– కరోనా సాకుతో కార్మికుల శ్రమ దోచుకుంటారా?
– పనిగంటలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు

న్యూఢిల్లీ : కార్మికుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పని గంటలను పెంచుతూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉత్తర్వులను రద్దు చేసింది. కార్మిక చట్టాలను తొలగించడానికి కోవిడ్‌ మహమ్మారి కారణం కాదని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డివై చంద్రచూడ్‌, కెఎం జోసెఫ్‌, ఇందు మల్హోత్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ అనేది పబ్లిక్‌ ఎమర్జెన్సీ కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ మందగమన భారం మొత్తాన్ని ఒక కార్మికులపై మోపడం సరికాదని తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో గుజరాత్‌లోని బీజేపీ సర్కారు ఏప్రిల్‌ నెలలో ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపును కల్పించింది. అలాగేకార్మికుల పని గంటలు 12 గంటలకు పెంచింది. అదనపు పనిగంటలకు ఓ.టి చెల్లింపులు లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ గుజరాత్‌ మజ్దూర్‌ సభ, ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కార్మికుల కనీస భద్రత, ప్రాథమిక హక్కులు, రక్షణకు తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉన్నదని పిటిషన్‌లో కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ మేరకు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. కాగా, గుజరాత్‌తో పాటు హర్యానా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లు కూడా కార్మికుల పని గంటలను పెంచిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

Courtesy Nava Telangana