిరుద్యోగమే లేదు. కొత్త తరహా ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యం గల వారు లేరు. అందుకే నూతన సాంకేతికతకు తగిన నైపుణ్యాన్ని నేర్పే నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్ని (స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్) ఏర్పరుస్తున్నాం’’ అంటారు. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో సాంకేతికత అనేది, అది కృత్తిమ మేధస్సుతో ఉన్నదైనా, భారీ ఆటోమాటిక్ యంత్రాలతో ఉన్నదైనా ఉన్న ఉద్యోగాల్ని ఊడకొట్టేదే గానీ పెంచే ప్రసక్తే లేదు. కొత్త సాంకేతికత తయారయ్యే చోట వంద ఉద్యోగాలు ఏర్పడితే, ఆ సాంకేతికతను ఉపయోగించే పని స్థలాల్లో వెయ్యి ఉద్యోగాలు పోతాయి.

తలసరి ఆదాయం మునుపటికన్నా ఎక్కువైంది అంటారు. గతంలో 7 వేలు ఉన్నది, ఇప్పుడు 10 వేలు అయింది అంటారు. దేశంలో అందరి సంపాదననూ కలిపి, దేశ జనాభాతో భాగించి, తలకి, ఒక మనిషికి, ఇంత ఆదాయం అని ప్రకటిస్తారు. అంటే, నెలకి కొన్ని లక్షలు జీతంగా తీసుకునే పెట్టుబడి దారుడూ, పూటగడవని వ్యవసాయ కూలీ ఇద్దరికీ ఒకటే ఆదాయం అన్న మాట. అదేమంటే, అందరి తోటి, అందరి అభివృద్ధికీ తోడ్పడి, అందరి విశ్వాసాన్నీ’’ చూరగొనడమే మా లక్ష్యం అంటారు. (నిజానికి, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, ఔర్ సబ్కా విశ్వాస్’ అనే నినాదం ఉత్త ‘బక్వాస్’, శుష్క నినాదం! దేశంలో పెరిగిపోతున్న అసమానతలూ, వివక్షా చూస్తే అర్ధం అయిపోతుంది, ఇది ఎంత బూటకమో!).

మొత్తం మీద ఏ సంవత్సరంలో నైనా, రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ, ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, శ్రామిక వర్గ దృక్పధం ఉన్న వారు గమనించి, జనాల దృష్టికి తీసుకురావలిసిన విషయాలు రెండు: (1) ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా శ్రామిక వర్గం కొత్తగా సృష్టించే అదనపు విలువలో భాగమే. (2) శ్రామిక వర్గాన్ని తప్పుడు రాజకీయ చైతన్యంలోనే శాశ్వతంగా ఉంచడానికి మాత్రమే ప్రజా సంక్షేమ పధకాలు పనికివస్తాయి…అని!

రంగనాయకమ్మ
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)