Image result for 'సీన్' రిపీట్ sajjanar encounters"– 2008లో ‘స్వప్నిక’.. 2019లో ‘దిశ’ నిందితులు
– నాడు మూడ్రోజుల్లో..నేడు పదిరోజులకు
– ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇది ఐదో ఎన్‌కౌంటర్‌
నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అంతటి సంచలనం సృష్టించిన ‘దిశ’ లైంగికదాడి, హత్య కేసు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పేరిట నిందితులను కస్టడీలోకి తీసుకున్న గంటల వ్యవధిలోనే పోలీసులు మట్టుబెట్టడం మరోసారి వరంగల్‌ ఉదంతాన్ని గుర్తుచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో వరంగల్‌ జిల్లాలోనూ యాసిడ్‌ దాడిచేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. నాడు జిల్లా ఎస్పీగా ఉన్న సజ్జనార్‌.. నేడు సైబరాబాద్‌ సీపీగా ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించారు. ఈ సంఘటనల్లో ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ అనే అంశం పోలీసులకు ఆయుధంగా మారిందని న్యాయనిపుణులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ఇప్పటివరకు ఐదు ఎన్‌కౌంటర్లు జరిగాయి.2008 డిసెంబర్‌ 10న వరంగల్‌ కిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులు స్వప్నిక, ప్రణితలపై యాసిడ్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు వరంగల్‌ ఎస్పీగా ఉన్న సజ్జనార్‌ 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడురోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీనివాస్‌, బజ్జరి సంజరు, పోతరాజు హరికష్ణలను ఉదయం జైలుకు తరలిస్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించారని తాము జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురూ అక్కడికక్కడే మతిచెందారని పోలీసులు తెలిపారు. వరంగల్‌ తరహాలోనే షాద్‌నగర్‌ చటాన్‌పల్లిలో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ‘దిశ’ను దహనం చేసిన చోటికి గురువారం అర్ధరాత్రి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు యత్నించారనీ, అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారనీ, ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరపడంతో నలుగురు మృతిచెందారనీ పోలీసులు చెబుతున్నారు.
తెలంగాణలో ఎన్‌కౌంటర్లు ఇలా…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు ఎన్‌కౌంటర్లు జరిగాయి. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ వికారుద్దీన్‌ను 2014, ఏప్రిల్‌ 7న వరంగల్‌, నల్లగొండ జిల్లా సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం తరలిస్తుండగా పోలీసుల ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపేందుకు సిద్ధమైన వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఐదుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నారనే నెపంతో 2015 సెప్టెంబర్‌ 16న వరంగల్‌ జిల్లా వెంగలాపూర్‌ అటవీప్రాంతంలో శృతి, సాగర్‌లను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలు ఘోరాలతో పాటు భూ సెటిల్‌మెంట్లు, కబ్జాలకు పాల్పడిన నయీం ప్రభుత్వానికి సవాల్‌గా మారాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామం మిలీనియం టౌన్‌షిప్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు చేరుకుని 2016, ఆగస్టు 8న నయీంను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్‌ ఐజీగా ఉన్న సజ్జనార్‌.. నయీంకు సంబంధించిన పక్కా సమాచారం రాబట్టి, అతడిని ఎన్‌కౌంటర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారు. 2017, డిసెంబర్‌ 14న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఏడుగురు మావోయిస్టులను పోలీసులు హతమార్చగా.. ఆ సందర్భంగా ఓ గొర్రెల కాపరి బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిజనిర్ధారణ కమిటీగా టేకులపల్లి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

(Courtesy Nava Telangana)