• బస్సులు ఇవ్వండి.. డ్రైవర్లనూ అప్పగించండి
  • ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై ప్రభుత్వం ఒత్తిడి
  • ఆర్టీఏ, పోలీస్‌ అధికారులతో చెప్పిస్తున్న సర్కారు
  • దసరా సెలవులు ముగిసేదాకా ఇవ్వాలంటూ హుకుం
  • లేదంటే ఇబ్బందులు తప్పవంటూ సందేశాలు

విద్యాసంస్థలకు దసరా సెలవులు కొనసాగేదాకా మీ బస్సులను ప్రభుత్వానికి ఇవ్వాలి. డ్రైవర్లను కూడా అప్పగించాలి. లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి’.. ఇవి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ఆర్టీఏ నుంచి, పోలీస్‌ అధికారుల నుంచి ఎదురవుతున్న హెచ్చరికలు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతుండటం, బస్సులు రోడ్డెక్కలేని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం.. విద్యాసంస్థల బస్సులపై పడింది. పాఠశాలలు, కళాశాలలకు తొలుత ఈ నెల 13 వరకు దసరా సెలవులు ఉండటంతో ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులను ప్రయాణికుల తరలింపునకు ఉపయోగిస్తూ వచ్చింది. ఆ సెలవులు ముగిసిపోయే దశకు రావడంతో.. ఏకంగా వారం రోజులపాటు (ఈ నెల 19 వరకు) సెలవులను పొడిగించింది. అప్పటిదాకా ఈ బస్సులను ఉపయోగించుకునేందుకు ఆర్టీఏ, పోలీస్‌ అధికారులను రంగంలోకి దించింది.

సర్కారు ఆదేశంతో వారు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఫోన్‌ చేసి.. హుకుం జారీ చేస్తున్నారు. స్కూళ్లు, కళాశాలలు ఉన్న కొందరు అధికార పార్టీ నేతలు.. తమ బస్సులను ఇచ్చేయడంతో వాటిని సాకుగా చూపించి, మిగిలిన యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎవరైనా మాట వినకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారని కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి కొందరు తమ బస్సులను, డ్రైవర్లను ప్రభుత్వానికి అప్పగించాలని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. ఆ భారాన్ని తమపై వేయడం సరికాదని ప్రైవేట్‌ విద్యాసంస్థల అసోసియేషన్లు వాపోతున్నాయి. ఇదిలా ఉండగా.. సెలవులను పొడిగించడం ద్వారా విద్యార్థుల జీవితాలతో సీఎం కేసీఆర్‌ ఆటలాడుతున్నారని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Courtesy Andhrajyothi..