• హాథ్రస్‌పై యూపీ సర్కార్‌కు సుప్రీం ప్రశ్న
  • సీబీఐ దర్యాప్తుపై నిర్ణయం వాయిదా
  • శాంతి భద్రతల కోసమే అర్ధరాత్రి దహనం
  • యోగి సర్కార్‌ వివరణ
  • నిందితులతో టచ్‌లో ఉన్న బాధితురాలు
  • పోలీసుల కొత్త ట్విస్ట్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్ర్‌సలో ఓ 19-ఏళ్ల దళిత అమ్మాయిని హత్యాచారం చేసిన ఘటన ఘోరమని, దారుణమని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ కేసును సమగ్రంగా విచారించేముందు అసలు.. సాక్షులకు  యూపీ ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తోంది, బాధిత కుటుంబం ఎవరైనా న్యాయవాదిని పెట్టుకుందా లేదా… మొదలైన వివరాల కావాలని, బుధవారం లోగా వాటిని సమర్పించాలని చీఫ్‌ జస్టిస్‌ శరద్‌ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే యూపీ సర్కారు తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తు షార్‌ మెహతా మరో రోజు- అంటే గురువారం దాకా గడువు కోరగా- అందుకు అంగీకరించిన బెంచ్‌- విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. కాగా- కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు తమకు సమ్మతమేనని, ఇందుకు సుప్రీంకోర్టు ఆదేశించాలని యూపీ సర్కార్‌ బెంచ్‌కు విన్నవించింది. దీనిపై- ‘దర్యాప్తు సజావుగా సాగేట్లు చూస్తామనీ, అలహాబాద్‌ హైకోర్టులో ప్రొసీడింగ్స్‌ ఎలా సాగాలన్న దానిపై కేసులోని అన్ని పక్షాలూ సూచనలు చేయాలని, వాటిని చూసి ఇది మరింత పకడ్బందీగా ఎలా జరపాలన్నది నిర్ణయిస్తామని బెంచ్‌ పేర్కొంది.

కాగా- శాంతి భద్రతలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే హతురాలి మృతదేహానికి అర్థరాత్రి దాటాక దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చిందని యూపీ సర్కారు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ‘సెప్టెంబరు 29న బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆ రోజున ఆసుపత్రి వెలుపల జరిగిన అవాంఛనీయ ఘటనల్లాంటివి మరునాడు యూపీ అంతటా జరగవచ్చని మాకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. అందుకే పోలీసు బందోబస్తు మధ్య పూర్తిగా శాస్త్రాచారంగా దహనసంస్కారాలు నిర్వహించాం’ అని ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఓ అఫిడవిట్‌లో తెలియజేసింది.

బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి- కోర్టు పర్యవేక్షణలో ఆ దర్యాప్తు జరగేట్లు చూడాలని ప్రజాహిత దావా వేసిన సత్యమా దూబే అనే వ్యక్తి కోరారు. మరోవైపు, ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందని నలుగురు వ్యక్తులతో బాధితురాలు పూర్తిగా టచ్‌లో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్‌  పోలీసులు తాజాగా బయటపెట్టారు. వారి మధ్య దాదాపు 104 సార్లు ఫోన్‌లో సంభాషణ నడిచిందని కాల్‌ డేటాను విశ్లేషించిన పోలీసు అధికారులు తెలిపారు. కాగా, హాథ్రస్‌ దారుణాన్ని నీరుగార్చేందుకు, కేసును ఏదో విధంగా మూసేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. మరోవైపు వామపక్ష నేతలు- సీతారాం ఏచూరి, డి రాజా, బృందా కారత్‌ మొదలైన వారు మంగళవారం నాడు హాథ్రస్‌ వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

రేప్‌ జరగలేదు
‘‘బాధితురాలిపై అత్యాచారం జరగలేదని అలీగఢ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ఎలాంటి చీలిన గాయాలు, బొప్పి కట్టిన దాఖలాలు, కముకు దెబ్బలు లేవని, ఒరిపిడి జరిగినట్లు, చర్మం గీసుకుపోయినట్లు లేదని తేల్చారు. ఆగ్రాలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా రేప్‌ జరగలేదని నివేదిక వచ్చింది’’ అని సుప్రీంకోర్టుకు యూపీ సర్కారు వివరించింది.

యూపీలో ఆగని అత్యాచారాలు 

  • ఇద్దరు బాలికలపై అత్యాచారం
  • బాధితుల్లో బధిర బాలిక
  • ఆరేళ్ల బాలిక రేప్‌.. మృతి
  • మహిళ దహనానికి యత్నం

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. గోరఖ్‌పూర్‌ జిల్లా చౌరీచౌరా గ్రామంలో ఒక బధిర యువతి(18)ని పింటూ ప్రసాద్‌ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. హాథ్రస్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఆరేళ్ల బాలికను 15ఏళ్ల బాలుడు అపహరించి అలీఘర్‌ జిల్లాలోని తన ఇంట్లో బంధించాడు. ఆ బాలికను అత్యాచారం చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్న బాలుడి తల్లి పరారీలో ఉంది. బాధితురాలికి ఆమె వరుసకు మేనత్త. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. అయితే, బాలుడి తల్లిని ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడంపై బాలిక మృతదేహంతో ఆమె సంబంధీకులు మంగళవారం హాథ్ర్‌సలో ఆందోళనకు దిగారు. దీంతో సంబంధిత పోలీసు అధికారిని సస్పెండ్‌ చేశారు. ప్రతాప్‌గఢ్‌ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఆమె ఇంటి పక్కనే ఉండే వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Courtesy Andhrajyothi