– కొండూరి వీరయ్య

రెండో ప్రపంచ యుద్ధం నాటికి కాశ్మీర్‌ సరిహద్దులు చైనా, రష్యాకు చెందిన కజకిస్తాన్‌ల వరకు విస్తరించటంతో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. సోవియట్‌ నుంచి కమ్యూనిస్టులు సరిహద్దులు దాటి కాశ్మీర్‌ సంస్థానంలో ప్రవేశిస్తున్నారని, వారిని నిర్బంధించకపోతే కాశ్మీర్‌లోయ మొత్తం కమ్యూనిస్టుల వశమవుతుందన్న ఆందోళనతో అనేక చర్యలు తీసుకుంది. గిల్గిత్‌ ప్రాంతాన్ని రాజు నుంచి కౌలుకు తీసుకుంది. సైన్యాన్ని మొహరించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం జమ్మూ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 1938లో సాగించిన పోరాటాన్ని అణచివేయటానికి హరిసింగ్‌ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఎన్నికైన ప్రతినిధులతో పాటు వైద్యులు, న్యాయవాదులు, పత్రికా సంపాదకులు వంటి వారినందరినీ రౌడీషీటర్లుగా నమోదు చేసి జైల్లో నెట్టింది. ఇందుకు వ్యతిరేకంగా కాశ్మీర్‌లోయ ఏకం కావటంతో గత్యంతరం లేక ఖైదీలందరినీ విడిపించింది. ఈ సమయానికి రెండో ప్రపంచ యుద్ధ సమరశంఖం మోగింది. యుద్ధం నేపథ్యంలో ఉన్న కొద్దిపాటి వనరులు దారి మళ్లించటంతో జమ్మూ కాశ్మీర్‌ అంతటా ఆహార ధాన్యాల కొరత, వంట చెరకు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేడు మనం చూస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ తరహాలో ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసింది. గ్రామ గ్రామాన ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కమిటీలు ప్రజలకు కనీస అవసరాలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశాయి. గిడ్డంగుల్లో దాచి ఉంచిన ఆహారధాన్యాలు తెచ్చి ప్రజలకు పంచారు. రోజురోజుకూ పెరుగుతున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రజాదరణ గ్రహించిన హరిసింగ్‌ ప్రభుత్వం నేషనల్‌ కాశ్మీర్‌ ప్రజల ఉద్యమాన్ని, దానికి నాయకత్వం వహిస్తున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను అణచేయటానికి రాజకీయ విభాగాన్ని కోరింది. నాటి సంస్థానాల్లో రాజకీయ విభాగం అంటే బ్రిటిష్‌ ప్రభుత్వం తరపున వైస్రాయికి బంటుగా వ్యవహరించే విభాగమే. సంస్థానాల స్వతంత్రత నామకే వాస్తే. కీలకమైన రాజకీయ ఆర్థిక నిర్ణయాలన్నీ వైస్రాయి తరపున పనిచేసే రాజకీయ విభాగమే తీసుకుంటుంది. ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేయటానికి ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌ పని చేస్తున్న తరహాలో అన్న మాట.
రాజకీయ విభాగంలో ముగ్గురు కీలకమైన వ్యక్తులు. రెసిడెంట్‌ కమిషనర్‌ కల్నల్‌ వెల్‌, సైన్యాధిపతి బ్రిగేడియర్‌ స్కాట్‌, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పావెల్‌. ప్రధాని రామచంద్ర కక్‌. రామచంద్ర కక్‌ పేరుకి మహారాజు హరిసింగ్‌కి మంత్రి. ఆచరణలో పూర్తిగా వైస్రాయికి బంటుగా వ్యవహరించేవాడు. రాజకీయ విభాగం ఆదేశాల మేరకు వ్యవహరించేవాడు. ఈ నలుగురి లక్ష్యం ఒక్కటే. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను నామరూపాలు లేకుండా చేయటం. దీనికి భిన్నంగా అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ప్రజలు గుండెల్లో దాచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి కాశ్మీర్‌ లోయలోని అన్ని గ్రామాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కమిటీలే ఏర్పడ్డాయి. పోలీసు జులుం, నిత్యావసర వస్తువుల బ్లాక్‌ మార్కెట్‌ నియంత్రణ, లంచగొండితనం నిర్మూలన వంటి లక్ష్యాల చుట్టూ ప్రజలు సమీకృతులయ్యారు. మరోవైపున పట్టణ ప్రాంతాల్లో కార్మికవర్గంలో కూడా విస్తరించింది. ఈ సమయంలోనే వ్యవసాయ సంస్కరణల నినాదం ముందుకొచ్చింది.

