– ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేవ్‌..
– సామాజిక వివక్షను పెంచిన ఆర్థిక వ్యవస్థ
– ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాల ఆధారంగా ‘ఇండియా ఎక్స్‌క్లూజన్‌’ నివేదిక
న్యూఢిల్లీ : వివక్ష, అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజికవర్గాలు ఉపాధి, ఉద్యోగాలు పొందటం గగనమైపోయిందనీ, వేతన జీవులుగా వారు నిలుదొక్కుకునే అవకాశాలు సన్నగిల్లాయనీ ‘ఇండియా ఎక్స్‌క్లూజన్‌ రిపోర్ట్‌ 2018-19’ తాజాగా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో జనరల్‌ కేటగిరితో పోల్చితే అణగారిన, వెనుకబడిన వర్గాలకు వేతనంతో కూడిన ఉద్యోగం పొందే అవకాశాలు క్షీణించాయనీ, ఇంతకుముందుతో పోల్చితే వివక్ష, అణచివేత మరింత పెరిగాయనీ నివేదిక స్పష్టంచేసింది. జనరల్‌ కేటగిరితో పోల్చితే ముస్లింలకు, మహిళలకు కూడా సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావటం లేదని తేలింది. ‘ఎన్‌ఎస్‌ఎస్‌ఓ’ నివేదికలో పేర్కొన్న గణాంకాల ఆధారంగా ‘ద సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌’ వారు ఈ రిపోర్టును రూపొందించారు.
ఈ రిపోర్టులోని మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. జనరల్‌ కేటగిరితో పోల్చితే ఎస్పీ, ఎస్టీలకు వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందటం కష్టంగా మారింది. ఉపాధి అవకాశాలు క్షీణించాయి. సమానవేతనం పొందలేక పోతున్నారు. వాస్తవిక ఆర్థిక వృద్ధి సాధించినప్పుడు అణగారిన వర్గాలకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కానీ ఇండియాలో నమోదవుతున్న ఆర్థిక వృద్ధి అణగారిన వర్గాలపై వివక్ష, అణచివేతను మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొన్నది.
ఉద్యోగాల్లో పడిపోయిన ముస్లింల సంఖ్య
వేతనంతో కూడిన ఉద్యోగాల్లో ముస్లింల సంఖ్య పడిపోయింది. ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాలు చాలా స్పష్టంగా చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కార్మికశక్తిలో మహిళల ప్రాతినిథ్యం కూడా తగ్గింది. వంటపని, ఇంటిపని…తదితరమైన అసంఘటితరంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పురుషులతో పోల్చితే మహిళలకు సమానవేతనం దక్కటం లేదు.
స్థిరమైన వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఆరోగ్యబీమా… వసతులకు దూరంగా బతుకులు వెళ్లదీయాల్సి వస్తోంది. జనరల్‌ కేటగిరితో పోల్చితే సమాన అవకాశాలు దక్కటం లేదని గణాంకాలు చెబుతున్నాయి.
వేధిస్తున్న…తక్కువ వేతనం
దేశ జనాభా 137కోట్లు దాటింది. సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేక కోట్లాది మంది అల్లాడుతున్నారు. అసంఘటితరంగంలో, వ్యవసాయరంగంలో పనికి తగిన వేతనాలు అందటం లేదు. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించకుండా, పారిశ్రామికవిధానంలో మార్పులు చేయనంత వరకు సత్ఫలితాలు రావని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు, విద్యవైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావటం, కార్మికహక్కుల్ని పరిరక్షించటం…వెంటనే దృష్టిసారించాల్సిన అంశాలని నివేదిక సూచించింది.
జీఎస్టీతో ప్రమాదం…
ప్రస్తుత పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాల్సిన అవసరముందని నివేదిక తెలిపింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఒకలా…బడా కార్పొరేట్‌ కంపెనీలకు మరొకలా జీఎస్టీ పన్నులు వర్తిస్తున్నాయనీ, దీనిని సవరించాలనీ పేర్కొన్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో అసంఘటితరంగం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. జీఎస్టీ పన్నుల విధానం అసంఘటితరంగంలోని పరిశ్రమల వ్యయాన్ని మరింత పెంచింది. పన్నుల విధానం అసమానంగా ఉందని నివేదికలో తెలిపారు.

Courtesy Navatelangana