అసోం, జార్ఖండ్‌లలో అత్యధికం : కేంద్రం

న్యూఢిల్లీ : మోడీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014-18 మధ్య దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 233 మందిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం అసోం నుంచి 37 కేసులు, జార్ఖండ్‌ నుంచి 37 కేసులున్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం.. 2018లో 70 మంది, 2017లో 51 మంది, 2016లో 35 మంది, 2015లో 30 మంది, 2014లో 47 మందిపై దేశద్రోహం కేసులు నమోదైనట్టు తెలిపారు. అలాగే అత్యధికంగా అసోం, జార్ఖండ్‌లలో 37 మంది చొప్పున ఈ కేసులు రికార్డయ్యాయని లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఆ తర్వాత హర్యానాలో 29 మందిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయని వివరించారు.

Courtesy Nava Telangana