1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి కాశ్మీర్‌ లోయలో విముక్తి ఉద్యమం మరింత బలోపేతం అయ్యింది. ఆ కాలంలోనే దేశవ్యాప్తంగా సాగుతున్న సమ్మెలు, పోరాటాల వార్తలతో కాశ్మీర్‌ రాజకీయ వాతావరణం వేడెక్కింది. హరిసింగ్‌ క్విట్‌ కాశ్మీర్‌ నినాదం గ్రామ గ్రామాన మారుమోగింది. అమర్‌సింగ్‌ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ పట్టు పరిశ్రమ కార్మికులు ఇలా అన్ని తరగతుల ప్రజానీకం ఉద్యమ స్రవంతిలో చేరిపోయింది. 1945 మే 15న హరిసింగ్‌ ప్రభుత్వం పని తీరుపై ప్రజాభిప్రాయ సేకరణకు షేక్‌ అబ్దుల్లా పిలుపునిచ్చాడు. మే 20న నెహ్రూను కలుసుకోవటానికి శ్రీనగర్‌ నుంచి బయలు దేరిన షేక్‌ అబ్దుల్లాను రాజకీయ విభాగం మార్గంమధ్యలో ఖైదు చేసింది. కాశ్మీర్‌ లోయంతటా మార్షల్‌ లా ప్రకటించింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకత్వంపై దాడులకు పూనుకుంది. ప్రభుత్వ అణచివేతను ప్రతిఘటిస్తూ కాశ్మీర్‌ లోయలో 20ప్రాంతాల్లో ప్రజలు సైన్యంతో తలపడ్డారు.
ఈ విధంగా మొదలైన ప్రజా ప్రతిఘటనను కొనసాగించటానికి కాశ్మీర్‌ ప్రజా యుద్ధ కమిటీ ఏర్పడింది. ఈ ప్రజాయుద్ధ కమిటీకి కార్మిక నాయకులే నాయకత్వం వహించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ శ్రీనగర్‌ విభాగం అధ్యక్షుడు గులాం మొహిద్దీన్‌ ఈ పోరాటంలో ప్రముఖపాత్ర వహించాడు. ఊరూవాడా పర్యటించి ‘హరిసింగ్‌ క్విట్‌ కాశ్మీర్‌’ నినాదాన్ని ఇంటింటి నినాదంగా మార్చాడు. కాశ్మీర్‌ ప్రజా యుద్ధ కమిటీ సభ్యులుకు కాశ్మీర్‌లోయలోని ప్రతి ఇల్లూ ఓ పెట్టని కోటగా మారి రక్షణ కల్పించాయి. ఈ ప్రజలేమీ గెరిల్లా యుద్ధ కళలో శిక్షణ పొందలేదు. పాలకవర్గం, దానికి కొమ్ము కాస్తున్న సైన్యం తమ శత్రువులుగా గుర్తించేంత సామర్ధ్యాన్ని జీవితం నేర్పింది. ఈ శత్రువులకు దొరక్కుండా ప్రజల్లో ఉండటమే ఉద్యమ పునాది అన్నది దాదాపు పదేళ్ల ఉద్యమ అనుభవం నేర్పిన పాఠం. ఈ పాఠం నుంచే కాశ్మీర్‌ ప్రజలు పాలకవర్గాన్ని, దాని వెన్నంటి ఉన్న సైన్యాన్ని, ఈ ఇరువురికీ దిశానిర్దేశం చేస్తున్న వలస పాలనను ఎదుర్కోవటానికి కావల్సిన పోరాట రూపాలు, మార్గాలు నేర్చుకున్నారు.
