రచయిత: బి భాస్కర్

సాగు గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకొని ఆంధ్రప్రదేశ్లో 2014- 19 అంటే తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర నేర నమోదు బ్యూరో అందించిన వివరాల ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ ఈ గణాంకాలన్నీ బయటపెట్టారు. అయితే వీరిలో కేవలం 391 కుటుంబాలకు మాత్రమే గత ప్రభుత్వం పరిహారం అందించింది. సాధారణంగా అన్నదాతల ఆత్మహత్యలు అన్నీ సక్రమంగా నమోదు కావు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అధికార గణం కూడా రైతు ఆత్మహత్యలని వేరే కేటగిరీల కింద ఇస్తుంటారు. అందువల్ల ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని రైతు నాయకులు పేర్కొంటున్నారు. బలవన్మరణానికి గురైనవారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందినవారే అంటే పేదల్లోనే అతి పేదల అన్నమాట. ఇంటి పెద్దను కోల్పోయిన ఈ కుటుంబాలన్నీ నేడు దుర్భర పరిస్థితుల మధ్య జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారు. అనేక మంది ఇళ్లల్లో పిల్లల చదువులు ఆగిపోయి వారు బాలకార్మికులుగా మారిపోయారు. రైతు ఆత్మహత్య అంతే అవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు. వేలాది కుటుంబాల జీవితాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. దేశ వ్యవసాయ అభివృద్ధి ప్రజల ఆహార భద్రత మన అన్నదాతల తోనే సాధ్యం. కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితులు తారుమారై పోవటంతో ఇందులో అత్యధికంగా నష్టపోయేది స్త్రీలు, పిల్లలు, వృద్ధులు రోగగ్రస్తులు. ఆయా ఇళ్లల్లోని యువత జీవితాలు వారి భవిష్యత్ పై ఆశలు ఛిద్రమవుతాయ. నేడు కొత్త ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా  ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాలు వెలికి తీయించి కుటుంబానికి 7లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించింది. గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి మాత్రమే ఈ రైతు ఆత్మహత్యల గణాంకాల్ని ఉపయోగించుకోకుండా నిజంగా బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తేనే జగన్ ప్రభుత్వ చిత్తశుద్ది బయటపడుతుంది.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)