* వేతన బకాయిలను చెల్లించాలి
* పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శికి సిఐటియు వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల తొలగింపును ఉపసంహరించుకోవాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్‌కు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముజఫర్‌ అహ్మద్‌ గురువారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది స్వీపర్లుగా 15 నుంచి 20 ఏళ్లుగా సేవలందిస్తున్నారని, రోజంతా పనిచేసినా ప్రాథమిక పాఠశాలల్లో రూ.రెండు వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.2,500, ఉన్నత పాఠశాలల్లో రూ.నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. 28 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, అప్పులు పుట్టక అవస్థలు పడుతున్నారని వివరించారు.
వెంటనే జోక్యం చేసుకుని వేతన బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల జీతాల నిధులను గత ఎన్నికలకు ముందు సెప్టెంబర్‌ నుంచి పిడి అకౌంట్‌కు ప్రభుత్వం తరలించుకెళ్లిందని, నేటికీ ఆ నిధులు తిరిగి ఇవ్వలేదని, దీన్ని పరిష్కరించడంలో సెర్ప్‌, పాఠశాల విద్యా శాఖలు సీరియస్‌గా తీసుకోకపోవడం విచారకరమని తెలిపారు. పార్ట్‌టైం అని పేరు పెట్టినా బెల్‌ కొట్టడం, బడి మానేసిన పిల్లలను బడికి తీసుకురావడం, పాఠశాల, మరుగుదొడ్లు శుభ్రపరచడం, రికార్డులను పై అధికారులకు అందించి రావడం వంటి పనులన్నీ చేస్తున్నారని వివరించారు. మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు అవసరమైన మెటీరియల్‌ సైతం కార్మికులే తమ సొంత డబ్బులతో కొని తెచ్చుకోవాల్సి వస్తోందని, కనీసం చీపుర్లు కూడా అందించడం లేదని తెలిపారు.
ఇన్ని రకాల అవస్థలు పడి పనిచేస్తున్న స్వీపర్లను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో 22 వేల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని అన్నారు. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొని అందరికీ పని భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రూ.18వేలు వేతనంగా చెల్లించాలని, మెటీరియల్‌, పనిముట్లు ప్రభుత్వమే సకాలంలో అందించాలని, జీతాలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు. ముఖ్య కార్యదర్శి స్పందించి సెర్ప్‌, ఆర్థిక శాఖ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. బకాయి వేతనాలు చెల్లించేందుకు నిధులు విడుదల చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇచ్చినట్లు సిఐటియు నాయకులకు ముఖ్య కార్యదర్శి తెలిపారు.

Courtesy Prajashakthi…