ఓవైపున సైనిక కవాతులు మరో వైపున క్విట్‌ కాశ్మీర్‌ నినాదాలతో ప్రజా ప్రదర్శనలు నిత్యకృత్యంగా మారాయి. నెహ్రూ విజ్ఞప్తిననుసరించి 1946 జూన్‌ 2 కాశ్మీర్‌ దినోత్సవాన్ని కాశ్మీరీయులు సంస్థానమంతటా జరుపుకున్నారు. సైనిక దాష్టీకాన్ని నిరసిస్తూ ఖాంఖాయి మౌలా మసీదు నుంచి భారీ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను అణచివేస్తూ పోలీసులు మరింత క్రౌర్యాన్ని ప్రదర్శించారు. శ్రీనగర్‌ మొత్తాన్ని జలియన్‌వాలాబాగ్‌ లా మార్చేశారు. కాశ్మీరీ పౌరులు గుంజీలు తీయటం, ఖైదీల్లాగా చేతులు పైకెత్తి నడవటం, పాముల్లా పొట్ట మీద పాకుతూ పోవటం నాటి ప్రజలకు దైనందిన అనుభవాలు. బలవంతంగా మహరాజ్‌కీ జై అని నినాదాలు ఇవ్వాలని సైన్యం పౌరులను బలవంత పెట్టేది. నిరాకరించిన పౌరులను జైళ్లపాలు చేయటం, అనుమానం వస్తే వందలాదిమందిని కాల్చివేయటం షరామామూలుగా మారింది. సామాజికంగా గుర్తింపు పొందిన వైద్యులు, న్యాయవాదులు కూడా తమ తలపాగాలతో రోడ్లు తుడిపించేవారు. ఈ స్థాయిలో అణచివేతను ఎదుర్కొంటున్నా జాతీయస్థాయి నాయకులు ఎవ్వరూ కాశ్మీర్‌ ప్రజలకు సంఘీభావంగా ఉద్యమించలేదు. దాంతో నాటి నుంచే దేశం వేరు, కాశ్మీర్‌ లోయ వేరు అన్న భావన ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. కొనసాగుతోంది. ఎట్టకేలకు నెహ్రూ శ్రీనగర్‌ పర్యటనకు సిద్ధమయ్యాడు. హరిసింగ్‌ ప్రభుత్వం సంస్థానంలో నెహ్రూ అడుగు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయినా నెహ్రూ ముందుకు సాగటంతో అరెస్టయ్యాడు. ఈ అరెస్టు పట్ల ఆగ్రహం చెందిన కాశ్మీరీ ప్రజలు నెహ్రూ విడుదల కోసం ఉద్యమించారు.
రెండో ప్రపంచ యద్ధానంతర వెల్లువలో భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కానీ దేశంపై తమ పెత్తనాన్ని పూర్తిగా వదులు కోవటానికి సిద్ధం కాని బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలోని సంస్థానాలకు పూర్తి స్వేఛ్చనిచ్చింది. చివరకు భారత నడిబొడ్డున ఉన్న సంస్థానాలు కూడా పాకిస్థాన్‌లో విలీనం కావాలని కోరుకుంటే విలీనం అయ్యేలా ఇచ్చిన స్వేఛ్చ ఇది. ఈ నేపథ్యంలో హరిసింగ్‌ ఊగిసలాట, స్వతంత్ర దేశంగా ఉండటానికి సాగించిన ప్రయత్నాలు జగద్వితమే. దీనికి భిన్నంగా కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాలన్న నినాదం మిన్నంటింది. 1946 మే 15న అరెస్టయిన షేక్‌ అబ్దుల్లా ఎట్టకేలకు స్వాతంత్య్రానంతరం 1947 సెప్టెంబరు 20 విడుదలయ్యాడు. అబ్దుల్లా జైల్లో ఉన్న 19 నెల్ల కాలం కాశ్మీరీ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో తూటాలా మారి హరిసింగ్‌ కబంధ హస్తాల నుంచి కాశ్మీర్‌ను విడిపించేందుకు సాగిన ఉద్యమ యాత్ర కొనసాగిస్తూ వచ్చారు. అంతటి పోరాట పటిమ ఉన్న ప్రజలు కనుకనే అటు బ్రిటిష్‌ నియంతృత్వాన్ని, ఇటు హరిసింగ్‌ ప్రభుత్వ నిర్బంధాన్ని ఢకొీట్టి నిలిచారు.

సెల్‌: 9871794037