-రోజురోజుకూ తగ్గుతున్న ప్రజల కొనుగోలు శక్తి
– మద్యంపై నియత్రణ ఉండాలి
– రాష్ట్ర సదస్సులో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు పుణ్యవతి
– రాజమహేంద్రవరం ప్రతినిధి
సమస్యల పరిష్కారానికి మహిళలు పెద్ద ఉద్యమించాలని ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ 9వ అఖిల భారత మహాసభల నేపథ్యంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్టు హాలులో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ‘శ్రామిక మహిళలు-ఆర్థిక, సామాజిక సవాళ్లు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. కేంద్రప్రభుత్వ విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకూ తగ్గిపోతోందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రభుత్వాలు కార్మికుల, స్కీం వర్కర్ల జీతాలు పెంచాలన్నారు. కనీస వేతనాలను రూ.21 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు. చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని, నిరుద్యోగం పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని అధికారంలోకొచ్చిన వైసిపి… మహిళలు వద్దన్న చోట షాపులను ఏర్పాటు చేస్తోందన్నారు. పండుగల్లో, జీతాలు వచ్చే ఒకటో తేదీ, డిసెంబరు 31, జనవరి ఒకటో తేదీ మద్యం షాపులను తెరవరాదని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్‌కు ఇవ్వడం సరికాదన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులకు పనికి తగిన వేతనం ఉండడం లేదన్నారు. ప్రతినెలా సక్రమంగా వేతనాలు అందడం లేదని తెలిపారు. వాటిపై దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు, వారి పోరాటాలకు టిడిపి అండగా ఉంటుందన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ రిటైర్డ్‌ అయిన అంగన్‌వాడీ వర్కర్లకు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 17 నుంచి 20వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో జరగనున్న 9వ అఖిల భారత మహాసభలను విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఐసిడిఎస్‌లను రక్షించుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఐసిడిఎస్‌ రాజానగరం, రాజమహేంద్రవరం సిడిపిఒలు సిడిపిఒ సుశీల, నర్సమ్మ ప్రసంగించారు. యుటిఎఫ్‌ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు ఎం.విజయగౌరి ‘మేలుకో మహిళ సాగిపో… ఓ మహిళ సోదరి ఉద్యమమే మన దారి’ అనే అభ్యుదయ గీతాన్ని ఆలపించారు. ఐద్వా జాతీయ నాయకులు పుణ్యవతికి రూ.10 వేల చెక్కును అందించారు.

స్కీములను ప్రభుత్వ శాఖలుగా మార్చాలి
ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ శాఖలుగా మార్చాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎస్‌.పుణ్యవతి డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ 9వ అఖిల భారత మహాసభలు నవంబర్‌ 17, 18, 19, 20 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పథకాలను పర్మినెంట్‌ చేసి ప్రభుత్వ శాఖలుగా మార్చి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచితే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించొచ్చన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. అంబానీలు, ఆదానీల బాగు కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్ల మహిళా కార్మికుల పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయన్నారు. యానిమేటర్లు, గోపాలమిత్ర, ఆశా, మిడ్డే మీల్‌, అంగన్‌వాడీ ఇలా అనేక పథకాల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పింంచాలని, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో, రాష్ట్రంలో పోషకాహార లోపంతో దళిత, గిరిజన, బలహీనవర్గాల పిల్లలు, తల్లులు మృత్యువాత పడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఓనమాలు దిద్దించి ఆటపాటలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అంగన్‌వాడీ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపర్చాలని, ప్రాథమిక ఆరోగ్య మిషన్‌ను, ఐసిడిఎస్‌ను ప్రభుత్వంలో ఒక శాఖగా మార్చాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అక్షయపాత్ర వంటి సంస్థలకు ఐసిడిఎస్‌కు అప్పగించాలని చూస్తోందన్నారు. తక్షణం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు బేబీకేర్‌ సెంటర్లుగా ఉపయోగపడుతున్నాయన్నారు. పిల్లలను పాఠశాల విద్యకు చేర్చే ఈ సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

Courtesy Prajasakti