ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీం కోర్టు కొత్త వివాదాన్ని సృష్టించడం విచారకరం. తరతరాలుగా అన్ని విధాలుగా అంటరానితనానికి, అణచివేతకు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్లను అమలు చేయాలని, తద్వారా ప్రజల మధ్య సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని కల్పించాలని భారత రాజ్యాంగం స్పష్టీకరించింది. ప్రభుత్వాలు రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టినప్పుడు, న్యాయ సమీక్ష ద్వారా జోక్యం చేసుకొని తప్పులను సరిదిద్ది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన సర్వోన్నత న్యాయస్థానం తద్భిన్నంగా వివాదాస్పద రీతిలో వ్యవహరించడం ఆందోళనకరం.

ఉత్తరాఖండ్‌లో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో ఎస్‌సీ, ఎస్‌టీ కోటా అమలు పర్చాల్సిన అవసరం లేదని, ఆ రాష్ట్ర బీజేపీ సర్కారు అడ్డం తిరిగింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు పరచి రిజర్వేషన్లను విధిగా అమలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా, హైకోర్టు ఆదేశాలను సుప్రీం రద్దు చేయడమే కాకుండా, రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని అనవసర, సందర్భ రహిత భాష్యం చెప్పి రాజ్యాంగం నిర్దేశించిన సామాజికన్యాయ స్ఫూర్తిని ప్రమాదంలోకి నెట్టింది. న్యాయాన్ని పరిరక్షించడం కోర్టుల ప్రధాన బాధ్యత. అణచివేసే శక్తులకు, అణగారిన శక్తుల మధ్య తలెత్తిన వివాదంలో ఎటువైపు తాము నిలుచుంటీ సామాజిక న్యాయం సిద్ధిస్తుందో న్యాయమూర్తులకు తెలియనిది కాదు. అటువంటప్పుడు రాజ్యాంగం ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించగా, అది వారికి హక్కు కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానం చేయడం ఏ సందేశం ఇస్తుంది? అడ్డూ అదుపు లేకుండా కుల పంచాయతీలతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న శక్తులు ఏ ప్రాథమిక హక్కు దన్నుతో చెలరేగుతున్నాయి? దానిని పట్టించుకోకుండా కోర్టులు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేయడం సామాజిక న్యాయానికి విఘాతమే అవుతుంది.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకొచ్చి ఏడు దశాబ్దాలు దాటినా మన సమాజంలో కుల పరమైన అంతరాలు, వివక్ష సమసి పోలేదన్నది అక్షర సత్యం. కాగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి. నేటికీ దళితుల, ఆదివాసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు మారిందేమీ లేదు. సామాజిక వెనకబాటు కొనసాగుతూనే ఉంది. ఆ వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, సంఘ బహిష్కరణలు ఆగింది లేదు. సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ కొన్ని ఉన్నత వర్గాలకు అప్రకటిత హక్కుగా మారిపోయాయి. దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలు అక్కడక్కడ చైతన్యం తెచ్చుకొని తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించడమే అరుదు కాగా, న్యాయం కోరుతూ తమ ముందుకొచ్చిన అలాంటి వ్యాజ్యాల్లో సైతం న్యాయస్థానాలు అణగారిన వర్గాలకు న్యాయం చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించడం సబబు కాదు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి, కార్పొరేట్‌, ప్రయివేటు రంగం విస్తరిస్తోంది. కార్పొరేట్లు సామాజిక న్యాయం తమ బాధ్యత కాదని, కేవలం లాభాలు పోగేసుకోవడమే తమ లక్ష్యమని రిజర్వేషన్లను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, కొన్ని ప్రాంతీయ పార్టీలు కార్పొరేట్ల వాదనకు జై కొడుతున్నాయి. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇలాంటి వ్యాఖ్య చేయటం ఆందోళనకరం.

ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శకత్వంలో నడుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మను సిద్ధాంత భావజాలాన్ని వీలు చిక్కిన సంస్థలు, వ్యవస్థల్లోకి బలవంతంగా ఎక్కిస్తోంది. ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్లపై సమీక్షించాలన్నారు. అంతకు ముందు వాజ్‌పేయి హయాంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలన్నారు. తరచూ ‘పరివారం’ నేతలు విశ్వవిద్యాలయాలు, ఐఐటి లు దండగ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ప్రభావం అప్పుడప్పుడు న్యాయవ్యవస్థలో కనిపిస్తోంది. రామజన్మభూమి తీర్పు, శబరిమల జడ్జిమెంట్‌పై రాజ్యాంగ ధర్మాసనం నెలకొల్పే యత్నం ఆ కోవలోకే వస్తాయి. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే విధంగా గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కూడా అలాంటిదే. ఆయా వర్గాలు, ప్రజలు ఉద్యమించడంతో కేంద్రం దిగొచ్చి సవరణతో పాత చట్టాన్ని పునరుద్ధరించింది. కోర్టులు ఎప్పటికీ ఆ అంశాలను ముట్టుకోలేని విధంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌ బీజేపీ పట్టించుకోలేదు.

సరిగ్గా ఇప్పుడే, ఆ అంశంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని చట్ట సవరణ రాజ్యాంగబద్ధమేనంటూనే నిందితులకు కోర్టులు ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చని అట్రాసిటీ చట్టాన్ని పలచన చేసింది. సుప్రీం నుంచి రిజర్వేషన్లపై వెలువడిన భాష్యాలు, తీర్పుపై సోమవారం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం స్పందన దుర్మార్గంగా ఉంది. తక్షణం కేంద్రం స్పందించి కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలి. ఆ లోపు తీర్పు ప్రభావం పడకుండా స్టే తీసుకురావాలి. పార్లమెంట్‌ ఉభయసభల్లో రిజర్వేషన్ల అమలుకు తీర్మానం చేయాలి. సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ కేంద్రంపై ఒత్తిడి చేయాలి. న్యాయస్థానం సైతం తన తీర్పుపై సమీక్షించి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యానాలు వెనక్కి తీసుకోవాలి.

Courtesy Nava Telangana